జూనియర్ ఎన్టీఆర్ మంచి నటుడు. ఓ నటుడికి కావాల్సినవి అన్నీ పరిపూర్ణంగా వున్నవాడు. కానీ టైమ్ కలిసి రావడం లేదు..సరైన ప్రాజెక్టులు పడడంలేదు. ఇప్పుడు ఆ ఇబ్బంది తీరిపోయేలా కనిపిస్తోంది.
సుకుమార్ తో బివివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించే సినిమా ఎట్టకేలకు పట్టాలకుఎక్కుతోంది. సినిమాకు సంబంధించిన సినిమాటోగ్రాఫర్, ఆర్ట్ డైరక్టర్ తదితరులు లోకేషన్ల సెలక్షన్ కు ముందుగా యుకె వెళ్లారు. మిగిలిన క్రూ మరో వారంలో వెళ్లడానికి రంగం సిద్ధం చేసుకుంటోంది.
అత్తారింటికి దారేది, జులాయి, సత్యమూర్తి సినిమాల తరువాత ఏస్ డైరక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తొలిసారిగా ఎన్టీఆర్ తో సినిమా చేయాలని డిసైడ్ అయ్యారు. ఈ మాట చెప్పడం..వెంటనే ఎన్టీఆర్ ఓకె చేయడం జరిగిపోయాయి. బేసిక్ స్టోరీ లైన్ కూడా ఓకె అయినట్లు తెలుస్తోంది. సుకుమార్ సినిమా ఇంకా డిలే అవుతుందేమో, ఈలోగా ఇది కానిచ్చేద్దాం అన్న ఆలోచన కూడా చేసినట్లు వినికిడి. ఈ సంగతి తెలిసి సుకుమార్ టీమ్ స్పీడప్ అయినట్లు తెలుస్తోంది.
సుకుమార్ సినిమా ఓ కొలిక్కి వచ్చేలోగా త్రివిక్రమ్ తన స్క్రిప్ట్ ను, ఇతరత్రా వ్యవహారాలను పకడ్బందీగా పూర్తి చేయాలనుకుంటున్నారు. సత్యమూర్తి నిర్మించిన చినబాబు (రాధాకృష్ణ) ఈ సినిమాను నిర్మిస్తారు. వాస్తవానికి ఈ టీమ్ మహేష్ బాబుతో సినిమా చేయాలనుకున్నారు. కానీ మహేష్ ముందుగా బ్రహ్మోత్సవం కమిట్ కావడంతో, ఇప్పుడు ఎన్టీఆర్ వైపు వచ్చారు. త్రివిక్రమ్ ప్రస్తుతం తీస్తున్న ఫ్యామిలీ ఎమోషన్స్ జోనర్ కు ఎన్టీఆర్ బాగా సూటవుతాడు. బృందావనం సినిమా ఇక్కడ గుర్తుకు వస్తుంది.
ఇదిలా వుంటే ఎప్పటి నుంచో ఇదిగో, అదిగో అంటూ వార్తల్లో నలుగుతున్న కత్తి సినిమా కూడా ఇప్పుడు ఎన్టీఆర్ దగ్గరకు వచ్చినట్లు తెలుస్తోంది. తమిళంలో విజయ్ తో మురుగదాస్ నిర్మించిన సినిమా ఇది. టాగూర్ మధు దగ్గర దీని హక్కులు వున్నాయి. పవన్, అల్లు అర్జున్ ఇలా చాలా మందిని అనుకుని ఇప్పుడు ఎన్టీఆర్ దగ్గరకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవల పండగ చేస్కో సినిమా ను అందించిన గోపీచంద్ మలినేని ఈ సినిమాను రీమేక్ చేయాలని చూస్తున్నట్లు తెలుస్తుంది.
మొత్తం మీద సుకుమార్, త్రివిక్రమ్, గోపీచంద్ మలినేని ఇలా మంచి ప్రాజెక్టులు ఎన్టీఆర్ చేతిలోకి రావడం అతని అభిమానులకు శుభవార్తే కదా?