బాహుబలి కి ఎన్ని కష్టాలో.!

తెలుగు సినిమా చరిత్ర గమనాన్ని మార్చే సినిమాగా ‘బాహుబలి’ చిత్రాన్ని యావత్‌ప్రపంచం గుర్తిస్తోంది. అంతర్జాతీయ యవనికపై తెలుగు సినిమాను గర్వంగా నిలబెట్టే చిత్రంగా ప్రచారం జరుగుతోంది.  కలెక్షన్‌ల విషయంలో వంద కోట్లు అనే బెంచ్‌మార్క్…

తెలుగు సినిమా చరిత్ర గమనాన్ని మార్చే సినిమాగా ‘బాహుబలి’ చిత్రాన్ని యావత్‌ప్రపంచం గుర్తిస్తోంది. అంతర్జాతీయ యవనికపై తెలుగు సినిమాను గర్వంగా నిలబెట్టే చిత్రంగా ప్రచారం జరుగుతోంది.  కలెక్షన్‌ల విషయంలో వంద కోట్లు అనే బెంచ్‌మార్క్ టాలీవుడ్ చరిత్రలో వినిపించదు. కానీ నిర్మాణానికి ‘వందల కోట్లు’ బడ్జెట్‌తో సినిమా అంటే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే. అందుకకే బాహుబలి కోసం ఇప్పుడు అందరూ చాలా ఆశగా ఎదురుచూస్తున్నారు. ఒకవైపు అందరిలోనూ పెరుగుతున్న ఆశలే సినిమా మేకర్స్‌ను, ప్రధానంగా రాజమౌళిని ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్రజల ఆశల్ని అందుకోవాలనే తపన వారిలో క్రమంగా… ‘అందుకోగలమా’ అనే కంగారుగా మారుతోంది. వీరబీభత్సమైన క్యాస్టింగ్, టెక్నికల్ టీం లతో రూపొందుతున్న చిత్రం ఇది. మారుతున్న పరిస్థితుల్లో సినిమాలు హిట్ అయితే చాలునని పెద్ద చిత్రాల  నిర్మాతలు కూడా గింగిరాలు కొడుతున్న ప్రస్తుత తరుణంలో.. విడుదలయ్యే అన్ని భాషల్లోనూ హిట్ అయినప్పటికీ.. పెట్టుబడిలో సగమైనా వస్తుందో లేదో అనే భయంతో.. ‘‘సూపర్ హిట్’’ అయితే తప్ప సేఫ్ ప్రాజెక్ట్‌గా మిగులుతుందనే ఆలోచనకు నిర్మాతలు సిద్ధపడుతున్నారు. 

అంతటి భారీ అంచనాల చిత్రం ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కు వేస్తూ నిరీక్షిస్తున్న అభిమానులతో దోబూచులాట ఆడుతోంది. సినిమా రిలీజ్ ను వాయిదాలు మీద వాయిదాలు వేస్తూ నీరసపరుస్తున్న యూనిట్.. చివరికి ట్రైలర్ విడుదలను కూడా వాయిదా వేసేయడం.. కేవలం నిరుత్సాహానికి గురిచేయడం మాత్రమే కాదు. రకరకాల అనుమానాలకు కూడా కారణం అవుతోంది. 

ప్లస్ అనుకున్న హైప్ కస్సున కాటేస్తోంది

సినిమా నిర్మాణంలో ఉండగా ప్రజలు నిత్యం దాని గురించి చర్చించుకుంటూ ఉండాలని .. సినిమా గురించి ఎంత ఎక్కువ హైప్ క్రియేట్ అయితే అంత ఎక్కువగా లాభాలు వస్తాయని సినీ పండితులు నానా పాట్లు పడుతుంటారు. కానీ అలాంటి హైప్ అనేది.. ఒక హద్దుదాటి పెరిగిందంటే.. సినిమాకు ఎంత భారంగా మారుతుందోననే సిద్ధాంతానికి బాహుబలి ఉదాహరణ. షూటింగ్  మొదలు కాక ముందునుంచి.. దీనికి హైప్ వచ్చేసింది. తొలుత మేకర్స్ దీన్ని పాజిటివ్‌గానే తీసుకున్నారు. రానురాను హైప్ పెరిగిపోయింది. ఇప్పుడు వాళ్లే భయపడుతున్నారు. సూపర్ సూపర్ హిట్ అయితే తప్ప దీన్నుంచి బయటపడలేం అనుకుంటున్నారు. 

