రోగులు ఆసుపత్రి చుట్టూ… డాక్టర్లు కోర్టుల చుట్టూ…

ఇటీవలి కాలంలో కొందరు రాజకీయనాయకులు డాక్టర్లకు వ్యతిరేకంగా బాహాటంగా మాట్లాడడం గమనిస్తున్నాం. అనేక కేసులు కూడా వెలుగులోకి వస్తున్నాయి. వాటిలో డాక్టరు బాధ్యత ఎంత, ఆసుపత్రి బాధ్యత ఎంత, రోగి నిర్లక్ష్యం ఎంత, రోగి…

ఇటీవలి కాలంలో కొందరు రాజకీయనాయకులు డాక్టర్లకు వ్యతిరేకంగా బాహాటంగా మాట్లాడడం గమనిస్తున్నాం. అనేక కేసులు కూడా వెలుగులోకి వస్తున్నాయి. వాటిలో డాక్టరు బాధ్యత ఎంత, ఆసుపత్రి బాధ్యత ఎంత, రోగి నిర్లక్ష్యం ఎంత, రోగి తన పూర్వరోగాల గురించి డాక్టరుకు యిచ్చిన సమాచారం ఎంత అనేవి కేసుకేసుకి మారుతూంటాయి. కానీ ఏదో ఒక కారణం పెట్టి డాక్టర్లను బోనెక్కించడం ఎక్కువైంది. హార్వార్డ్‌ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ పక్షాన డా||అశీస్‌ ఝా అనే ఆయన ''గ్లోబల్‌ బర్డెన్‌ ఆఫ్‌ అన్‌సేఫ్‌ మెడికల్‌ కేర్‌'' పేర 2013లో చేసిన అధ్యయనం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న 42 కోట్ల హాస్పటలైజేషన్లలో 4 కోట్ల కేసుల్లో వైద్యం కారణంగా గాయపడుతున్నారు. ఆ 4 కోట్ల కేసుల బాధితుల్లో మూడింట రెండు వంతుల మంది పేద, మధ్యతరగతి వర్గాల వారే. ఇండియాలో 50 లక్షల కేసులు యిలాటివి వస్తున్నాయి. కారణాలు చెప్పాలంటే బోలెడు – సరైన మందు యివ్వకపోవడం, మందు సరైనదైనా డోసేజి ఎక్కువతక్కువగా యివ్వడం, ఒక రోగికి బదులు మరొకరికి మందివ్వడం, ఒక దానికి చేయబోయి మరోదానికి ఆపరేషన్‌ చేయడం, సరైన సమయంలో చేయకపోవడం..యిలా. 

కన్స్యూమర్‌ కోర్టుల గురించి అందరికీ బాగా తెలిసిన తర్వాత డాక్టర్లపై కేసులు పెరిగాయి. సుప్రీం కోర్టు వరకు చేరి అక్కడ పెండింగులో వున్న కేసులు గత పదేళ్లలో 4 రెట్లు పెరిగాయి. ఇటీవలి కాలంలో యింకా పెరుగుతున్నాయి. ప్రస్తుతానికి మూడున్నర లక్షల కేసులు పెండింగులో వున్నాయి. వాటిలో వైద్యుల నిర్లక్ష్యం ఒకటే కాకుండా చార్జీలు అధికంగా వున్నాయన్న ఆరోపణలు, అనవసరంగా టెస్టులు చేయించారన్న అభియోగాలు ఎక్కువగా వున్నాయి, ఢిల్లీ మెడికల్‌ కౌన్సిల్‌కు రెండు సంవత్సరాల క్రితం సరాసరిన నెలకు 15 ఫిర్యాదులు వచ్చేవి. ఇప్పుడు నెలకు 40 వస్తున్నాయి! ముంబయి డాక్టర్లపై 1998-2006 మధ్య 910 మెడికో లీగల్‌ కేసులుంటే యిటీవలి కాలంలో అవి ఏడాదికి 150 నుంచి 200 వరకు పెరుగుతున్నాయి. ఈ ధోరణి నగరవాసుల్లో ఉధృతంగా పెరుగుతోంది. రోగి చికిత్స జరుగుతున్నంత సేపు 'ఎంతైనా ఖర్చుపెడతాం, రిస్కు మాది కదా, ఆపరేషన్‌ చేయండి' అని బతిమాలిన పేషంట్లు, ఆపరేషన్‌ జరిగి, రోగి చనిపోయిన సందర్భాల్లో ప్లేటు ఫిరాయిస్తున్నారు. ఆపరేషన్‌లో నిర్లక్ష్యం జరిగింది, బిల్లు చాలా ఎక్కువ వేశారు అని ఆరోపిస్తూ రచ్చ చేస్తున్నారు. రాజకీయ నాయకులను ఆశ్రయించి తోడు తెచ్చుకుంటున్నారు. దానికి తోడు ఎవరి కేసులోనో తప్పుడు నిర్ణయం జరిగిందని విని వుంటే తమకూ అదే జరిగి వుంటుందని వూహించుకుని, ఇంటర్నెట్‌ ద్వారా సేకరించిన అరకొర సమాచారంతో అపోహలు పెంచుకుని ఆసుపత్రి గుర్తింపు రద్దు చేయమంటూ మెడికల్‌ కౌన్సిల్‌కు ఫిర్యాదులు చేస్తున్నారు. నేషనల్‌ ఎక్రెడిషన్‌ బోర్డ్‌ ఫర్‌ హాస్పటల్స్‌ వారికి యిలాటి ఫిర్యాదులు కుప్పలుతిప్పలుగా వచ్చిపడుతున్నాయి. వాటిలో 50% మంది 'డాక్టరు రాంగ్‌ టెక్నిక్‌ వుపయోగించాడని మాకు తెలిసిపోయింది' అంటూ రాసినవారే. టెక్నిక్‌ సరైనదో, కాదో తెలియాలంటే యివతలివాళ్లకు దానిపై పూర్తి అవగాహన వుండాలి. వికీపీడియాలో చదివేసి తీర్మానించేస్తే ఎలా?

