చిరంజీవి ఇదివరలో మెగాస్టార్ కావచ్చు. మొత్తం తెలుగు చిత్ర పరిశ్రమకు ఆయన అప్పట్లో తిరుగులేని హీరో కావచ్చు. కానీ ఇప్పుడు కాదు. ఆరోజుల్లో సాగినట్లుగా అన్నీ ఇప్పుడు కూడా సాగుతాయి అనుకుంటే కుదరదు. అందుకే ఇదివరకు హవా చెలాయించినట్లుగా.. సినిమా ముహూర్తం కూడా అయిన తర్వాత దర్శకుల్ని మార్చేయడం.. సినిమా ఆపేయడం వంటి పని మెగాస్టార్ ఇప్పుడు చేయగల స్థితిలో ఉన్నారా అని అనుమానం కలుగుతోంది.
పెద్ద హీరోలకు సహజంగా ఒక ‘ఈగో’ ఉంటుంది. మెగాస్టార్ రేంజిలోని పెద్దహీరోలకు ఉండడం వింత కూడా కాదు. తను ఒకసారి సినిమా ప్రకటించిన తర్వాత.. దానికి సంబంధించిన దర్శకుడు ఆ సినిమా పూర్తయ్యే వరకు పూర్తిస్థాయిలో ఆ ప్రాజెక్టు మీదనే పనిచేస్తూ ఉండాలని మెగాస్టార్ కోరుకుంటారు. అలా కాకుండా.. మధ్యలో మరో ప్రాజెక్టును టేకప్ చేస్తే ఆయనకు చిర్రెత్తుకొస్తుంది. అది సహజం కూడా. గతంలో దీనికి ఉదాహరణలు కూడా ఉన్నాయి.
గతంలో మనసంతా నువ్వే చిత్రం దర్శకుడు ఆ వెంటనే మెగాస్టార్ అవకాశం ఇచ్చారు. చిరును ఆదిత్య డైరక్ట్ చేసే చిత్రానికి ముహూర్తకార్యక్రమం కూడా చాలా ఘనంగా నిర్వహించారు. అయితే అప్పట్లో చిరంజీవి షెడ్యూలు కాస్త బిజీగా ఉండడంతో.. రెగ్యులర్ షూటింగ్ మొదలు కావడానికి కాస్త గ్యాప్ వచ్చింది. నేను కూడా హిట్ దర్శకుడినే కదా.. ఇంత గ్యాప్ ఎందుకు తీసుకోవాలని అనే ఉద్దేశంతో ఆదిత్య.. ఈలోగా ఉదయకిరణ్తో మరో చిత్రం చేశాడు. అది కాస్తా బాక్సాఫీసు వద్ద చీదేసింది. తన సినిమా ముహూర్తం చేసి.. తర్వాత మరో చిత్రం టేకప్ చేసినందుకు చిరంజీవికి చిర్రెత్తి ఏకంగా ఆదిత్యతో ప్రాజెక్టును రద్దు చేసుకున్నారు.
చూడబోతే ఇప్పుడు సేం సీన్ రిపీట్ అవుతోంది. చిరంజీవి ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న 150వ చిత్రానికి దర్శకుడు పూరీ జగన్నాధ్ అని ప్రకటించారు. అది ఆగస్టులో మొదలవుతుంది అని కూడా చెప్పారు. అప్పటిదాకా పూరీ తన శక్తియుక్తులు అన్నీ తన ప్రాజెక్టు మీదే పెట్టి.. కథను జనరంజకంగా తీర్చిదిద్దాలని చిరు కోరుకుంటే తప్పులేదు. కానీ పూరీ ఇప్పుడు నితిన్‌తో మరో సినిమా ప్రారంభిస్తున్నాడు. జూన్ 15న నితిన్ కొత్త సినిమా షూటింగ్ మొదలవుతుందిట. ఇది కచ్చితంగా మెగాక్యాంప్ కు చిర్రెత్తించే విషయం. అయితే సుదీర్ఘకాలపు నిరీక్షణ, అనేక వడపోతల తర్వాత చిరంజీవి పూరీ జగన్నాధ్‌ను ఎంచుకున్నాడు. అలాంటిది ఇప్పుడు ఈ కారణం మీద ఆయనను పక్కకు తప్పించే ధైర్యం చిరంజీవికి ఉన్నదా అని పలువురు సందేహిస్తున్నారు.
గతంలో పూరీ, మెగాస్టార్‌కు ఆంధ్రావాలా కథ చెప్పి భంగపడ్డాడు కూడా. మళ్లీ ఇప్పుడు ఆయనతో సినిమా అనౌన్స్ అయిన తర్వాత.. మరో ప్రాజెక్టు తీసుకుంటున్నాడు. ఈ రెండు నెలలు నితిన్ సినిమా షూటింగ్లో మునిగిపోతే.. కచ్చితంగా.. చిరు సినిమా ప్రీప్రొడక్షన్ మీద ఆయన కాన్సంట్రేషన్ తగ్గుతుందనే చెప్పాలి. ఇలాంటి సమయంలో మెగాక్యాంప్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
అయినా గతంలో లాగా చిరంజీవి ఇప్పుడు మెగాస్టార్ కాదు. ఎలాంటి సినిమా చేస్తే జనం ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే భయంలో సతమతం అవుతున్న వెటరన్ హీరో. ఆయనకు లైక్ చేసే అవకాశమే తప్ప.. డిజ్లైక్ చేసి పక్కకు తప్పించేంత స్టార్డం పోయిందని కొందరి వాదన. అందుకే పిల్లి గుడ్డిదైతే ఎలుక తోక చూపించిందన్న సామెత చందంగా ఇప్పుడు దర్శకులు ఆయనను లైట్ తీసుకుంటున్నారా అనిపిస్తోంది.