సోషల్ మీడియాలో తెలంగాణ మంత్రి కేటీఆర్‌పై నెటిజన్లు సెటైర్స్ విసురుతున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో ఓ సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ ఆంధ్రాపై నోరు పారేసుకున్నారు. ఆంధ్రాకు చెందిన తన స్నేహితుడు చెప్పాడంటూ… అక్కడ రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, కరెంట్ లేదని, నీళ్లు లేవని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ అంటే నరకప్రాయమని కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
కేటీఆర్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు సీరియస్‌గా స్పందించారు. ఒకసారి అంధ్రప్రదేశ్‌కు వస్తే… వాస్తవ పరిస్థితి ఏంటో తెలుస్తుందని హితవు చెప్పారు. ఆ తర్వాత కేటీఆర్ మరో ట్వీట్ చేశారు. తన మాటలు కొందరిని బాధించాయని, కానీ తన ఉద్దేశం అది కాదని వివరణ ఇచ్చారు.
ఈ నేపథ్యంలో ఇవాళ తెల్లవారుజామున హైదరాబాద్‌లో భారీ వర్షం కురవడం, వరద నీళ్లు వెళ్లలేక దారిలేక వాహనాలు, ఇళ్లు మునగడంపై మీడియాలో కథనాలు వచ్చాయి. తెలంగాణలో ఈ పరిణామాలపై నెటిజన్లు తమదైన రీతిలో వ్యంగ్య కామెంట్స్ పెట్టడం విశేషం. కేటీఆర్ ఫ్రెండ్ వాహనం వరద నీటిలో కొట్టుకుపోతున్నదంటూ… ఓ ద్విచక్ర వాహనాన్ని నెటిజన్లు పోస్ట్ చేయడం విశేషం.
అలాగే ముందు సొంత రాష్ట్రాన్ని చక్కదిద్దుకుని, తర్వాత పక్క రాష్ట్రాల గురించి మాట్లాడితే బాగుంటుందని, హైదరాబాద్‌లో కనీస సౌకర్యాలు కల్పించాలని నెటిజన్లు కామెంట్స్ పెట్టడం, వాటిని షేర్ చేయడం కనిపిస్తోంది. మొత్తానికి అదును చూసి కేటీఆర్‌పై ట్రోల్ చేయడం ఆసక్తికర పరిణామంగా చెప్పొచ్చు.