టీమిండియా.. ఈ జోరు కొనసాగనీ.!

2015 వరల్డ్‌ కప్‌లోకి టీమిండియా అడుగు పెడ్తున్నప్పుడు భారత క్రికెట్‌ అభిమానుల్లో పెద్దగా అంచనాల్లేవు. అంతకు ముందు ఆస్ట్రేలియా టూర్‌లో టెస్టులు, వన్డేల్లో టీమిండియా మూటగట్టుకున్న పరాజయాలే అందుకు నిదర్శనం. జట్టులో అనుభవజ్ఞులైన బ్యాట్స్‌మన్‌…

2015 వరల్డ్‌ కప్‌లోకి టీమిండియా అడుగు పెడ్తున్నప్పుడు భారత క్రికెట్‌ అభిమానుల్లో పెద్దగా అంచనాల్లేవు. అంతకు ముందు ఆస్ట్రేలియా టూర్‌లో టెస్టులు, వన్డేల్లో టీమిండియా మూటగట్టుకున్న పరాజయాలే అందుకు నిదర్శనం. జట్టులో అనుభవజ్ఞులైన బ్యాట్స్‌మన్‌ లేరు, బౌలింగ్‌ మరీ దారుణం. ఈ పరిస్థితుల్లో టీమిండియా వరల్డ్‌ కప్‌ టైటిల్‌ని నిలబెట్టుకోవడం అసంభవం.. అనే అనుకున్నారంతా.

వరల్డ్‌ కప్‌లో గెలిచినా గెలవకున్నా, టీమిండియా తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై నెగ్గితే చాలని చాలామంది కోరుకున్నారు. వారి  కోరిక నెరవేరింది. అలా ఇలా కాదు, భారీ విజయాన్నే పాకిస్తాన్‌పై నమోదు చేసిన టీమిండియా, ఆ తర్వాత వన్డేల్లో అత్యంత బలమైన జట్టుగా వున్న సౌతాఫ్రియాపైనా అదే తరహా విజయాన్ని సొంతం చేసుకుంది. మొదటిది చరిత్రను కొనసాగిస్తే, రెండోది చరిత్రను తిరగరాసింది. రెండూ అభిమానుల్ని సంబరాల్లో ముంచెత్తేశాయి. దేనికదే గొప్ప విజయం.

వరుసగా రెండు సంచలన విజయాలు నమోదు చేసినా, ఇప్పటికీ టీమిండియా సమర్థవంతమైన బౌలర్‌ లేక విలవిల్లాడుతోందన్నది కాదనలేని వాస్తవం. మ్యాచ్‌ మ్యాచ్‌కీ టీమిండియాపై ఒత్తిడి పెరుగుతోంది. ఇప్పటిదాకా అయితే అభిమానుల్లో పెద్దగా అంచనాల్లేవు. ఇప్పుడేమో అభిమానులు, టీమిండియా నుంచి చాలా చాలా ఆశిస్తున్నారు. ఒత్తిడిని తట్టుకోవడంలో ధోనీ తర్వాతే ఎవరైనా. ‘మిస్టర్‌ కూల్‌’ అని ధోనీకి వున్న పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదుకదా.!

డజనుకు పైగా మ్యాచ్‌లు జరిగిపోయాయి. ఆయా జట్ల బలాబలాలపై ఓ అంచనాలేర్పడ్డాయి. టీమిండియా బౌలింగ్‌ విభాగంలో వీక్‌గా వున్న మాట వాస్తవం. అలాగే దాదాపు అన్ని జట్లలోనూ ‘వీక్‌ పాయింట్స్‌’ బయటపడిపోయాయి. కప్‌ని ఖచ్చితంగా కొడ్తాయని భావిస్తున్న ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, సౌతాఫ్రికా కన్నా మునుపటి ఛాంపియన్‌ టీమిండియానే ఇప్పుడు బలంగా వుంది.

ఎలాగూ భారత బౌలర్లు ‘పిచ్‌’లను వాడుకోవడంలో సత్తా చాటుకున్నారు గనుక, అది పెద్ద వీక్‌నెస్‌ కాకపోవచ్చు. బ్యాటింగ్‌లో బలంగా వున్న టీమిండియా, ఆఖరి నాలుగైదు ఓవర్లలో ఇబ్బంది పడ్తోంది. ఇంకో నలభై యాభై పరుగులు సాధించే అవకాశాన్ని  టీమిండియా చేజార్చుకుంది పాకిస్తాన్‌, సౌతాఫ్రికా మ్యాచ్‌లలో. ఫస్ట్‌ బ్యాటింగ్‌ చేయాల్సి వస్తే, ప్రత్యర్థి ముందు వీలైనంత పెద్ద టార్గెట్‌ పెడితే, బౌలర్లు సేఫ్‌ అవుతారు. ఈ ఒక్క విషయంలో టీమిండియా పక్కా ప్లానింగ్‌తో వ్యవహరిస్తే బెటర్‌.

ఓవరాల్‌గా టీమిండియా పెర్ఫామెన్స్‌ భారత క్రికెట్‌ అభిమానుల అంచనాల్ని మించేలా వుంది. రెండు మ్యాచ్‌లతోనే పూర్తిగా మన జట్టు కప్‌ కొట్టేస్తుందా? అంటే అలా ఆశించడమైతే తప్పు కాదు. పైగా, ఇప్పటిదాకా టీమిండియా విజయం సాధించింది పాకిస్తాన్‌, సౌతాఫ్రికా మీద కావడంతో.. టీమిండియా పూర్తిస్థాయిలో కప్‌ని గెల్చుకునేందుకు అర్హత గల జట్టు.. అని ఢంకా బజాయించి మరీ చెప్పేయొచ్చు. మెన్‌ ఇన్‌ బ్లూ.. ఆల్‌ ది బెస్ట్‌.!