రాజమౌళి తలను మించిన తలపాగా చుట్టేశారు. అది తలను ముంచేస్తుందేమో అనిపిస్తోంది. మరి దాన్ని ధరించడం ఎలాగ? అనేది కంగారుగా ఉంది. 

తెలుగు సినిమా చరిత్రలో మకుటాయమానం ఈ చిత్రం అంటూ ఇప్పుడు ఎవరైనా మాయాబజార్ గురించి పొగిడితే మనకు బాగానే ఉంటుంది. కానీ.. అది తీస్తున్న సమయంలో.. ఇదే తరహా పొగడ్తలతో ఊదరగొట్టేసి ఉంటే గనుక.. బహుశా దిగ్దర్శకుడు కెవి రెడ్డి కూడా కాస్త కంగారు పడిఉండేవారేమో!

తొలినుంచి రవ్వంత కన్ఫ్యూజన్…

తెలుగు ఇండస్ట్రీ దర్శకుల్లో రాజమౌళికి నిర్ద్వంద్వంగా నెంబర్‌వన్ స్థానాన్ని కట్టబెట్టవచ్చు గాక. కానీ ఆయనలో తొలినుంచి ఒక కన్ఫ్యూజన్ ఉంటుందని ఎరిగిన వారు చెబుతుంటారు. ఆలోచనల్లో మెదిలే రూపానికి, అవుట్‌పుట్‌గా తయారవుతున్న దానికి మధ్య గ్యాప్ ఉన్నప్పుడు.. ఆ కన్ఫ్యూజన్ పెరిగి సతమతం అవుతుంటారనేది కూడా తెలిసిన వారి మాట. తను ఎంత గ్రాండ్ గా ఇమేజిన్ చేస్తాడో.. అంత గ్రాండ్ గా దానిని తన సహచర టెక్నీషియన్లకు ‘కమ్యూనికేట్’ చేయడంలో ఆయన ఇబ్బందిపడుతుంటారు. దాని ప్రభావం.. ఆయన రేంజి ఇమేజినేషన్ అవుట్‌పుట్ లో కనిపించకపోవడం.. ఆయన అసంతృప్తికి గురికావడం జరుగుతుంటుంది.

గతంలో ‘ఈగ’ చిత్రం విషయంలో కూడా అదే జరిగింది. తొలుత ఈ చిత్రానికి ఒక విదేశీ కెమెరామెన్‌ను పెట్టుకున్నారు. ముహూర్తం కూడా అతనితోనే జరిగింది. ఓ వారం రోజుల షూటింగ్ తర్వాత.. అవుట్‌పుట్ రాజమౌళికి సంతృప్తి కరంగా అనిపించలేదుట. తన ఊహల్ని అతనికి కమ్యూనికేట్ చేయడంలో రాజమౌళి ఇబ్బంది పడ్డారని అంటారు. తర్వాత.. తన ఆస్థాన కెమెరామెన్ సెంథిల్‌నే పెట్టుకున్నారు 

