టీటీడీ నూతన పాలక మండలిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ఎన్నికలు అతి సమీపంలో ఉన్న నేపథ్యంలో టీటీడీ బోర్డులో సామాజిక సమీకరణలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో టీటీడీ నూతన చైర్మన్‌గా జంగా కృష్ణమూర్తి పేరు దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది.
ఇప్పటికే ఆయన ఇంటి వద్దకు క్యూ కడుతున్నట్టు సమాచారం. రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ కూడా టీటీడీ చైర్మన్ పదవిని ఆశిస్తున్నారని తెలిసింది.
ఇదిలా వుండగా నూతన పాలక మండలి కూర్పు ఈ నెలాఖరుకు కొలిక్కి వచ్చే అవకాశం వుంది. వచ్చే నెల 2 లేదా 3వ తేదీల్లో టీటీడీ కొత్త పాలకమండలిని ప్రకటించనున్నట్టు తెలిసింది. వచ్చే నెల 7న వైవీ సుబ్బారెడ్డి నేతృత్వంలోని పాలక మండలికి చివరి సమావేశం జరగనుంది. వైవీ సుబ్బారెడ్డి నాలుగేళ్ల పాటు టీటీడీ చైర్మన్‌గా కొనసాగడం విశేషం.
వైవీ సుబ్బారెడ్డి పాలనలో ఆయన కంటే ధర్మారెడ్డే పూర్తిస్థాయిలో హవా కొనసాగించారనే ప్రచారం వుంది. జేఈవోగా, ఈవోగా ధర్మారెడ్డి టీటీడీని తన గుప్పిట్లో పెట్టుకుని, తాను అనుకున్నది చేశారని చెబుతారు. ఇందులో కొన్నింటిపై విమర్శలు, మరికొన్నింటిపై ప్రశంసలు ఉన్నాయి. కొత్త పాలక మండలి వస్తే, ధర్మారెడ్డితో ఎలా వుంటుందో చూడాలనే చర్చ తిరుపతి, తిరుమలలో విస్తృతంగా సాగుతోంది. ధర్మారెడ్డిని కాదని, ఎవరూ ఏమీ చేయలేరనేది మెజార్టీ అభిప్రాయం.