వైసీపీ ప్రభుత్వం వచ్చినా, తమకు న్యాయం జరగలేదని చాలా మంది నాయకులు, కేడర్‌లో అసంతృప్తి వుంది. చిన్నచిన్న పనులు కూడా జరగడం లేదని వాపోవడం తెలిసిందే. అయితే వైసీపీని నమ్ముకున్న వారందరికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ న్యాయం చేశారని ఆయన చిన్నాన్న, ఉత్తరాంధ్ర వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. వైవీ సుబ్బారెడ్డి కామెంట్స్ వైసీపీలో చర్చనీయాంశమయ్యాయి.
ఇవాళ వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ పవన్‌పై విమర్శలు గుప్పించారు. పొత్తులపై వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకరే వచ్చినా, ఇద్దరొచ్చినా, ముగ్గరొచ్చినా, నలుగురొచ్చినా తాము మాత్రం ఒంటరిగానే ఎదుర్కొంటామని అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు, పవన్‌కల్యాణ్ పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా, ప్రతిపక్షాలు ఎలా వచ్చినా తాము సిద్ధంగా ఉన్నామన్నారు.
పవన్ పబ్లిసిటీ కోసమే వలంటీర్లపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. స్క్రిప్ట్ ఎవరో రాసిస్తే పవన్ చదువుతున్నారని తప్పు పట్టారు. నిత్యం ప్రజలకు సేవలందిస్తున్న వలంటీర్లపై అవాకులు చెవాకులు పేలితే చూస్తూ ఊరుకునేది లేదని ఆయన వార్నింగ్ ఇచ్చారు. వైసీపీని నమ్ముకున్న అందరికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ న్యాయం చేశారని ఆయన చెప్పడం విశేషం. క్షేత్రస్థాయిలో తమ పార్టీ బలంగా వుందని ఆయన చెప్పుకొచ్చారు.
వచ్చే ఎన్నికల్లో ఎన్ని పార్టీలు కలిసొచ్చినా జగన్ వైపే ప్రజలున్నారని ఆయన అన్నారు. వైసీపీని గద్దె దించేందుకు మూడు పార్టీలు ఏకం కావాలని అనుకుంటున్నాయంటే… జగన్ ఎంత స్ట్రాంగో తెలుస్తోందని ఆయన అన్నారు.