బాహుబలి వంటి భారీ చిత్రం రూపకల్పనలో అలాంటి కన్ఫ్యూజన్‌లు ఇంకా దండిగా ఉన్నాయి. ఈ చిత్రాన్ని తెలుగుచిత్రంగా ఊహించుకుంటూ ప్రారంభించిన తర్వాత.. అన్ని భాషల్లో విడుదల చేస్తే తప్ప.. వర్కవుట్ కాదని అనిపించింది. క్రమంగా భాషలను పెంచుకుంటూ పోయారు. ఇప్పుడు ఆ భారం గుదిబండలాగా మారుతోంది. 
తొలుత ఒకే చిత్రంగా మొదలైన బాహుబలి నిర్మాణంలో ఉండగానే.. రెండు భాగాలుగా విడుదల చేయాలని నిర్ణయించడం కూడా ఇలాంటి కన్ఫ్యూజన్ ప్రభావమేనని కొందరు అంటున్నారు. షూటింగ్ మొదలయ్యాక రెండు భాగాలుగా మార్చడం అంటేనే.. షూటింగ్ బడ్జెట్ పరంగా గానీ, అవుట్‌పుట్ లెంగ్త్ పరంగా గానీ.. దర్శకుడి ప్లానింగ్‌తో నిమిత్తం లేకుండా చేయిదాటిపోయిందని అర్థం వస్తుందని వ్యాఖ్యానాలు వినపడుతుంటాయి. దీనివలన అనకున్న దానికి భిన్నంగా టాప్ హీరో ప్రభాస్ కూడా ఈ సినిమాతో లాక్ అయిపోయాడనే బాధ అభిమానుల్లో ఉంది.

‘ఇంకా ఉంద’నే అంటున్నారు…

‘ఓ స్త్రీ రేపురా’ అన్నట్లుగా బాహుబలి చిత్రం షూటింగ్ కూడా ‘ఇంకా ఉంది’ అనే అంటున్నారు. చాలా కాలం కిందటే షూటింగ్ పూర్తయిపోయిందని పుకార్లు వచ్చాయి. తర్వాత.. రెండు భాగాలుగా చిత్రం వస్తుందని ప్రచారం చేసిన తర్వాత.. మళ్లీ షూటింగ్ అన్నారు. మళ్లీ షూటింగ్ పూర్తయిపోయిందని.. ఇక అంతా సీజీ వర్క్ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం రెండు భాగాలకు సంబంధించి 70 శాతం షూటింగ్ అయిందని ఇంకా 30 శాతం చిత్రం షూట్ చేయాలని అంటున్నారుట. అది ఎప్పటికి పూర్తయ్యేటట్టు? 

ఒకటో పార్ట్ ఇచ్చే రిజల్టును బట్టే రెండో పార్ట్ కూడా ఉంటుందా? లేదా, దానంతట అది తయారైపోతున్నదా అనేది కూడా మీమాంసే. మొత్తానికి సినిమాకు సంబంధించిన ఏ ఒక్క విషయాన్ని కూడా యూనిట్ వారు ప్రెవేటు సంభాషణల్లో కూడా క్లారిటీతో చెప్పలేకపోతున్నారట. నిజానికి వేసవి సెలవుల కలెక్షన్‌ను క్యాష్ చేసుకునేలా రావాల్సిన చిత్రం ఇది. దీన్ని జూన్ అని, తర్వాత జూలైకు తీసుకువెళ్లారు. కనీసం ఆగస్టు నుంచి అక్టోబరు మధ్యలోనైనా విడుదల అవుతుందా అని ఇప్పుడు కొందరు ప్రశ్నిస్తున్నారు. 

బాలీవుడ్ స్టయిల్‌తో మ్యాచ్ కావట్లేదు…

బాలీవుడ్ చిత్రాల నిర్మాణ సరళి పూర్తి విభిన్నంగా ఉంటుంది. నాలుగు నెలల తర్వాత విడుదల కాబోయే చిత్రానికి ఇప్పుడే వారు రిలీజ్ డేట్ ఇచ్చేస్తారు. అన్ని నెలలపాటూ దాని ప్రచారాన్ని సాగిస్తుంటారు. ఇలా రిలీజ్ పోస్ట్‌పోన్‌మెంట్‌లు ఎప్పుడో తప్ప ఉండవు. అంతా పక్కా ఉంటుంది. పైగా ఇలాంటి వాయిదాలపర్వం సినిమాకు విడుదలకు ముందే చెడ్డపేరు తెచ్చేస్తుందని వాళ్లు నమ్ముతారు. 