వైద్యంలో నిర్లక్ష్యం జరిగిందో లేదో చెప్పగలిగినది ఫోరెన్సిక్‌ నిపుణులు! అలాటి నిపుణులు మైసూర్‌ మెడికల్‌ కాలేజీ నుంచి యిద్దరు, ముంబయిలోని గ్రాంట్‌ మెడికల్‌ కాలేజీ నుండి యిద్దరు కమిటీగా ఏర్పడి నేషనల్‌ కన్స్యూమర్‌ డిస్ప్యూట్స్‌ రిడ్రెసల్‌ కమిషన్‌ వద్దకు వచ్చిన కేసుల స్వభావాన్ని పరిశీలించారు. ఆ కేసుల్లో 80% సర్జరీకి సంబంధించినవే. ఆ సర్జరీలో కూడా 29% ప్రసూతికి సంబంధించినవి, 22% ఎముకల ఆపరేషన్లకు సంబంధించినవి. 34% ఫిర్యాదుల్లో ఆసుపత్రులు లేదా డాక్టర్ల నిర్లక్ష్యం వుందని యీ కమిటీ తేల్చింది. ''డాక్టర్ల నిర్లక్ష్యం సహించరానిది, కానీ కానీ ఆసుపత్రికి సంబంధించిన వ్యవస్థాగత లోపాలను కూడా మా నెత్తిన రుద్దేస్తున్నారు' అని వాపోతున్నారు డాక్టర్లు. ఆసుపత్రుల్లో శుభ్రత, తర్ఫీదు పొందిన తగినంతమంది సిబ్బంది, గాలి, వెలుతురు యిలా అనేక అంశాలుంటాయి. చికిత్స లేదా ఆపరేషన్‌ సరిగ్గానే జరిగినా ఆపరేషన్‌ తదనంతరం కోలుకోవడంలో యీ అంశాలు ప్రాధాన్యత వహిస్తాయి. లాభాపేక్షతో ఆసుపత్రి యిలాటి విషయాలపై రాజీ పడితే పేషంటుకి నష్టమే. ఇవన్నీ పరిగణనలోకి తీసుకోకుండా డాక్టర్లను వివాదంలోకి లాగుతున్నారు. ఆసుపత్రుల్లో  పేషంటుకు, అతని బంధువులకు కౌన్సిలింగ్‌ విభాగం వుండడం అత్యవసరం. ఏ చికిత్స ఎందుకు జరుగుతోంది, దానిలో వున్న రిస్కు ఎంత, అయ్యే ఖర్చు ఎంత, ఫలితం ఎలా వున్నా భరించడానికి, సహించడానికి సిద్ధంగా వున్నారా? ఇత్యాది విషయాలు తేటతెల్లంగా చెప్పాలి. లేకపోతే లేనిపోని అపోహలకు దారి తీస్తుంది. అనేక ఆసుపత్రుల్లో యిలాటి విభాగాలు లేవు.

