బడ్జెట్ అంకెలు: మూడు అరుపులూ,నాలుగు చరుపులూ!!

బడ్జెట్ అంటే అంకెలూ కాదు, పద్దులూ కాదు! మరి? రంకెలూ, వీలయితే గుద్దులూ..! (కంగారు పడకండి. గుద్దుళ్ళూ అంటే, బల్ల గుద్దుళ్ళే లెండి.) బడ్జెట్ సమావేశాలను తిలకించవచ్చు. తెలుగు వారు ఒక్కరాష్ర్టంగా వున్నప్పుడూ, విడిపోయాక…

బడ్జెట్ అంటే అంకెలూ కాదు, పద్దులూ కాదు! మరి? రంకెలూ, వీలయితే గుద్దులూ..! (కంగారు పడకండి. గుద్దుళ్ళూ అంటే, బల్ల గుద్దుళ్ళే లెండి.) బడ్జెట్ సమావేశాలను తిలకించవచ్చు. తెలుగు వారు ఒక్కరాష్ర్టంగా వున్నప్పుడూ, విడిపోయాక కూడా ఇదే తంతు. నెలల తేడాతో జరిగిన రెండు రాష్ట్రాల బడ్జెట్ సమావేశాల్లోనూ ఇదే ముచ్చట. 

అయితే అరుపులూ, బల్లల చరువులూ అప్పటికప్పుడు పుట్టుకొచ్చిన ఆవేశకావేశాలనుంచి రావు. వీటన్నిటికీ కూడా ముందస్తు వ్యూహం వుంటుంది. ఫలానా సభ్యుడు ఊరికే నోరు జారాడూ అంటారు కానీ, అది నిజం కాదు. ‘ఊరక (నోరు) జారరు మహానుభావులు’. దానికో ప్రయోజనం వుంటుంది.  ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాల్లోనూ ఇలాగే జారారు. తెలంగాణ సమావేశాల్లోకూడా జారటం మరోలా వుండదని నిరూపించేస్తున్నారు. అందరూ ‘గౌరవ’ సభ్యులే. తమ ‘గౌరవం’ తమేక తప్ప, ఎదుటి వారి గౌరవం తో పనే వుండదు. 

Click Here For Great Andhra E-Paper

తెలంగాణ బడ్జెట్ సమావేశాలో పార్టీలలో ఎవరి స్క్రిప్టు వారు రాసుకు వచ్చారు. ఎవరి అభినయం వారు చేశారు. ఇప్పటి వరకూ నాలుగు సీన్లు నడిచాయి. 

సీన్ వన్: బడ్జెట్ మీద చర్చ.

ఈ సీన్‌లో కాంగ్రెస్ శాసన సభ్యులు ‘దున్నేశారు’. కానీ అంతిమంగా పంట ‘చేతి’కి వచ్చేసరికి ఎండిపోయింది. విద్యుత్ సమస్య మీద విరుచుకు పడటానికి కాంగ్రెస్ సభ్యులు ఎప్పటి నుంచో రిహార్సల్స్ వేసుకుని వచ్చారు. విద్యుత్‌కీ, విద్యార్థుల ఫీజులకీ  కేటాయింపులేవీ అని నిలదీశారు. ఎప్పుడూ ‘అస్పష్టంగా’ మాట్లాడే జానారెడ్డి కూడా బడ్జెట్ మీద స్పష్టంగా మాట్లాడారు. ఈ బడ్జెట్ మొత్తం ‘పెద్ద బాల శిక్ష’లాగా వుందని కొట్టిపారేశారు. 

ఈ విషయంతో ‘తెలుగుదేశం’ సభ్యులకు తమ స్క్రిప్టు ప్రకారం బడ్జెట్‌ను తప్పు పట్టాలని చూసినా, ఫలితం లేక పోయింది.   ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ప్రభుత్వం వైఫల్యాల మీద టీఆర్‌ఎస్ శాసన సభ్యులు ‘కౌంటర్ల మీద కౌంటర్లు’ వేసేశారు. 

