విశాఖ రైల్వే జోన్ కోసం ఎన్ని కలలో…?

ఎన్నిక ఎన్నికకూ మధ్య ఎన్నో కలలు. అలా కలల పట్టాలపైన విశాఖ రైల్వే జోన్ ఎప్పటికపుడు పరుగులు తీస్తూంటుంది. విశాఖ రైల్వే జోన్ అన్నది దశాబ్దాల కల. బీజేపీ ఎన్నికల హామీగా ఉంది. విభజన…

ఎన్నిక ఎన్నికకూ మధ్య ఎన్నో కలలు. అలా కలల పట్టాలపైన విశాఖ రైల్వే జోన్ ఎప్పటికపుడు పరుగులు తీస్తూంటుంది. విశాఖ రైల్వే జోన్ అన్నది దశాబ్దాల కల. బీజేపీ ఎన్నికల హామీగా ఉంది. విభజన చట్టంలో సైతం పొందు పరచారు.

విశాఖ రైల్వే జోన్ వచ్చేసింది అంటూ 2019 మార్చిలోనే కేంద్రం ప్రకటించింది. అప్పట్లో విశాఖకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ ఉత్తర్వు కాపీని బహిరంగ సభలో ప్రజలకు చూపించారు. ఆ ఎన్నికల్లో బీజేపీ గెలిచి కేంద్రంలో రెండవ మారు అధికారం చేపట్టింది.

చూస్తూండగానే గిర్రున నాలుగేళ్ళ కాలం గడచింది. విశాఖ రైల్వే జోన్ ఎక్కడ ఉందో ఎవరికీ తెలియదు. ఈ మధ్యలో వచ్చిన బడ్జెట్ లలో కూడా జోన్ కి అయ్యే ఖర్చులో పదవ వంతు కూడా కేటాయించలేదు. మళ్లీ 2024 ఎన్నికలు వస్తున్నాయి.

బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు దీని మీద మరో మాట చెప్పారు. 2024 ఎన్నికలలోగా విశాఖకు జోన్ వచ్చి తీరుతుందని ఆయన అంటున్నారు. విశాఖ రైల్వే జోన్ కి కేంద్రం నిధులను పూర్తిగా కేటాయించిందని, భూములను ఇచ్చే విషయంలోనే జాప్యం అవుతోందని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపించాల్సి ఉందని అంటున్నారు. విశాఖ రైల్వే జోన్ విషయంలో మరో ఎన్నిక దాకా తీసుకుని వెళ్ళిన బీజేపీ ఎంపీ గారు ఎన్ని కలలో జనాలకు కల్పించారు అని కామెంట్స్ చేస్తున్నారు. భూములు అన్నవి పెద్ద ఎత్తున ఎకరాలకు ఎకరాలు ఉన్నాయి. కేంద్రం నిధులు కనుక మంజూరు చేస్తే ఈపాటికి భవనాల నిర్మాణం జరిగిపోయి ఉండేదని అంటున్నారు. 

అదే విధంగా ఇన్ ఫ్రా స్ట్రక్చర్ కూడా రెడీ అయిపోయి ఈపాటికి రైల్వే జోన్ కూత పెట్టి ఉండేదని అంటున్నారు. 2019 ఎన్నికలు ముగిసాయి 2024 ఎన్నికలు దగ్గరకు వచ్చేశాయి. అయినా రైల్వే జోన్ అదిగో అల్లదిగో అంటున్నారు అంటే అది విశాఖ జనాల అమాయకత్వం అయినా అనుకోవాలి లేక పాలకుల ఉదీశీనత అని సరిపెట్టుకోవాలి.