తనపై కేసు పెట్టగానే డాక్టరు వణుకుతాడు. ఆసుపత్రుల్లో చాలావాటికి లీగల్‌ శాఖ వుండటం లేదు. అతనికి సరైన గైడెన్స్‌ యిచ్చేవారు లేరు. దాంతో అతను 'సారీ' అనేస్తే వదిలిపోతుందేమో ననుకుంటాడు. అలా అనడం కోర్టు దృష్టిలో నేరాంగీకరణ కిందే వస్తుంది. అతను శిక్షార్హుడు అవుతాడు. ఇక కోర్టుల చుట్టూ తిరుగుతాడు. ఆత్మీయులను పోగొట్టుకున్న పేషంటు కసితో డాక్టరును కింది కోర్టుకి, పై కోర్టుకి తిప్పుతూనే వుంటాడు. ఓ ఢిల్లీ పెద్దమనిషి కాన్సర్‌తో తన భార్య చనిపోతే చికిత్స చేసిన డాక్టరు 'సారీ' అనలేదన్న ఉక్రోషంతో ఆయన్ను  ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిప్పాడు. ప్రఫుల్‌ బి దేశాయ్‌ అనే అంకాలజిస్టు, టాటా మెమోరియల్‌ హాస్పటల్‌ (ముంబయి)కి డైరక్టర్‌గా పనిచేశారు, పద్మభూషణ్‌ గ్రహీత కూడా. ఆయన మీద ఒక బ్యూరోక్రాట్‌ 1989లో కేసు పడేశాడు – తన భార్య కాన్సర్‌తో చనిపోవడానికి యీయన నిర్లక్ష్యమే కారణమని. 24 ఏళ్ల పాటు కేసు నడిచింది. డాక్టరుపై అభియోగాలన్నీ కొట్టేశారు. కానీ అన్నాళ్లూ ఆయన క్లేశం అనుభవించినట్లే కదా. ఇవి తప్పించుకోవడానికి డాక్టర్లు యీ మధ్య ఓ చిట్కా అవలంబిస్తున్నారు. ఓ రోజు ఒకాయన గుండెల్లో మంట అంటూ వచ్చాడు. అది అజీర్తి వలన అని డాక్టరుకు తెలుసు. అలా చెప్పి మందులిస్తే పేషంటూ, అతని భార్యా తృప్తి పడలేదు. గుండెనొప్పేమో, నువ్వు సరిగ్గా గమనించటం లేదేమో అంటున్నారు. సరే నాకేం పోయిందని యీయన ఇసిజితో మొదలుపెట్టి పది టెస్టులు చేసి పాతిక వేలకు బిల్లు చేశాడు. ఏమో, నిజంగా గుండెలో ఏదైనా వుంటే వీళ్లు రేపు నన్ను కోర్టుకి యీడ్చవచ్చు, అంత రిస్కెందుకు, పోయేది వాళ్ల డబ్బే కదా అని టెస్టులు చేయించాడు. ఆ విధంగా వైద్యంపై అనవసరవ్యయం పెరుగుతోంది.

అంతేకాదు, పేషంటును ఆసుపత్రిలో చేర్చాక అతని పరిస్థితిపై పెదవి విప్పకపోవడం నేర్చుకున్నారు. పేషంటు ఆరోగ్యం ఒక్కోసారి కుదుటపడుతుంది, యింకోసారి కుంటుపడుతుంది. మెరుగైంది అని చెప్పిన మర్నాడు క్షీణించిందని చెపితే అది డాక్టరు నిర్వాకమే అని యాగీ చేస్తారు. అందువలన పేషంటు పరిస్థితి గురించి ఏమడిగినా 'నిన్నటిలాగే వుంది, చూడాలి, గమనించాలి' అని చెప్తున్నారు. ఆ మధ్య కలకత్తాలో ఒక ముసలాయనకు స్ట్రోక్‌ వచ్చి పడిపోతే ఆసుపత్రిలో చేర్చారు. డాక్టర్లు రావడంలో కాస్త ఆలస్యం కాగానే వాళ్లమ్మాయి సెల్‌ఫోన్‌లో వీడియో తీసి అందరికీ మెసేజ్‌లు పంపేసి నానా హంగామా చేసేసింది. ఆసుపత్రి వాళ్లకు బెదురు పుట్టింది. చికిత్స వెంటనే మొదలుపెట్టి, ఆయన కాస్త సర్దుకుకోగానే వెంటనే డిస్చార్జి చేసి పంపేసి చేతులు దులుపుకున్నారు. వేరే ఏర్పాట్లు చేసుకోవడానికి కుటుంబానికి సమయం కూడా యివ్వలేదు. ఏం చేసినా, ఎటుపోయి ఎటు వస్తుందోనన్న భయంతో డాక్టర్లు వృత్తిపరమైన ఇండెమ్నిటీ యిన్సూరెన్సు పాలసీలు తీసుకుంటున్నారు. ఆ ప్రీమియం ఖర్చు కూడా పేషంట్ల నెత్తినే పడుతోంది. ఈ కేసుల వరస యిలాగే కొనసాగితే నిరంతరభయంతో డాక్టర్లు కూడా పేషంట్లుగా మారడం ఖాయం. 

-ఎమ్బీయస్‌ ప్రసాద్

[email protected]