కొలంబస్ లో ధీంతానా పోటీలు

ఉత్తర అమెరికా తెలుగు అసోసియేషన్ (తానా) మరియూ తెలుగు అసోసియేషన్ ఆఫ్ సెంట్రల్ ఒహాయో (టాకో) సంయుక్తంగా నిర్వహించిన ధీంతానా ప్రతిభా ప్రదర్శన పోటీలు మే 31వ తారీఖున కొలంబస్ లో ఉన్న హేస్టింగ్స్…

ఉత్తర అమెరికా తెలుగు అసోసియేషన్ (తానా) మరియూ తెలుగు అసోసియేషన్ ఆఫ్ సెంట్రల్ ఒహాయో (టాకో) సంయుక్తంగా నిర్వహించిన ధీంతానా ప్రతిభా ప్రదర్శన పోటీలు మే 31వ తారీఖున కొలంబస్ లో ఉన్న హేస్టింగ్స్ మిడిల్ స్కూల్ ఆడిటోరియంలో 500 పై చిలుకు ప్రేక్షకులుతో దిగ్విజయంగా జరిగాయి.

 సుమారు నూట ఇరవైమందికి పైగా పెద్దలూ, పిన్నలూ శాస్త్రీయ మరియూ సినిమా సంగీత, నృత్య విభాగాలలోనూ అలాగే మిస్ టీన్ తానా, మిస్ తానా, మిసెస్ తానా విభాగాల్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. అత్యంత నిపుణతతో అలంకరించిన వేదిక, Cat Walk కోసం చేసిన Ramp అందరినీ విశేషంగా ఆకర్షించాయి. తెలుగు అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ రవి సామినేని స్వాగత వాక్యాలతో కార్యక్రమానికి నాంది పలికారు. ఆ తరువాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా తానా అధ్యక్షులు శ్రీ నన్నపనేని మోహన్, ధీంతానా కార్యదర్శులు శ్రీ మనోరమ గొంధి, శ్రీ జోగేశ్వర రావ్ పెద్దిబోయిన, శ్రీదేవి మానేపల్లి, భారతి ఐత్య, తానా మీడియా భాగస్వామి శ్రీ సునీల్ పాంత్రా, షర్మిల సామినేని తదితరులు జ్యోతిని వెలిగించి పోటీలని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి వాఖ్యాతలుగా శ్రీ రామచంద్రరావ్ రేవూరు, మహీధర్ వన్నె, దిషా పెనుమంచి, సరితా రావిపాటి, గీతా నోరి, జ్యోతి దండు, వీణా కామిశెట్టి, సిద్ధార్ధ్ రేవూర్ వ్యవహరించారు.

శిశుర్వేక్తి, పశుర్వేక్తి, వేక్తి గానరసం ఫణి: అన్నట్లుగా శాస్త్రీయ సంగీతంతో పోటీలు ప్రారంభమయి, ఆ తరువాత చలనచిత్రానికి సంబంధించిన పాటలతో చిన్నారులందరూ ప్రేక్షకులని మంత్రముగ్ధులని చేశారు. శాస్త్రీయ సంగీతానికి న్యాయనిర్ణేతలుగా శ్రీ రాజేశ్వరి గోపాల్, శ్రీ సీతాలక్ష్మి, శ్రీ శ్రీరామ్ శఠగోపన్ గార్లు వ్యవహరించారు. అలాగే సినిమా మరియూ జానపద నృత్య విభాగానికి న్యాయ నిర్ణేతలుగా శ్రీ సుధా ఆకెళ్ళ, శ్రీ రామ్ దుర్వాసుల, శ్రీ లలిత గొడవర్తి గార్లు వ్యవహరించారు.

