అక్షర్ పటేల్.. బౌలింగ్ ఫ్రమ్ అదానీ ఎండ్, అశ్విన్ రవి.. బౌలింగ్ ఫ్రమ్ రిలయన్స్ ఎండ్.. ఇండియా, ఇంగ్లండ్ ల మధ్యన నరేంద్రమోడీ స్టేడియంలో జరుగుతున్న డే అండ్ నైట్ టెస్టులో ప్రేక్షకులకు టీవీ చానళ్లు, కామెంటరేటర్లు ఇచ్చిన సమాచారం ఇది!
బౌలర్లు ఏ ఎండ్ నుంచి బౌలింగ్ చేస్తున్నారో లైవ్ టెలికాస్ట్ చేసే చానళ్లు టీవీ స్కోర్ బోర్డులో చెప్పడం రొటీనే. క్రికెట్ లో ఇది సాధారణమే. చాలా స్టేడియంలలో క్రికెటర్ల పేరిట ఈ ఎండ్స్ ఉంటాయి. గవాస్కర్ ఎండ్, సచిన్ టెండూల్కర్ ఎండ్.. ఇలా ఉంటే, క్రికెట్ చూసే వాళ్లకు అది మరో ఉత్తేజం!
స్టేడియంలో పెవిలియన్ లకు, స్టాండ్స్ కు మాజీ ప్లేయర్ల, క్రీడా ధిగ్గజాల పేర్లు పెట్టడం సంప్రదాయం. అలాంటి సంప్రదాయాలను మనదేశంలో చాలా చోట్ల ఫాలో అవుతారు.
అయితే దేశంలో క్రికెట్ కమర్షియల్ అయ్యాకా, గ్లామరస్ గా మారాకా.. రాజకీయ నేతలు వాటిల్లోకి చొరబడ్డాకా ఆ సంప్రదాయాలను వీలైనంతగా తుంగలోకి తొక్కుతున్నారు. ఈ క్రమంలో ప్రపంచంలోనే అత్యున్నత ప్రమాణాలతో నిర్మితమైనదిగా చెప్పబడుతున్న నరేంద్రమోడీ స్టేడియంలో ఎటు చూసినా రాజకీయం, కార్పొరేట్ కనిపిస్తోంది తప్ప.. క్రికెట్ కనిపించడం లేదు!
రిలయన్స్ ఎండ్ ఒకవైపు, అదానీ ఎండ్ మరోవైపు! ఈ స్టేడియం నిర్మాణానికి వారు డబ్బులు ఇచ్చారేమో! కాబట్టి.. వాళ్ల పేర్లు పెట్టేసినట్టున్నారు. అయితే రాజకీయ నేతల పేర్లు, లేకపోతే డబ్బులిచ్చిన కార్పొరేట్ల పేర్లు! ఇదీ నయా ఇండియా.
యువతలో క్రికెట్ స్ఫూర్తిని ఇచ్చేలా మాజీ ఆటగాళ్ల పేర్లు, ధిగ్గజాల పేర్లు పెట్టే రోజులు ఇక పోయినట్టే. క్రికెటర్లు ఎవరైనా తమ పేర్లతో స్టాండ్స్ ఏర్పడేంత స్థాయికి ఎదగాలనే లక్ష్యాలేవీ పెట్టుకోనక్కర్లేదు. అలాంటి ఖ్యాతినికి కార్పొరేట్లు డబ్బులిచ్చి కొనుక్కొంటాయి, రాజకీయ నేతలు తమ పరపతిని ఉపయోగించుకుని పెట్టుకుంటారు! ఆటలో స్ఫూర్తి మాత్రం మాయం!
చంద్రబాబు మెదడును విజయవాడ మ్యూజియంలో పెట్టాలి