తాత‌ను వెన్నుపోటు పొడిచిన సీఎంపై లోకేశ్ ప్రేమ‌!

ఎన్టీఆర్ అంటే సినీ రంగంలోనే కాదు, రాజ‌కీయ రంగంలో ఒక చ‌రిత్ర‌. పార్టీని స్థాపించిన తొమ్మిది నెల‌ల్లోనే టీడీపీని అధికారంలోకి తెచ్చుకున్నారు. తిరుప‌తి జిల్లా వెంక‌ట‌గిరి స‌భ‌లో చంద్ర‌బాబు, లోకేశ్‌, నంద‌మూరి బాల‌కృష్ణ‌, ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ల‌పై…

ఎన్టీఆర్ అంటే సినీ రంగంలోనే కాదు, రాజ‌కీయ రంగంలో ఒక చ‌రిత్ర‌. పార్టీని స్థాపించిన తొమ్మిది నెల‌ల్లోనే టీడీపీని అధికారంలోకి తెచ్చుకున్నారు. తిరుప‌తి జిల్లా వెంక‌ట‌గిరి స‌భ‌లో చంద్ర‌బాబు, లోకేశ్‌, నంద‌మూరి బాల‌కృష్ణ‌, ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ల‌పై ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. ఆ న‌లుగురి నాయ‌కుల సంస్కారం గురించి ఏకిపారేశారు. అమ్మాయిల‌తో తిరుగుతార‌ని, మూడు నాలుగేళ్ల‌కు ఒక నాయ‌కుడు భార్య‌ను మారుస్తుంటాడ‌ని విమ‌ర్శించారు.

త‌న‌పై ఘాటు విమ‌ర్శ‌కు కౌంట‌ర్‌గా నారా లోకేశ్ ఇవాళ ట్వీట్ చేశారు. గ‌తంలో ప‌ని చేసిన ముఖ్య‌మంత్రులంద‌రి ఫొటోల‌ను ఒక చోట చేర్చారు. అలాగే వారి ప‌క్క‌న జ‌గ‌న్ పెద్ద ఫొటోను పెట్టారు. ఒక్క జ‌గ‌న్ త‌ప్ప‌, మిగిలిన వారందరినీ ముఖ్య‌మంత్రులుగా గుర్తించి, గౌర‌వించిన లోకేశ్‌, జ‌గ‌న్‌ను మాత్రం అలా చూడ‌లేక‌పోయారు.

టీడీపీ, వైఎస్ జ‌గ‌న్ మ‌ధ్య రాజ‌కీయ‌ప‌ర‌మైన పోటీకి బ‌దులు, వ్య‌క్తిగ‌తంగా ప‌ర‌స్ప‌రం ద్వేషించుకుంటున్నారు. దీంతో చంద్ర‌బాబు అండ్ కోను జ‌గ‌న్ గౌర‌వించ‌రు. అలాగే వారు కూడా జ‌గ‌న్‌ను అస‌లు మ‌నిషిగానే చూడ‌రు. 

లోకేశ్ గౌర‌వించిన ముఖ్య‌మంత్రుల‌లో నాదెండ్ల భాస్క‌ర్‌రావుకు చోటు ద‌క్క‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. 1984లో ఎన్టీఆర్ గుండె ఆప‌రేష‌న్ కోసం అమెరికా వెళ్లారు. ఆ స‌మ‌యంలో ఎన్టీఆర్ కేబినెట్‌లో ఆర్థిక మంత్రిగా ప‌ని చేసిన‌ నాదెండ్ల భాస్క‌ర్‌రావు నేతృత్వంలో వెన్ను పోటు పొడిచారు. ఎన్టీఆర్‌ను కాద‌ని సీఎంగా నాదెండ్ల‌తో నాటి గ‌వ‌ర్న‌ర్ రామ్‌లాల్ ప్ర‌మాణ స్వీకారం చేయించారు.

నాదెండ్ల వెన్నుపోటుకు వ్య‌తిరేకంగా ప్ర‌జాస్వామ్య పున‌రుద్ధ‌ర‌ణ ఉద్య‌మం పెద్ద ఎత్తున జ‌రిగింది. దీంతో తిరిగి ఎన్టీఆర్‌ను సీఎం పీఠంపై కూచోపెట్టారు. అలాంటి నాదెండ్ల‌కు గౌర‌వప్ర‌ద‌మైన చోటు లోకేశ్ క‌ల్పించ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. అయితే 1995లో ఎన్టీఆర్‌కు త‌న తండ్రి చంద్ర‌బాబు కూడా నాదెండ్ల మాదిరిగానే వెన్నుపోటు పొడ‌వ‌డాన్ని దృష్టిలో పెట్టుకుని త‌గిన గౌర‌వం ఇచ్చాడ‌నే సెటైర్స్ వెల్లువెత్తుతున్నాయి. ఏది ఏమైనా లోకేశ్ ట్వీట్ చ‌ర్చ‌నీయాంశ‌మ‌వుతోంది.