ఆ తరువాత “ఆంగికం భువనం యస్య” అని చెప్పినట్లు శాస్త్రీయ, సినిమా పాటలకి వైవిద్యభరితమైన నృత్యాలని చిన్నారులు ప్రదర్శించి అందరినీ సమ్మోహితులని చేసి వారి ప్రసంశలని, మన్ననలని అందుకొన్నారు. న్యాయ నిర్ణేతలుగా శ్రీ మాధవి సుధీర్, శ్రీ వర్ధిని పత్తిపాటి, శ్రీ జయంతి సేన్ గార్లు వ్యవహరించారు. సంగీత, నృత్య విభాగాలలో ప్రధమ, ద్వితీయ విజేతలకు పతకాలు, బహుమతులను ధీంతానా కార్యవర్గం అందచేశారు.

టాకో కార్యవర్గ అద్యక్షులు రవి సామినేని కొలంబస్ ధీంతానా కార్యవర్గం తరఫున తానా అద్యక్షులు శ్రీ మోహన్ నన్నపనేని గారిని, తదితర తానా సభ్యులనందరినీ సత్కరించారు. ఆ తరువాత ప్రసంగించిన శ్రీ మోహన్ నన్నపనేని కొలంబస్ ధీంతానా కార్యవర్గాన్ని అలాగే పోటీలలో పాల్గొన్న వారలనందరిని అభినందించి, కొలంబస్ తెలుగువారిని సాదరంగా డెట్రాయిట్ మహానగరంలో జులై మాసంలో జరగబోతున్న తానా సభలకి అహ్వానించారు. మోహన్ నన్నపనేని గారు, తెలుగు అసోసియేషన్ అధ్యక్షులు రవి సామినేని గారిని, కొలంబస్ ధీంతానా కార్యవర్గ సభ్యులైన శ్రీ గణేష్ వఠ్యం, శ్రీ శ్రీనివాస్ ఎలవర్తి, శ్రీ గీతా నోరి, శ్రీ జ్యోతి దండు, శ్రీ వీణా కామిశెట్టి గార్లను అభినందించి సత్కరించారు. శ్రీ మోహన్ నన్నపనేని, శ్రీ రవి సామినేని సంయుక్తంగా స్క్రిప్స్ స్పెల్లింగ్ బీ పోటీ Finals కి చేరిన కొలంబస్ నగరానికి చెందిన విద్యార్ధిని లిపిక నారిశెట్టిని అభినందించి బహుమతిని అందించారు. శ్రీ రవి సామినేని కొలంబస్ ధీంతానా Grand Sponsors Garudavega Courier Service, United Software Group, Siri Info Solutions Inc, శ్రీ జగదీష్ ప్రబల గార్లకు  అలాగే సుమారు పదిగంటల పాటు జరిగిన ఈ కార్యక్రమాన్ని విసుగు విరామం లేకుండా చెరగని చిరునవ్వుతో తన కామెరాతో కవర్ చేసిన tv9 కామెరామెన్ శ్రీ భాస్కర్ గారికి అభినందన శుభాకాంక్షలు తెలిపారు.

కొలంబస్ మహానగరంలో తొలిసారిగా జరిగిన టీన్, మిస్, మిసెస్ తానా పోటీలలో “అదిరేటి డ్రెస్స్ మేమేస్తే, బెదిరేటి లుక్స్ మేమిస్తే” అని అన్నట్లు తెలుగు టీనేజ్ పిల్లలు, అవివాహితలైన యువతులు, గృహిణులు పాల్గొని కార్యక్రమానికి ఒక వెలుగుని కళని తీసుకుని వచ్చారు. భళా అన్నరీతిలో జరిగిన ఈ పోటీలకి న్యాయనిర్ణేతలుగా శ్రీ గీత విద్దం, శ్రీ స్మిత రెడ్డి, శ్రీ రాధిక గడ్డం గార్లు వ్యవహరించారు. ధీంతానా కార్యవర్గం విజేతలకి కిరీటం, పతకం తొడగటంతో పోటీలు విజయవంతంగా ముగిశాయి. ఆఖరుగా భారత జాతీయగీతం ఆలాపనతో ఈ కార్యక్రమం జయప్రదంగా ముగిసింది.