సంక్షేమ పథకాలు వుండాలా అక్కరలేదా అనేది మనబోటి వాళ్లందరినీ కలవరపెట్టే ప్రశ్న. పేదవాడికి చేపను పట్టి యిచ్చే బదులు, చేపలు పట్టే విద్య నేర్పించి వదిలేస్తే అతని బతుకు అతనే బతుకుతాడు కదా అనేది అందరూ ఒప్పుకోవాల్సిన సత్యం. అయితే గేలం పట్టుకునే ఓపిక కూడా లేనివాడి సంగతేమిటి? అందువలన వాడికి కాస్త తిండి పెట్టి, పాఠాలు చెపితే వినే ఓపిక కలిగేట్లా చేసి అప్పుడు చేపలు పట్టడమో, వలలు అల్లడమో నేర్పించాలి. సంక్షేమ పథకాలను విమర్శించేవారికి ఎన్టీయార్ యిలాటి సమాధానమే చెప్పేవారు. దీర్ఘకాలిక పథకాల ద్వారా రేపు స్వర్ణమయం చేసినా, ఆ రేపు చూడడానికి యివాళ యితడు బతికుండాలి కదా అని వాదించేవారు. అందుకే కిలో రెండు రూపాయల బియ్యం అన్నారు. దాన్ని ఎద్దేవా చేసినవారే తర్వాత తర్వాత ఓపెన్ మార్కెట్లో బియ్యం ధర విపరీతంగా పెరిగినా, 20 ఏళ్ల తర్వాత కూడా కిలో రెండుకి, ఒక రూపాయికి కూడా యిచ్చి ఆ లాజిక్‌ను ధ్వంసం చేశారు. 1983లో రెండు రూపాయలకిచ్చారంటే 20 ఏళ్ల తర్వాత 20 రూపాయల కిచ్చినా తక్కువకు యిచ్చినట్లే కదా! అది తోచలేదు పాలకులకు. సంక్షేమ పథకాల పేర పెళ్లి మేమే చేస్తాం, యిల్లు మేమే కట్టిస్తాం, దాంట్లో కలర్ టీవీ మేమే పెట్టిస్తాం, దానికి కేబుల్ కనెక్షన్ ఉచితంగా యిస్తాం, మీ పిల్లలను బళ్లకు పంపితే మేమే తిండి పెడతాం.. యిలా ఒకరిని మించి మరొకరు పథకాలు పెట్టి ప్రణాళికేతర వ్యయం విపరీతంగా పెంచుకుంటూ పోయి ఆర్థిక వ్యవస్థను క్రుంగదీశారు. దీని కారణంగా విద్యావంతులు, మేధావులు సంక్షేమ పథకాలంటే మండిపడే పరిస్థితి వచ్చింది.
ఉచిత పథకాలన్నిటినీ ఒకే గాటన కట్టడం అంత మంచి పద్ధతి కాదనిపిస్తుంది. మధ్యాహ్న భోజన పథకం వంటిది వుంది. స్కూలు నుంచి పేద విద్యార్థులు డ్రాప్ కావడాన్ని అది నివారిస్తుంది, అంతవరకు బాగుంది. కానీ ఆ క్రమంలో టీచర్లను వంటవాళ్లను చేయడం బాగాలేదు. దానికి పరిష్కారం కనుగొని, ఆరోగ్యవంతులైన బాలబాలికలను తయారుచేయగలిగితే జాతి బాగుపడుతుంది. ఎమ్జీయార్ పెట్టిన కొన్ని పథకాలు వింటే మొదట్లో నాకు నవ్వు వచ్చేది – ఉచిత పళ్లపొడి యిస్తామని, ఉచితంగా హవాయి చెప్పులు యిస్తామని.. యిలాటివి. బాగా ఆలోచించగా వాటిలో ఔచిత్యం కనబడింది. గ్రామాల్లో ఓరల్ హైజిన్ గురించి పట్టించుకోరు. వాళ్లకు పళ్లపొడి అలవాటు చేస్తే తర్వాత వచ్చే దంత సమస్యలు తగ్గుతాయి. అలాగే చెప్పులు లేకుండా నడవడం గ్రామాల్లో సర్వసహజం. చెప్పులు అలవాటు చేస్తే, పాదాలు రక్షింపబడతాయి. స్కీములో మొదటిసారి ఉచితంగా యిచ్చి అలవాటు పడేట్లా చేస్తే, తర్వాత వాళ్లు