ఒక్క సీటు కోసం ఇంత దిగజారుడా?

ఏ తీరాలకు వెళ్తున్నాయి..ఈ నాటి రాజకీయాలు? ఎమ్మెల్సీ ఎన్నికలు..తమకు ఎన్ని వస్తాయో అన్ని వస్తాయి..మిగిలిన వాటిని వదిలేయాలి. అధికార పార్టీ తన జనాలకు అవకాశాలు కల్పించాలంటే, సవాలక్ష. అంతే కానీ ఈ ఒక్క ఎమ్మెల్సీ…

ఏ తీరాలకు వెళ్తున్నాయి..ఈ నాటి రాజకీయాలు? ఎమ్మెల్సీ ఎన్నికలు..తమకు ఎన్ని వస్తాయో అన్ని వస్తాయి..మిగిలిన వాటిని వదిలేయాలి. అధికార పార్టీ తన జనాలకు అవకాశాలు కల్పించాలంటే, సవాలక్ష. అంతే కానీ ఈ ఒక్క ఎమ్మెల్సీ కోసం పాకులాడాల్సిన పని లేదు. పోనీ అవతలి పార్టీని అథపాతాళానికి తొక్కేయాలన్నదే ఉద్దేశమైతే, మరీ ఇంత సీన్ అక్కరలేదు. 

గెలిచిన ఎమ్మెల్సీని తమ గూటికి తెచ్చుకునే ఉపాయాలు కో కొల్లలు. గడచిన ఏడాదిగా కేసిఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న వ్యవహారమే అది. మరి ఎందుకోసం ఎమ్మెల్యేలను బెదిరించడం, అసెంబ్లీ రద్దు చేస్తా అనడం, ఆపై మీ పై విశ్వాసం వుంది అని బుజ్జగించడం, ఇవన్నీ చాలక కొత్తవాళ్లని గూటికి రప్పించుకోవడం, ఆఖరికి పత్యర్థి పార్టీ ఎమ్మెల్యేను పథకం ప్రకారం ఇరికించడం. ఇంత రచ్చ…రచ్చ..అవసరమా?

ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. అటు కాంగ్రెస్ కావచ్చు..ఇటు తెలుగుదేశం కావచ్చు..గతంలో ఎన్నడూ మరీ ఇంత దిగజారుడు రాజకీయాలకు పాల్పడింది లేదు. కెసిఆర్ కేవలం తన మొండితనాన్ని ప్రదర్శించడం కోసమో, తన పట్టుదలను నెరవేర్చడం కోసమో ఇంత చేస్తున్నారనుకోవాలి తప్ప, కేవలం ఓ అదనపు సీటు రాబట్టుకోవడం కోసమేమీ  కాదు. ఇంతోటి అదనపు సీటు, ఆరోవేలు చందం. 

కానీ కెసిఆర్ అయినా మరే రాజకీయ నాయకుడైనా ఓ విషయం గమనించాలి. ప్రజలు ఓ పరిథి వరకు ఎవరు ఎలా పోయినా పెద్దగా పట్టించుకోరు. కానీ ఒకసారి గీత దాటితే, కౌంట్ అంతకు అంతా వుంటుంది. జనాలు ఒకసారి 'ఇదేం..పనిరా' అని అనుకోవడం ప్రారంభిస్తే, చేసే అరకొర పనులు కూడా నెగిటివ్ లోకే వెళ్లిపోతాయి. 

కొత్త రాష్ట్రం వచ్చింది. కావాల్సినన్ని నిధులు, ఆదాయ అవకాశాలు వున్నాయి. అలాంటపుడు మంచి పాలన అందించి, ప్రజల మన్ననపై దృష్టి పెడితే కేసిఆర్ చరిత్రలో నిలిచిపోతారు. కేవలం సాధింపు రాజకీయాలు,. అధికార రాజకీయాలు చేసుకుంటూ విలువైన సమయం వృధా చేసుకుంటే, చేస్తున్న లేదా చేసిన కాసిన్ని మంచి పనులు కూడా కనిపించకుండా పోతాయి.

అయినా ఇలాంటి మంచి మాటలు కెసిఆర్ చెవికెక్కుతాయా?