వరసగా సౌత్ సినిమాల రీమేక్ లకు హిందీలో ఎదురుదెబ్బలు తగులుతున్నట్టుగా ఉన్నాయి. ఆ మధ్యనే తమిళ సినిమా జిగర్తాండా హిందీ రీమేక్ డిజాస్టర్ గా నిలిచింది. సౌత్ వెర్షన్ కు పలు మార్పు చేర్పులతో హిందీలో అక్షయ్ కుమార్ హీరోగా రూపొందిన ఆ సినిమా నెగిటివ్ రివ్యూలను ఎదుర్కొంది. కలెక్షన్ల పరంగా కూడా రేసులో నిలబడలేకపోయింది.
ఇక తెలుగులో ఆకట్టుకున్న జెర్సీ హిందీ రీమేక్ కు పాజిటివ్ అంచనాలు కూడా ప్లస్ కాలేకపోవడం గమనార్హం. ఇది వరకే తెలుగు అర్జున్ రెడ్డిని హిందీలో రీమేక్ చేసి సూపర్ హిట్ పొందిన షాహిద్ కపూర్ కు జెర్సీ మాత్రం చేదు అనుభవాన్ని మిగిల్చింది.
అర్జున్ రెడ్డి రీమేక్ తో మూడు వందల కోట్ల రూపాయల వసూళ్ల సినిమాను ఖాతాలోకి పొందిన ఈ హీరో జెర్సీ రీమేక్ తో అందులో పదో వంతు వసూళ్లను కూడా సాధించలేకపోయాడు.
హిందీ బాక్సాఫీస్ లో జెర్సీ తన ఫుల్ రన్ లో పాతిక కోట్ల రూపాయల వసూళ్లనేమో పొందినట్టుగా ఉంది! బహుశా రీమేక్ రైట్స్ విషయంలో అయినా బాలీవుడ్ ప్రొడ్యూసర్లకు న్యాయం జరిగిందో లేదో మరి. ఆ సంగతలా ఉంటే.. ఇంతకీ జెర్సీ ఎందుకింతలా డిజాస్టర్ అయ్యిందనే అంశంపై ఆ సినిమా యూనిట్ తర్జనభర్జనల్లో ఉన్నట్టుంది.
ఆ సినిమాలో నటించిన నటి మృణల్ ఠాకూర్ స్పందిస్తూ.. తెలుగు వెర్షన్ ఆన్ లైన్లో అందుబాటులోకి రావడం కూడా తమ సినిమా డిజాస్టర్ కావడానికి ఒక కారణం అని చెబుతోంది! అలా అంటే.. అర్జున్ రెడ్డి తెలుగు వెర్షన్ భాషలకు అతీతంగా అన్ని చోట్లా ఆడింది కదా! మరి అప్పుడెందుకు ఆ సినిమా హిందీ వెర్షన్ పై ప్రభావం చూపలేదు! ఆ నటీమణి చెప్పిన లాజిక్ అంత అతుకుతున్నట్టుగా లేదు!