సొంత డబ్బుతోనే కొనుక్కుంటారు. ఆ మధ్య తమిళనాడులో ఒకతను లోకల్‌గా దొరికే మెటీరియల్‌తో తక్కువ ఖరీదులో శానిటరీ టవల్స్ తయారుచేసి పేదలకు అమ్ముతున్నాడని విన్నాను. అలాటివి ప్రభుత్వం సప్లయి చేస్తే, విస్తారంగా మరుగుదొడ్లు కట్టించడం చేపడితే స్త్రీల సమస్యలు చాలా భాగం తగ్గుతాయి. ఇలాటి పథకాలు పెట్టినా ఫర్వాలేదు అనే అభిప్రాయానికి వచ్చాను. ఏదైనా సంక్షేమ పథకం అనగానే అవినీతి, దురుపయోగం, ఆశ్రితపక్షపాతం యివన్నీ వుంటాయని తెలుసు. కానీ పది రూపాయల హవాయి చెప్పుల్లో ఎంత తినేస్తారు కనుక అని మానసికంగా సమాధాన పడ్డాను. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఋణమాఫీ, ఫీజుల రీఎంబర్స్‌మెంటు భారీ సంక్షేమ పథకాలు వుండకూడదు – వాటిల్లో ప్రభుత్వధనం చాలా దురుపయోగం అవుతుంది అని భావిస్తూ వచ్చాను. కానీ యిటీవలే నా అభిప్రాయం మారింది.
టిడిపి చేపట్టిన ఋణమాఫీ పథకం విషయంలో దాన్ని మ్యానిఫెస్టోలో ప్రకటించేవరకు, ఎన్నికలలో ప్రచారం చేసేవరకు వున్న స్వరూపం చూడండి, యిప్పుడు ఎలా మారిందో చూడండి. అప్పుడంతా వ్యవసాయదారులంటే అన్నదాతలు (రైతులు వరి పంట అమ్ముకుంటారు తప్ప అన్నంగా వుండి మనకు దానం చేయరు, కానీ రైతులకు అన్నదాత అనేది పర్యాయపదం అయిపోయింది), జాతి కోసం రక్తంగా చెమటగా మార్చి, యింట్లో భార్య మంగళసూత్రాన్ని సైతం తాకట్టు పెట్టి, కిట్టుబాటు కాని వ్యవసాయం చేసి, అప్పుల బాధతో ఆత్మహత్యకు ఒడిగట్టే ఆర్తుడు. కార్పోరేట్ల మొహాన కోటాన కోట్లు కుమ్మరిస్తున్నామే, వీరికి ఒక్కసారి ఋణమాఫీ చేస్తే తప్పేముంది? అని వాదించారు. మరి యిప్పుడు? రైతులలో అధికశాతం మోసగాళ్లని తేల్చారు. బ్యాంకుల వాళ్లతో కుమ్మక్కయి, నియమాలను ఉల్లంఘించి, తమకు రావలసిన దాని కంటె ఎక్కువగా, అవసరం లేకపోయినా అప్పులు తీసేసుకుని యింట్లో విలాసాలకు ఖర్చు పెట్టారని గణాంకాలతో సహా బయటపెడుతున్నారు. ఒక యింట్లో 70 మంది లోన్లు తీసుకున్నారని, ఒకే పొలంపై నలుగురు తీసుకున్నారని, జిరాక్స్ పాస్‌బుక్కులు కుదువ పెట్టారని, రావలసినది ఎకరాకు పదివేలైతే బ్యాంకు మేనేజరుతో చేతులు కలిపి నలభై వేలు తీసుకున్నారని, పేపర్లపై సరిగ్గా సంతకాలు పెట్టలేదని, డిక్లరేషన్లు సరిగ్గా యివ్వలేదని, తీసుకున్న ఋణాన్ని వ్యవసాయంపై ఖర్చు పెట్టలేదని, ఇంట్లో శుభకార్యాలకు ఖర్చు పెట్టారని.. యిలా ఎన్నో ఎన్నో విషయాలు పబ్లిక్ కంతా తెలియచెప్పారు. నేను చాలా తక్కువ చెప్పాను, ప్రభుత్వ సలహాదారు కుటుంబరావుగారిని అడిగితే గుక్క తిప్పుకోకుండా ఏకబిగిన ఏభై ఇర్రెగ్యులారిటీస్ చెప్పగలరు.
