ఒక్క అయిడియా జీవితాన్ని మారుస్తుందో, మార్చదో కానీ, ఒక్క హిట్, టాలీవుడ్ లెక్కల్ని మార్చేస్తుంది. భలే భలే మగాడివోయ్ లాంటి చిన్న సినిమా, ఆరేడు కోట్ల సినిమా అంటే చిన్న సినిమా అనే కదా అనాలి. అలాంటి చిన్న సినిమా ఓవర్ సీస్ లో కుమ్మేసింది. సుమారు 1.2 మిలియన్ డాలర్లు వసూలు చేసింది.
ఈగ, టెంపర్, గోపాల గోపాల, గబ్బర్ సింగ్, జులాయి, గోవిందుడు అందరివాడేలే, మిర్చి, లాంటి పెద్ద సినిమాల కలెక్షన్లను అధిగమించింది. మరొక్కవారం కాస్త వసూళ్లు లాగిస్తే రేసుగుర్రం, సన్నాఫ్ సత్యమూర్తి, నేనొక్కడినే, బాద్ షా కలెక్షన్లు కూడా దాటేస్తుంది.
అయితే ఇంతకీ విషయం ఏమిటంటే, ఓవర్ సీస్ మార్కెట్ తీరు చూసి, ఇప్పటికే బేరాలు అయిపోయిన లేదా బేరాలు సాగుతున్న సినిమాల వ్యవహారమే ఛేంజ్ అయిపోయిందట. శంకరాభరణం సినిమా బిబిఎమ్ కు ముందే ఓవర్ సీస్ రైట్లు అమ్ముడుపోయాయి. ఇప్పుడు ఆ రేటుకు మరో పాతిక లక్షలు ఎక్కువ ఇచ్చి మరొకరు ఎగరేసుకుపోయారు. యాభై అరవై లక్షలు ఇచ్చి ఓ చిన్న సినిమా కొంటే, అయిదారు కోట్లు చేసేసుకోవచ్చు అన్న కాన్సెప్ట్ ను ఓవర్ సీస్ లోకి పంపించింది భలే భలే మగాడివోయ్.
నిర్మాణం ప్రారంభం కాకుండానే త్రివిక్రమ్-నితిన్ సినిమా రైట్స్ కోసం ఎగడబడడం ప్రారంభమైంది. దానికి నాలుగు కోట్లు అడుగుతున్నారు నిర్మాత అని వినికిడి. అంటే దాదాపు హీరో రెమ్యూనిరేషన్ ఓవర్ సీస్ నుంచే వచ్చేస్తోందన్నమాట. అయితే అలా అని అన్ని సినిమాలు ఓవర్ సీస్ లో నొల్లేస్తాయి అనుకుంటే అమాయకత్వమే అవుతుంది. హోరాహోరీ, కిక్ 2 లాంటి సినిమాలు కళ్ల ముందుకు వస్తాయి.
ఓవర్ సీస్ జనాలు థియేటర్ కు రావాలంటే, డైరక్టర్ ను బట్టి, నమ్మకమైన వెబ్ సైట్లు ఇచ్చే ర్యాంక్ లను బట్టి వుంటుంది. ఆ తరువాతే స్టార్ కాస్ట్. శ్రీనువైట్ల, త్రివిక్రమ్, రాజమౌళి లాంటి డైరక్టర్ల సినిమాలకు ఓవర్ సీస్ లో ఆదరణ ఎక్కువ. ఇప్పుడు ఆ జాబితాలో మారుతి కూడా చేరాడేమో? మరో సినిమా వస్తే తప్ప కన్ ఫర్మ్ చేయలేం.