అల్లుడు శీను బడ్జెట్ లెక్కలెంతో వింటోంటే కళ్లు చెదిరిపోతున్నాయి. మహేష్, ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల సినిమాలకి అయ్యే ఖర్చుకి ఏమాత్రం తగ్గకుండా దీనికి ఖర్చు పెట్టేసారు. ఆ హీరోలంటే తమకి ఉన్న ఫాన్ ఫాలోయింగ్‌తో ఓపెనింగ్ వీక్‌లోనే ముప్పయ్ కోట్ల మైలురాయిని దాటించేయగలరు. కానీ ఒక కొత్త హీరోపై ఈ బడ్జెట్టేంటి?
వినాయక్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ఈ శుక్రవారం రిలీజ్ కానుంది. సమంత, తమన్నాల అందాలు, దేవిశ్రీప్రసాద్ పాటలు… కళ్లు చెదిరే సెట్లు, విజువల్సు.. హంగామాకి అయితే లోటు లేదు కానీ ఇంత భారీ సినిమాకి హీరో ఇమేజ్‌కి మించిన రోల్ ఇంకోటి ఉండదు. మరి బెల్లంకొండ శ్రీనివాస్ తనపై పెట్టిన భారానికి, బాధ్యతకి ఎంత న్యాయం చేస్తాడో?
ఈ చిత్రం ఓపెనింగ్ వీక్‌లోనే ఇరవై కోట్లకి పైగా షేర్ రాబట్టుకుని తీరాలని ట్రేడ్ వర్గాల వారు అంటున్నారు. ప్రేక్షకుల్ని థియేటర్లకి రాబట్టే ఆకర్షణలైతే కనిపిస్తున్నాయి కానీ తొలి రోజున వచ్చే టాక్ కూడా చాలా ఇంపార్టెంట్. మొత్తానికి మొదటి సినిమాతోనే కుర్రోడికి అగ్ని పరీక్ష ఎదురవుతోంది.