దేశంలో రోజురోజుకు సైబర్ మోసాలు పెరిగిపోతున్నాయి. బయటకొచ్చి పోలీస్ కంప్లయింట్ ఇచ్చేవాళ్లు చాలా తక్కువమంది ఉంటున్నారు. ఇప్పటికే వందల కోట్ల రూపాయల సైబర్ మోసాల్ని అరికట్టిన హైదరాబాద్ పోలీసులు, తాజాగా మరో పెద్ద ముఠా గుట్టు రట్టు చేశారు. ఏకంగా 712 కోట్ల రూపాయల సైబర్ మోసాన్ని పోలీసులు ఛేదించారు
ఇన్వెస్టిమెంట్ ఫ్రాడ్..
మొన్నటివరకు వర్క్ ఫ్రమ్ హోమ్ అనే సైబర్ మోసం నడిచింది. ఇప్పుడు ఇన్వెస్టిమెంట్ ఫ్రాడ్ అనే కొత్తరకం మోసానికి తెరదీశారు. ముందు 5వేలు పెట్టుబడి పెట్టమంటారు, చిన్న టాస్క్ ఇస్తారు, అది పూర్తయిన వెంటనే వెయ్యి రూపాయలు కమీషన్ ఇస్తారు. ఆ తర్వాత 10వేలు పెట్టమంటారు, 3వేలు ఇస్తారు. ఇలా 30 టాస్కులు పెడతారు. ప్రతిసారి ఎమౌంట్ పెంచుకుంటూ పోతారు. మనం ఎంత డబ్బు పెట్టాం, మనకు ఎంత రాబోతోందనేది ఎప్పటికప్పుడు డాష్ బోర్డులో చూపిస్తారు.
ఈ పెట్టుబడి మోసంలో టాస్కులు మధ్యలో ఆపడానికి వీల్లేదు, డబ్బు మధ్యలో విత్ డ్రా చేసుకోవడానికి వీల్లేదు. అన్ని టాస్కులు పూర్తి చేయాల్సిందే. ఇలా అన్ని టాస్కులు పూర్తయ్యేసరికి మనం పెట్టిన పెట్టుబడి కనీసం 20 లక్షలైనా అవుతుంది. అంతే, ఆ తర్వాత కనెక్షన్ కట్ అవుతుంది.
ఇలా దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 15వేల మంది మోసపోయారు. వీళ్లలో హైదరాబాద్ కు చెందిన వాళ్లు కూడా చాలామంది ఉన్నారు. దిల్ సుఖ్ నగర్ కు చెందిన ఓ వ్యక్తి 82లక్షలు పోగొట్టుకున్నాడు. శివకుమార్ అనే వ్యక్తి 28 లక్షలు పోగొట్టుకున్నాడు. అతడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు జరిపిన పోలీసులు.. 40కి పైగా ఫేక్ బ్యాంక్ అకౌంట్లను సీజ్ చేయగలిగారు.
ఉగ్రవాద సంస్థలకు మళ్లింపు…
ఈ కేసుకు సంబంధించి ఆరుగుర్ని అరెస్ట్ చేశారు. మొత్తం మోసాన్ని వెలికితీస్తే, లెక్క 712 కోట్ల రూపాయలకు చేరింది. వీటిని వివిధ ఎకౌంట్లలోకి మార్చేందుకు, ఏకంగా 33 షల్ కంపెనీలు, 65 బ్యాంక్ ఎకౌంట్లు తెరిచారు మోసగాళ్లు. ఇవన్నీ నకిలీ ఎకౌంట్లే. వీటికి ఇచ్చిన ఫోన్ నంబర్లు కూడా దుబాయ్ నుంచి ఆపరేట్ అవుతున్నాయి.
ఒక్కో ఎకౌంట్ నుంచి డబ్బు ట్రాన్సఫర్ చేస్తూ, ఫైనల్ గా వాటిని క్రిప్టో కరెన్సీ కింద మార్చి దుబాయ్, చైనాలకు తరలిస్తున్నారు. వీటిలో కొంత మొత్తం ఉగ్రవాద కార్యకలాపాలకు కూడా వాడుతున్నట్టు పోలీసులు గుర్తించారు.
వాట్సాప్, టెలిగ్రామ్ యాప్స్ కేంద్రంగా ఈ సైబర్ మోసం జరుగుతుందని, పెట్టుబడి మార్గాలు, వర్క్ ఫ్రమ్ హోమ్ లాంటి మెసేజీలు వస్తే స్పందించొద్దని సూచిస్తున్నారు పోలీసులు.