టాలీవుడ్ లో సరైన నిర్ణయం అన్నది చాలా కీలకం. అక్కడ చిన్న తేడా వచ్చినా, నిర్మాత, దర్శకుడు, హీరో, ఎవరి కెరీర్ అయినా బ్యాడ్ టర్నింగ్ ఇచ్చేసుకుంటుంది. చాలా మంది కమెడియన్లు హీరోలుగా ట్రయ్ చేయాలని సరదాపడి, అంతలోనే తప్పు తెలుసుకుని, బుద్దిగా కమెడియన్లుగా నాలుగు డబ్బులు సంపాదించుకున్నాను. కమెడియన్ల కు కున్న క్రేజ్ చూసి, ఎవరో నిర్మాతలు ముందుకు వస్తారు. సినిమా తేడా వస్తే, వాళ్లకు పైసలే పోతాయి..కానీ వీళ్లకు కెరీర్ మటాష్ అవుతుంది.
బ్రహ్మీ, ఆలీ, వేణుమాధవ్ ఇలా చాలా మంది ఇలా ముందుకెళ్లి వెనక్కు వచ్చారు. సునీల్ ముందుకే వెళ్లి కిందామీదా అవుతున్నాడు. ఇప్పుడు ధన్ రాజ్ వంతు వచ్చింది.ఇప్పుడిప్పడే అతగాడు కాస్త మంచి పేరు తెచ్చుకుంటున్నాడు. అలాంటి అతగాడు వున్నట్లుండి ఇంకా పెద్ద రిస్క్ చేస్తున్నాడు. కమెడియన్ గా చిన్న చిన్న వేషాలు వేసి, కష్టపడి సంపాదించినది అంతా దీసుకెళ్లి సినిమా నిర్మాణంలో పెడుతున్నాడు.
టాలీవుడ్ లో నటులు నిర్మాతలుగా మారితే కూడా పరిస్థితి వేరుగా వుంటుంది. మహా మహులు నిర్మాణంలో వేళ్లు పెట్టి కెరీర్ కు ఫుల్ స్టాప్ పెట్టుకున్నారు. ఎన్టీఆర్, కృష్ణ లాంటి కొంతమందికి నడిచింది కానీ, అందరికీ కాదు. స్వంత సినిమాలు తీసుకుంటాడులే..అతగాడు నిర్మాతయిపోయాడు లాంటి టాక్ లు వినిపిస్తాయి. తెలియకుండానే చాలా జరిగిపోతాయి. కామెడీ హీరోగా వుండే రాజేంద్ర ప్రసాద్ ఫస్ట్ ఇన్నింగ్స్ ఇలాగే క్లోజ్ అయింది. ఇప్పటికే టాలీవుడ్ లో చిన్న కమెడియన్లు ఎక్కువైపోయారు.
ఎవరికీ సంతృప్తికరంగా సినిమాలు దొరకడం లేదు. మరో పక్క చిన్న సినిమాల మార్కెట్ అంతంతమాత్రంగా వుంది. మరో పక్క ఆ మధ్య మంచు లక్ష్మి సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని వినికిడి. వ్యవహారం ఏమిటయినా, తప్పు ఎవరిది వుందా లేదా అన్నది వేరే విషయమైనా, ఇది ఇండస్ట్రీలోకి నెగిటివ్ సిగ్నళ్లను పంపిస్తుంది. ఇలాంటి సమయంలో ధన్ రాజ్ కెరీర్ పై దృష్టి పెట్టి ముందుకు వెళ్లకుండా ఇలాంటి రిస్క్ ఎందుకు చేస్తున్నట్లో?