రైతులొకరే మోసగాళ్లంటే పొరపాటు. వారితో పాటు బ్యాంకు అధికారులను కూడా తప్పుపట్టాలి. జిరాక్సు డాక్యుమెంట్లు యిస్తూ వుంటే, అవసరానికి మించి, అర్హతకు మించి అప్పు అడుగుతూంటే కళ్లు మూసుకుపోయాయా? మీరూ నేను ఓవర్‌డ్రాఫ్ట్ అడిగితే లక్ష షరతులు పెడతారే, మరి వీళ్ల విషయంలో యింత వెసులుబాటు దేనికి? లంచాలు పుచ్చుకున్నారా? అయితే వాళ్ల బ్యాంకులు యీ పాటికి వారిపై చర్యలు తీసుకోవాలే! ఏడాది అవుతున్నా యింకా ఆ కార్యక్రమం ప్రారంభం కాలేదేం? కాకపోవడానికి కారణం – బ్యాంకు ఉన్నతాధికారులకు కూడా జరిగినది తెలుసు. ఇదంతా వారి కనుసన్నల్లో జరిగినదే. ప్రభుత్వం వ్యవసాయరంగ ఋణాలు యిన్ని యివ్వాలి అని కొన్ని టార్గెట్లు పెడుతుంది, అవి చేరుకోవాలి. రూలు ప్రకారం వెళితే ఆ మేరకు అప్పులు యివ్వలేరు, బిజినెస్ సాగదు, లాభాలు రావు. ఉన్నతాధికారుల ఉద్యోగాలకే ముప్పు. మరో కోణం నుంచి చూస్తే గ్రామాలలో వున్న రాజకీయ నాయకులందరూ రైతులకు అప్పులిమ్మనమని ఒత్తిడి చేస్తూనే వుంటారు. డబ్బు మీకు తిరిగి వచ్చేస్తుంది, యివ్వడానికి ఏం పోయేకాలం? అసలో, నకిలీవో వాళ్లు ఏ డాక్యుమెంట్లు యిస్తే అవే తీసుకుని అప్పులిచ్చేయండి – అంటూ పోట్లాటకు వస్తారు. వీళ్లు కట్టకపోతే ప్రభుత్వమే యిస్తుంది, మన లోను ఎక్కడికీ పోదు అని బ్యాంకు వాళ్ల ధీమా. ఇలా అందరూ – అంటే రైతులు, రాజకీయ నాయకులు, బ్యాంకులు కలిసి కుమ్మక్కయి ఉత్పాదకతకు ఉపయోగపడవలసిన నిధులను యిలా దుర్వినియోగం చేస్తూ వచ్చారు. ఋణమాఫీ విషయంలో టీవీలో చర్చకు వచ్చిన వివిధ రాజకీయ పక్షాల నాయకులందరూ ఒప్పుకుంటున్నారు – ఎన్నో ఏళ్లగా ఋణాలు దుర్వినియోగం అవుతున్నాయని. కుటుంబరావుగారి వాదనలను కాదనే దమ్ము వారెవరికీ లేదు. ఇవన్నీ సహజమే, చాలా ఏళ్లుగా నడుస్తున్నాయి, రైతులు, బ్యాంకులు వాళ్ల తంటాలేవో వాళ్లు పడుతున్నారు, మధ్యలో మీరు వచ్చి ఋణమాఫీ అని వాళ్లకు ఆశ పెట్టి వాళ్ల కొంప ముంచారు అనే వారు టిడిపిని నిందిస్తున్నారు.
