సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ కలెక్షన్ స్టామినా ఎంత వుంటుంది అన్నది ఇప్పుడు టాలీవుడ్ లో డిస్కషన్ పాయింట్ గా వుంది. ఎందుకంటే దీని ఫ్రచార వ్యూహ కర్తలు సినిమాకు బాగా హైప్ తీసుకువచ్చారు.
దర్శకుడు హరీష్ శంకర్ అంతకు మించి కష్టపడి, అందరితో వీలయినంత ఎక్కువే మాట్లాడారు. ఆ క్రమంలో ఆయన తనను తాను ఎంత తక్కువ చేసుకోవాలో అంతా తక్కువ చేసుకున్నారు. మెగాభిమానులు, మెగా క్యాంప్ జనాల అభిమానం సంపాదించడానికి ఎంత మాట్లాడాలో అంతా మాట్లాడారు. కానీ ఆయన ఈ కష్టాన్ని సినిమా మీద పెట్టి వుంటే బాగుండేది.
ఏ కొరియనో, ఇంకే పరభాష నుంచో కథ కొట్టేసినా బాగుండేది. అచ్చమైన హిట్ సినిమా తెలుగు సినిమాల నుంచి పట్టుకొచ్చారు. సరే ఈ సంగతులన్నీ పక్కన పెడితే, సినిమా సమీక్ష లైతే కాస్త అనుకూలంగానే వచ్చాయి. అయినా కూడా…కలెక్షన్లు మాత్రం ఆ లెవెల్ లో ఇంకా రావడం లేదని ట్రేడ్ లెక్కలు చెబుతున్నాయి.
గురువారం 70 నుంచి 80 శాతం ఫుల్స్ వచ్చాయని, శుక్రవారం హాలీడే అయినా అదే రేంజ్ లో వున్నాయని వినికిడి. శని, ఆది బాగుండే అవకాశం వుంది. అయితే సినిమా ఎంత కలెక్ట్ చేస్తుందంటే మాత్రం అయిదు నుంచి ఎనిమిది కోట్ల నడుమ అని లెక్కలు కడుతున్నారు.
పిల్లా నువ్వులేని జీవితం సినిమాకు ఇంతకన్నా మంచి టాక్ వచ్చిందని, దానికే పది కోట్లు దాటలేదని లెక్కలు వివరిస్తున్నారు. పైగా రాబోయే గురువారం పులి, శుక్రవారం శివం విడుదల వున్నాయి. అంటే బుధవారం లోగానే ఏం తెచ్చుకున్నా..అందువల్ల ఏడెనిమిది కోట్లు మాత్రమే చేస్తుందని అంచనాలు కడుతున్నారు.