 సీన్ టూ: వ్యక్తిగత నిందలు

ఈ సీన్‌లో తెలుగుదేశం పార్టీ శాసన సభ్యులు రెచ్చి పోయారు. ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అనికానీ, ‘ఉత్తమ నటుడు’ అని కానీ ఆ పార్టీ వారిలో ఎవరికన్నా ఇవ్వాలంటే, అందుకు ఒక్కరే ఒక్కరు అర్హులవుతారు. ఆయనే రేవంత్ రెడ్డి. వ్యక్తిగత విమర్శలకు అవధులకు మించి చొరవ చూపటంలో ఆయన మించిన వారు లేరు. తెలంగాణ సమగ్ర సర్వే లో కేసీఆర్ కుమార్తె కవిత తన పేరును రెండు సార్లు నమోదు చేయించుకున్నారని విమర్శ చేసి, దుమారంలేపారు. కేసీఆర్ తనయుడు కేటీఆర్ కూడా తెలుగుదేశం శాసన సభ్యుల మీద  ‘టోకు’ గా నింద వేశారు. వారు  తెలంగాణ శాసన సభ్యుల్లా కాకుండా, ఆంధ్రప్రదేశ్ శాసన సభ్యుల్లాగా ప్రవర్తిస్తున్నారని అనేశారు. దీంతో యుధ్ధం మొత్తం, టీఆర్‌ఎస్, తెలుగుదేశం పార్టీల మధ్యనే జరిగి పోయింది. కాంగ్రెస్ పార్టీ సీన్‌లో ఎక్కడా కనిపించకుండా పోయింది. 

సీన్ త్రీ: ‘ఆపరేషన్ ఆకర్ష్’ పైన చర్చ.

తమ పార్టీనుంచి సభ్యుల్ని ఖాళీ చేస్తున్నారంటూ, టీఆర్‌ఎస్ మీద కాంగ్రెస్ సభ్యులు ధ్వజమెత్తారు. అందుకు పూర్తి బాధ్యత కేసీఆర్‌దే నన్నారు. అయితే సీన్ అంతగా రక్తి కట్టలేదు. తనంతట తానే కాంగ్రెస్ తన బలహీనతను చాటుకున్నట్టయింది.

Click Here For Great Andhra E-Paper

కాంగ్రెస్‌ను ఖాళీచేసేస్తున్నారంటే అర్థమేమిటి? ఆ పార్టీ పని  ఇక అయిపోయిందనే భావన రాదా? అంతిమంగా అదే జరిగింది. అదీ కాక ఎవరు అధికార పక్షంలో వుంటే, ఆ పక్షంలోకి శాసన సభ్యులు వలస పోవటం కొత్త కాదు. కాంగ్రెస్ అధికారంలో వున్నప్పుడు, టీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి కూడా ఇదే స్పీడులో వెళ్ళారు. 

సీన్ నాలుగు: ‘విమానం మోత’

హైదరామాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, దేశీయ టెర్మినల్ కు ఎన్టీరామారావు పేరు పెట్టాలని ఎన్డీయే సర్కారు చేత తెలుగుదేశం సరిగ్గా ఇదే సమయంలో నిర్ణయం చేయించింది. ఇప్పుడు కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లు ఒకటయ్యారు. తెలుగుదేశం పార్టీది దాదాపు ఒంటరి స్వరమయ్యింది. రాష్ర్టం వేరు పడ్డాక కూడా, ఇంకా  ఆంధ్రనేతల పేర్లు పెట్టాలా? అంటూ టీఆర్‌ఎస్, రాజీవ్ గాంధీ పేరును యధాతథంగా వుంచాలంటూ కాంగ్రెస్‌లు చిర్రుబుర్రులాడాయి. 

ఇన్ని సీన్ల తర్వాత తేలిందేమయ్యా అంటే.., విద్యార్థుల ఫీజులు ఇవ్వలేనందుకూ, నిరుద్యోగులకు ఉపాధి కల్పన చేయలేనందుకూ, రైతుల ఆత్మహత్యలను ఆపలేనందుకూ, విద్యుత్తు కొరతను అధిగమించలేనందుకూ, కేసీఆర్ వేద్దామని ప్రతిపక్షాలు తెచ్చుకున్న అక్షింతలు వృధా అయిపోయాయి. కేసీఆర్ చక్కగా తప్పించుకోగలిగారు.

సతీష్ చందర్