చంద్రబాబు పాదయాత్రలో మొదలెట్టారు ఋణమాఫీ అని. అప్పులు తిరిగి కట్టద్దన్నారు, (కట్టేస్తే మంచిదని ఇప్పుడు సలహా చెప్తున్నారు) బంగారం ఏ రకంగా కుదువ పెట్టినా విడిపిస్తామన్నారు. ఇక అప్పణ్నుంచి రైతులు అవసరం లేకపోయినా అప్పులకు ఎగబడ్డారు, పాతవాటికి ఎగనామం పెట్టారు. విభజన జరిగిన తర్వాత, కొత్తగా ఏర్పడే ఆంధ్ర రాష్ట్రానికి ఆర్థిక పరిపుష్టి వుండదని బాబు ఓ పక్క చెపుతూనే ఎన్నికల ముందు విడుదల చేసిన తన మ్యానిఫెస్టోలో వ్యవసాయ ఋణాలన్నీ (ఇప్పుడు పంట ఋణాలు మాత్రమే అంటున్నారు) మాఫీ చేస్తామని ప్రకటించారు. ఎన్నికల సభల్లో బంగారం గురించి వాగ్దానాలు గుప్పించారు. అవి నమ్మిన రైతులు భారీగా ఓట్లేశారు. ఇక అధికారంలోకి వచ్చాక బాబుకు, కుటుంబరావుగారికి జ్ఞాననేత్రం తెరుచుకుంది. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ వంటి కొత్త పదాలు తెలిశాయి. ఆధార్ కార్డు అనుసంధానం, ఓటరు కార్డు (ఓటరు కార్డుకి, అప్పుకి సంబంధం ఏమిటండి), ఒక వూళ్లో పొలం, మరొక వూళ్లో ఋణం, కౌలుదారు, సొంతదారు యిలాటి అనేక విషయాలు అప్పుడే కొత్తగా తెలిసినట్లు ప్రవర్తిస్తున్నారు. ఏ రాజకీయ నాయకుణ్నయినా అడగండి – మాది రైతు కుటుంబం, నేను రైతునే అంటూంటారు. మరి వీళ్లెవరికి అప్పటిదాకా ఏం జరుగుతోందో తెలియ లేదా? అన్ని అక్రమాలూ యిప్పుడే తెలిశాయా?
టిడిపి ఒరిజినల్‌గా చేసిన వాగ్దానాల ప్రకారం దాదాపు 80వేల కోట్ల దాకా ఖర్చవుతుందని అంచనా వుంది. టీవీ చర్చల్లో కుటుంబరావుగారిని యిదెలా సాధ్యం? ఒక ఆర్థికవేత్తగా సమాధానం చెప్పండి అని పలుమార్లు నిలదీశారు. సాధ్యమే, మేమన్నీ లెక్కలు వేశాం, సర్వం సిద్ధం అని ఆయన అతి కాన్ఫిడెంటుగా చెపుతూ వచ్చారు. ఒకసారి అధికారం వచ్చాక కోటయ్య కమిటీ అన్నారు, కంప్యూటర్లు పాడయ్యాయన్నారు, జాబితాల్లో అవకతవకలన్నారు, యిలా కాలం నెట్టుకుంటూ వస్తున్నారు. నడుస్తున్న దేమిటంటే – కొన్ని షరతులు విధించి యిలా అయితే ఎంత భారం పడుతుందో చెప్పండి అని అధికారులను అడుగుతున్నారుట. వాళ్లు లెక్కలేసి యింత అని తేలుస్తున్నారు, అమ్మో, అది కూడా భరించలేం, యింకో క్రైటీరియా (షరతు) చేర్చండి అంటున్నారు. మళ్లీ కసరత్తు సాగుతుంది. ఇంత.., అబ్బే, యిదీ ఎక్కువే.. యింకో క్రైటీరియా చేరుద్దాం.. యిలా సాగుతోంది బండి. చివరకు రైతుల ఎత్తు, లావు కూడా లెక్కలోకి తీసుకుని మాఫీ పరిధిలోకి వచ్చే ఖాతాలు ఏ వందల్లోకో తెస్తారేమో! టిడిపికున్న యీ అతితెలివి మాకు లేకపోయిందే అని జగన్ వగస్తున్నారు. రైతులు టిడిపిపై పగబట్టి, తిరగబడతారని, వచ్చే ఎన్నికలలో బుద్ధి చెపుతారని ఆశపడుతున్నారు. ఎన్నికల దాకా ఎందుకు గానీ, మీ షరతుల ప్రకారం నాకు అర్హత వున్నా మాఫీ చేయలేదేం, నేను పెట్టిన డాక్యుమెంట్లు జిరాక్సువి కావు అని వాదిస్తూ రైతులు కోర్టులకు వెళ్లిన సందర్భాలు బయటకు రాలేదు. వాళ్లకూ తెలుసు – సూది కోసం సోది కెళితే ఏం జరుగుతుందో!