పైగా బాలీవుడ్ సినిమా మార్కెట్ మీద రివ్యూల ప్రభావం కూడా భిన్నంగా ఉంటుంది. చాలా తెలుగు రివ్యూల్లాగా కాకుండా.. బాలీవుడ్‌లో రివ్యూలు చాలా ఘాటుగా సూటిగా ఉంటాయి. ఒకసారి అవి ఏ మాత్రం లోపాల్ని ఎత్తిచూపించినా.. దాని ఎఫెక్ట్ మార్కెట్ మీద కచ్చితంగా పడుతుంది. పైగా అన్ని భాషల్లోనూ ఒకేసారి విడుదల చేయాలని అని కోరుకుంటున్నప్పుడు… అక్కడ రివ్యూలు తేడాగా వస్తే.. దాని ప్రభావం అన్ని భాషల్లోనూ మార్కెట్ మీద పడుతుందనేది మేకర్స్‌లో ప్రధానమైన భయంగా ఉంది. 

పైగా తెలుగులో షూట్ చేస్తున్న చిత్రాన్ని బాలీవుడ్ ప్రేక్షకుల్ని కూడా రంజింపజేసే ఒరిజినల్ ఫీల్‌ను.. ఫక్తు డబ్బింగ్‌తో అందించడం కష్టం. పైగా ఈ ఫార్మాట్‌లోని బాహుబలి తరహా చిత్రానికి మరింత కష్టం. ఎందుకంటే ఈ రకం చిత్రాల్లో డైలాగుల భాషకూడా కాస్త గ్రాంధిక ధోరణిలో ఉండాల్సిందే. తమిళ, మళయాళ వంటి సారూప్యత ఉండే.. ద్రవిడ భాషల్లోకి డబ్బింగ్ చేయించడంలో ఒక రకం కష్టాలుంటే.. వాక్య నిర్మాణం (సింటాక్స్)లో తెలుగుతో ఎలాంటి పోలిక ఉండని హిందీ భాషలోకి డబ్బింగ్ చేయడం చాలా చికాకు. గ్రాంధిక హిందీ డైలాగులు రాసుకుంటే లిప్‌సింక్‌లు గట్రా మ్యాచ్ కావడం చాలా కష్టం. అలాంటప్పుడు.. షూట్ సమయంలోనే హిందీ స్క్రిప్టు కూడా దగ్గరుంచుకుని… ఆ భాషకోసం ప్రతి సారీ ఒక షాట్ అదనంగా తీసుకుంటూ ఉంటే తప్ప వాళ్లకి సొంత సినిమా చూసే ఫీలింగ్ రాదు. ఇవన్నీ  కూడా సినిమాకు ఇబ్బందికరంగా మారిపోయాయనే వాదన ఒకటి ఉంది. 

అభిమానుల నిరుత్సాహంతో కొంత…

బాహుబలి వర్కింగ్ స్టిల్స్ అధికారికంగా రాలేదు. కొన్ని లీక్ అయ్యేసరికి నానా యాగీ అయింది. ఆ విషయంలో యూనిట్ మీద నిఘా కూడా చాలా గట్టిగా పెట్టారు. చివరికి విడుదల ప్లానింగ్ డేట్ దగ్గరపడుతున్న సమయంలో… ఒక్కొక్కటిగా పోస్టర్లు ఆన్‌లైన్ ద్వారా ప్రజలకు చేరుతున్నాయి. అయితే యూనిట్‌ను కంగారు పెడుతున్న మరో కీలక అంశం ఏంటంటే.. బాహుబలి చిత్రానికి సంబంధించి ఇప్పటిదాకా విడుదల అయిన ప్రభాస్ పోస్టర్లు ఏవీ అభిమానులకు కిక్ ఇవ్వడం లేదుట. సినిమా గురించి ఎంతెంతో ఊహించేసుకున్న తరువాత.. ప్రభాస్ బొమ్మతో వచ్చిన పోస్టర్లు సాదాగా అనిపించే సరికి ఫ్యాన్స్ డీలా పడ్డారు. అది రాజమౌళి వరకు తెలిసింది. ఇలాంటి నేపథ్యంలో ట్రైలర్  విడుదల చేస్తే.. అది కూడా నిరుత్సాహపరచిందంటే గనుక… ఖచ్చితంగా సినిమా రిజల్ట్‌మీద ప్రభావం పడుతుందని భయపడ్డారని సమాచారం. 

