బాహుబలి వ్యవహారాలు చిత్రంగా వున్నాయి. అడియో ఫంక్షన్ వాయిదా వెనుక వున్న సమస్యలపై వార్తలు వెలువడ్డం రాజమౌళి టీమ్ ఉలిక్కిపడేలా చేసింది. ఎంత కవర్ చేద్దామని చూసినా, ఫ్యాన్స్ పేరు చెప్పి వాయిదా అన్నా, ఓవర్ సీస్, ఇంకా దేశీయ డిస్ట్రిబ్యూషన్ మార్కెట్ లో కాస్త కలకలం తప్పలేదు. దీంతో అర్జెంట్ గా తమ అనుకూల వెబ్ మీడియాలో కవరింగ్ స్టోరీలు ప్లాంట్ చేద్దామని చూసారు. అయినా ఫలితం లేకపోయింది.
మరోపక్క హిందీ ట్రయిలర్ విడుదల యథావిధిగా వుంటుందని ప్రకటించేసిన తరువాత తప్పిదం తెలిసి వచ్చింది. హిందీ ట్రయిలర్ బయటకు వస్తే తెలుగు ట్రయిలర్ పై ఇంకేం ఆసక్తి వుంటుంది? దాంతో ఇక తప్పదని హడావుడిగా టీజర్ విడుదల చేసారు. చిత్రంగా టీజర్ లో హీరో ప్రభాస్ కన్నా రానానే స్పష్టంగా చూపించారు. ఇది ప్రభాస్ అభిమానులను నిరాశపర్చింది. ప్రభాస్ మొహాన్ని దాచేసి, రానాను హైలైట్ చేయడం ఏమిటి అన్న గుసగుసలు వినిపించాయి. పైగా ఒక్క రోజు గ్యాప్ లో ట్రయిలర్ విడుదల పెట్టుకుని, టీజర్ విడుదల చేయడం అంటే బాహుబలి టీమ్ వున్న కన్ఫ్యూజన్ ను వెల్లడి చేసింది.
ఇప్పటికే ఓవర్ సీస్ మార్కెట్ లో బాహుబలిపై గుసగుసలు బయల్దేరాయని వినికిడి. ఇప్పుడు సినిమా రంగంలో ఏ సినిమాపైనా నమ్మకాలు పెంచుకోలేని పరిస్థితి నెలకొంది. రాజమౌళి అపజయం ఎరుగని డైరక్టరే..సినిమాజోనర్ అన్ని ప్రాంతాలకు నచ్చేదే. కానీ ఒకసారి పొరపాటున తేడా జరిగితే ఫలితం దారుణంగా వుంటుంది. భారీ సినిమాలకు ఇదే సమస్య.
Click Here For Bahubali Teaser
ఒకప్పుడు ఇదే రాఘవేంద్రరావు తన దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా సింహబలుడు అనే భారీ సినిమా తీసారు. అప్పట్లో అది సంచలనమే. అప్పటికి అందుబాటులో వున్న సాంకేతిక సహకారంతో భారీ సెట్ లు వేసి, జానపద సినిమా అందించారు. అది జనాలను అంతగా ఆకట్టుకోలేదు.
తరువాత కృష్ణ తన తొలి దర్శకత్వంలో సింహాసనం సినిమాను అందించారు. అందుకోసం పద్మాలయాలో భారీ పక్కా కట్టడాలు నిర్మింపేచేసారు. అంతా భారీ..భారీ..భారీ..కానీ అదీ అంతగా ఆకట్టుకోలేదు.
వంద కోట్లు పై బడిన బడ్జెట్ సినిమాలతో సమస్య ఏమిటంటే, హిట్ అయితే అంతకు అంతా వస్తుంది. అదో ఆనందం. కానీ తేడా వస్తే, ఫలితం మళ్లీ సాదా సీదా సినిమాల మాదిరగానే వుంటుంది. శంకర్ ఐ చెప్పిన పాఠం, నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ ఇప్పటి పరిస్థితి దీనికి అద్దం పడుతుంది.
పైగా బాహుబలికి ఇంకో సమస్య వుంది. రెండో భాగం. తొలి భాగం హిట్ అయితేనే, ఆసక్తిగా వుంటనే మలిభాగంపై అంచనాలు వుంటాయి. లేదంటే లేదు.
ఇలాంటి విషయాలన్నీ ఇప్పుడు టాలీవుడ్ లో చక్కర్లు కొడుతున్నాయి. ఇలాంటినేపథ్యంలో బాహుబలి ట్రయిలర్ రేపు (సోమవారం) జనం ముందుకు రానుంది. టీజర్ లో ఏమీ లేదు..మరి ట్రయిలర్ లో ఏమటుందో?