ఈ భారీ పథకం వలన జరిగిన మేలేమిటంటే – రైతులు, రాజకీయనాయకులు, బ్యాంకులు కలిసి అన్నదాతలను ఆదుకోవడం పేర థాబ్దాలుగా ఆడుతున్న నాటకాని తెర పడింది. బ్యాంకుల్లో ఇంటర్నల్ ఆడిట్లు, ఎక్స్టర్నల్ ఆడిట్లు, ఆర్బిఐ ఆడిట్లు – యిలా ఏవేవో జరుగుతూనే వుంటాయి. వాళ్లెవరూ పట్టుకోలేని యిర్రెగ్యులారిటీలు కుటుంబరావుగారి టీము పట్టుకుని ఉతికి ఆరేసింది. ఇకపై బ్యాంకులు పంట ఋణాలంటే వద్దు బాబోయ్ అంటాయి. ఇచ్చినా అతి కొద్దిగా, యివ్వదగినంతే యిస్తాయి. వ్యవసాయ ఋణాలపై వడ్డీ సబ్సిడీ పేరుతో జరుగుతున్న దుర్వ్యయం ఆగుతుంది. సరైన రైతులకే, సరైన అవసరాలకే ఋణం దొరుకుతుంది. వ్యవస్థను చక్కదిద్ది యీ ఉపకారం చేసినందుకు మనందరం టిడిపికి, చంద్రబాబుకు ఋణపడి వుండాలి. (దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరూ మాఫీ చేయలేరు). అదే సమయంలో కెసియార్‌కు కూడా. ఎందుకంటే ఫీజు మాఫీ పథకం పేరు చెప్పి వసతులు లేని కాలేజీలు పుట్టగొడుగుల్లా వెలిశాయి. అక్కడ చదువు వంటపట్టని కుర్రాళ్లు అనేకమంది సబ్బుబిళ్లల్లా తయారై, ఇంజనీర్ల పేరుతో చలామణీ అవుతూ, ఆ వుద్యోగానికి అర్హత లేక, చిన్న వుద్యోగానికి వెళ్లడానికి మొహం చెల్లక, తలిదండ్రులకు, సమాజానికి భారంగా మారుతున్నారు. ఆ ఫీజు భారం తగ్గించుకోవడానికై కెసియార్ మొదట 1956 షరతు పెట్టబోయారు, కోర్టు చివాట్లు వేయడంతో యిట్నుంచి నరుక్కొద్దామని కాలేజీల్లో సౌకర్యాల పరీక్ష అని జెఎన్టియు ద్వారా కోతల కార్యక్రమం తలపెట్టారు. ప్రయివేటు కాలేజీలే కాదు, ప్రభుత్వ కాలేజీల్లో కూడా కనీస సౌకర్యాలు లేవని, ఫ్యాకల్టీ లేదని, వసతులు లేవని బయటకు వచ్చింది. కాలేజీల గుర్తింపులు రద్దవుతున్నాయి, ఇంజనీరింగు సీట్లు రద్దవుతున్నాయి. దానివలన తెలంగాణలో అనవసరమైన యింజనీర్లు తయారు కారు. విద్యార్థులు యితర వుపయుక్తమైన కోర్సుల్లో చేరి జీవనోపాధి గడించుకుంటారు. ఈ భారీ పథకం కూడా యీ విధంగా సత్ఫలితాలను యిస్తోంది. ఆంధ్రలో కూడా యీ కసరత్తు జరిగి విద్యావ్యవస్థ క్షాళన మయితే తెలుగు యువతీయువకుల జీవితాలు మెరుగుపడతాయి.
– ఎమ్బీయస్ ప్రసాద్ (మే 2015)