సినీ ప్రముఖుల ఆలోచన వేరు…

కేవలం సామాన్య ప్రేక్షకుల్నే కాదు. సినీ ప్రముఖుల్ని కూడా నిరీక్షించేలా ఈ చిత్రం చేస్తున్నది. కానీ దీని పట్ల వారి అంచనాలు వేరుగా ఉన్నాయి. బాహుబలి చిత్రం గ్రాండ్ అప్పియరెన్స్ పరంగా నభూతో అనిపించే విధంగా ఉండగలదేమో గానీ.. కథ సాధారణంగా ఉండి ప్రేక్షకుల్ని నిరుత్సాహ పరుస్తుందేమో అని కొందరు అనుకుంటున్నారు. సినిమాలో గ్రాండ్‌నెస్ అనేది.. మళ్లీ మళ్లీ చూడాలనిపించేంత గ్రాండ్‌గా ఉంటుందనడంలో ఎవ్వరికీ ఎలాంటి సందేహం లేదు. అయితే అదొక్కటే సినిమాను ‘‘సూపర్ హిట్’’ అయ్యే వరకు నిలబెట్టగలుగుతుందా అనేది మిలియన్ డాలర్ ప్రశ్న. 

అందులో వెనక్కి తగ్గారు…

ఈ చిత్రం ఎంత పెద్ద హిట్ అయినప్పటికీ.. దీని ద్వారా పెట్టుబడులు మరియు లాభాలు ఆర్జించడం అనేది అంత ఈజీ కాదని రాజమౌళికి ఒక దశలో అర్థమైనట్లే ఉన్నది. ఎందుకంటే.. ఈ చిత్రానికి టికెట్ల రేట్లు పెంచుకుని అమ్ముకోవాలని.. దానికి సంబంధించి ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా అనుమతి తీసుకోవాలని వాళ్లు భావించారుట. అయితే ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మాత్రమే వారు ఇలాటి ప్రయత్నం చేయగలరు. తీరా ప్లాన్ చేసిన తర్వాత.. తెలంగాణలో కేసీఆర్ అనుమతించకపోతే ఏంటి పరిస్థితి అనే భయంతో టికెట్ల ధర పెంచడం అనే ఆలోచన మానుకున్నారుట. నైజాం కలెక్షన్లు లేకుండా కేవలం ఏపీ రాష్ట్రం కోసం టికెట్లు పెంచినంత మాత్రాన దేక్క ప్రయోజనం ఏమీ ఉండదని వారికే అనిపించినట్లుంది. 

ఎంత త్వరగా క్లారిటీ ఇస్తే అంత లాభం

రాజమౌళి తన శైలిని కొంత మార్చుకోవాల్సి ఉంది. సినిమా విడుదల తేదీ విషయంలో వీలైనంత త్వరగా ఒక స్పష్టత ఇవ్వాలి. ‘పర్ఫెక్షనిస్టు’ అనే భ్రమలో మన జక్కన్న అద్భుత శిల్పాన్ని చెక్కుకుంటూ పోతే.. ఈలోగా దాని అందాల్ని ఆస్వాదించాల్సిన వారికి కిక్కు దిగిపోతే కష్టం. రాజమౌళి మేకింగ్ అద్భుతాల గురించి ఎవ్వరికీ ఎలాంటి సందేహాలు లేవు.. అలాగే బాహుబలి చిత్రం సృష్టించగల రికార్డుల గురించి.. అంతర్జాతీయంగా మన తెలుగు సినిమా ఖ్యాతి పెరిగేలా చేయగలగడం గురించి కూడా సందేహాలు లేవు. కానీ.. ప్రేక్షకులను ఇబ్బంది పెట్టకుండా, విడుదలకు ముందే పెదవివిరవకుండా చేయడం రాజమౌళి బాధ్యత. అందుకు ఒకే ఒక్క మందు ఉంది.. ‘మళ్లీ మళ్లీ మార్పులేని విడుదల తేదీని ప్రకటించడం’!!

-కపిలముని