ఢిల్లీని ఏలుతున్న ఆప్ ప్రభుత్వం చాలా విచారిస్తోంది. అక్కడ డెంగ్యూ కేసులు ఎక్కువైనందుకో, రేప్‌లు ఎక్కువైనందుకో కాదు… ఢిల్లీలో ఉన్న టీనేజర్లు మందు తాగలేకపోతున్నందుకట. దీనికోసం నిబంధనలు సైతం సడలించాలని త్వరలోనే నిర్ణయం కూడా తీసుకోనుంది చీపురు పార్టీ ఆధ్వర్యంలోని ప్రభుత్వం.
మద్యపానం విషయంలో ప్రస్తుతం ఉన్న వయో పరిమితి చాలా అన్యాయం అన్నట్టు మాట్లాడారు ఆప్ మంత్రి కపిల్ మిశ్రా. ఢిల్లీలో జరిగిన రెస్టారెంట్ నిర్వాహకుల సమావేశంలో ఈ టూరిజం శాఖ మంత్రి పాల్గొని మాట్లాడుతూ…. డ్రింకింగ్ ఏజ్ లిమిట్ టూమచ్ అన్నారు. అంతేకాదు… సరైన డ్రింకింగ్ ఏజ్ విషయంలో నిర్ధారణకు వచ్చేందుకు మంచి ప్రతిపాదనలతో ముందుకు రావాల్సిందిగా ఆయన రెస్టారెంట్ యజమానులను ఆహ్వానించారు.
ప్రస్తుతం అమలవుతున్న వాటిలో చాలా పాత కాలం నాటి చట్టాలున్నాయని వాటిని మార్చాల్సిన అవసరం ఉందని అన్నారాయన. అటువంటి వాటిలో ఒక వయసు వరకూ మద్యం తాగకూడదనే నిబంధన కూడా ఒకటన్నారు. ఇలాంటి మార్పు చేర్పులతోనే ఢిల్లీని పర్యాటకులకు స్వర్గధామంగా మార్చగలమన్నారు.
ప్రస్తుతం ఢిల్లీ నగరంలో మద్యపాన వయో పరిమితి 25 ఏళ్లుగా ఉంది. ఢిల్లీతో పాటు చంఢీఘడ్, పంజాబ్, హర్యానా, మహారాష్ట్ర, మేఘాలయలలో సైతం ఇదే నిబంధన అమలవుతుండగా మిగిలిన చోట్ల ఇది 21గా ఉంది. అయితే ఇది నిబంధన మాత్రమే కాని… ఆచరణలో అమలుకు నోచుకోవడం చాలా తక్కువే.
ఇప్పటికే ఢిల్లీలో మైనర్లు సైతం రేప్‌లకు పాల్పడుతూ ఆందోళన కలిగిస్తుంటే టీనేజర్లను మద్యానికి దూరం చేయడం అనేదేదో పెద్ద ఘోరం అన్నట్టు మంత్రిగారు మాట్లాడడం విడ్డూరం. ఈ నేతలందరికీ ఎక్కడెక్కడి నుంచో వచ్చే పర్యాటకుల ఆనందం గురించి ఉన్న శ్రధ్ద మన భావితరాల ఆరోగ్యంపై, అభివృధ్దిపై ఎప్పుడొస్తుందో…