ఎమ్బీయస్‌ : చెడ్డకాపురానికి ముప్పేమిటి…?

'చెడ్డకాపురానికి ముప్పేమిటి? చంద్రకాంత (ఒక పిండివంట)లొండు' అన్నాట్ట వెనకటికి మొగుడొకడు. కాంగ్రెసు పార్టీ ములిగిపోతోంది, కొందరు నాయకులు విడిచి వెళ్లిపోతున్నారు, దాన్ని రక్షించడానికి ఏదో ఒకటి చేయాలి, కనీసం రాహుల్‌కు బదులు ప్రియాంకాను తేవాలి…

'చెడ్డకాపురానికి ముప్పేమిటి? చంద్రకాంత (ఒక పిండివంట)లొండు' అన్నాట్ట వెనకటికి మొగుడొకడు. కాంగ్రెసు పార్టీ ములిగిపోతోంది, కొందరు నాయకులు విడిచి వెళ్లిపోతున్నారు, దాన్ని రక్షించడానికి ఏదో ఒకటి చేయాలి, కనీసం రాహుల్‌కు బదులు ప్రియాంకాను తేవాలి అని చాలామంది వర్రీ అయిపోతున్నారు కానీ పార్టీ అధ్యకక్షురాలు సోనియాకు ఆ చింతలేమీ లేవు. పోతున్నవాళ్లందరూ పార్టీనుంచి సకల ప్రయోజనాలు అనుభవించి, యిప్పుడు రాళ్లేసి పోతున్నారు. ఇలాటివాళ్లు ఎంతమంది వదిలితే అంతమంచిది, పార్టీని నమ్ముకుని వుండే కొత్త నాయకత్వమే చాలు అనుకుంటోందామె. అందుకే తాము చెప్పినమాట వినకపోతే పార్టీ ఫిరాయిస్తామని బెదిరించినా, రాహుల్‌ను మార్చమని సలహాలు వచ్చినా కిమ్మనకుండా వుంది. రాహుల్‌ నాయకత్వంపై విమర్శలు చేసి యిలా వెళ్లిపోతున్నపుడు, తన నాయకత్వంపై యిలాటి అసంతృప్తి రగులుతున్నపుడు మామూలుగా అయితే వారిని పిలిచి రాహుల్‌తో సమావేశం ఏర్పాటు చేసి వుండాలి. కానీ సోనియా యిటీవలి కాలంలో అది మానుకున్నారు. తన మాట నెగ్గించుకోవడానికి సీనియర్‌ నాయకులు యిదే తరుణమని భావిస్తున్నారని ఆమె అభిప్రాయం. 'పొండిరా పొండి, నా కాలం కర్మం కలిసొస్తేనే రండిరా రండి..' అనే పాట తనలో పాడుకుంటున్నారు. తనకు హితవు చెప్పడానికి వచ్చినవారితో ''1998లో నేను యిలాటి యిబ్బందే పడ్డాను, యిప్పుడు రాహుల్‌ వంతు!'' అని వేదాంతధోరణిలో మాట్లాడుతున్నారు. 

ఓటమి సూచనలు కనబడిన దగ్గర్నుంచి గత 14 నెలల్లో సుమారుగా 12 మంది సీనియర్‌ నాయకులు పార్టీకి గుడ్‌బై చెప్పారు. వారిలో కొందరు – హరియాణా ముఖ్యమంత్రి హూడాకు వ్యతిరేకంగా 2013 సెప్టెంబరులో వెళ్లిపోయి బిజెపిలో చేరి ఎన్‌డిఏ మంత్రి అయిపోయిన రావు ఇందర్‌జిత్‌ సింగ్‌, అదే కారణంతో 2014 జులైలో వెళ్లిపోయి బిజెపిలో చేరిన చౌధరీ బీరేందర్‌ సింగ్‌, రాష్ట్రవిభజన నిర్ణయానికి వ్యతిరేకంగా ఫిబ్రవరి 2014లో వెళ్లిపోయిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి, మార్చి 2014లో వెళ్లి బిజెపిలో చేరి ఎంపీ అయిపోయిన ఉత్తర్‌ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి జగదంబికా పాల్‌, అదే నెలలో టిక్కెట్టు దక్కని కారణంగా బిజెపిలో చేరి ఎంపీగా గెలిచిన కల్నల్‌ సోనారామ్‌ చౌధరీ, అదే నెలలో అదే కారణంతో సమాజ్‌వాదీ పార్టీలోకి దూకిన మాజీ కేంద్రమంత్రి బూటా సింగ్‌, అదే నెలలో అదే కారణంతో పార్టీ విడిచిన మరో మాజీ కేంద్రమంత్రి జాఫర్‌ షరీఫ్‌ – వీళ్లంతా పార్లమెంటు ఎన్నికల ఫలితాలకు ముందు వెళ్లిపోయారు. ఫలితాలు వచ్చాక హై కమాండ్‌ తీరు విమర్శిస్తూ మాజీ కేంద్రమంత్రి జికె వాసన్‌ విడిపోయి, తన పాత పార్టీ తమిళ మానిల కాంగ్రెసును పునరుద్ధరించాడు. ఢిల్లీ ఎన్నికల సందర్భంగా మాజీ కేంద్రమంత్రి కృష్ణ తీరథ్‌ పార్టీ వదిలి బిజెపి అభ్యర్థిగా పోటీ చేశారు. అదే నెలలో కేంద్రమంత్రిగా వుండి, సోనియా కుటుంబానికి సన్నిహితురాలిగా పేరుబడిన జయంతీ నటరాజన్‌ బయటకు వచ్చేసి, కాంగ్రెస్‌ నాయకత్వాన్ని ఘాటుగా విమర్శించారు. ఇంకా ఏ పార్టీలోనూ చేరలేదు. వీరే కాకుండా యింకా కొంతమంది కూడా క్యూ కట్టి వున్నారని వినికిడి. ఆంధ్రలో అయితే బిజెపిలో, తెలంగాణలో అయితే తెరాసలో చేరే కాంగ్రెసువారి పేర్లు తరచుగా వినబడుతూనే వున్నాయి.

2013లో రాహుల్‌ నియమించిన పంజాబ్‌ యూనిట్‌ అధ్యకక్షుడు ప్రతాప్‌ సింగ్‌ బాజ్వాను మార్చేయకపోతే తను పార్టీ మారిపోతానని మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ కబురుమీద కబురు పంపుతున్నా రాహుల్‌ బెసకటం లేదు. తమిళనాడు యూనిట్‌ అధ్యకక్షుడిగా వున్న జికె వాసన్‌ వెళ్లిపోయి తన పాత పార్టీ పెట్టుకున్నాక చిదంబరం కూడా వెళ్లి ఆ పార్టీలో చేరతాడని అందరూ అనుకున్నారు. వాసన్‌ స్థానంలో రాహుల్‌ నియమించిన ఇలంగోవన్‌ 'ధైర్యముంటే పార్టీ విడిచిపొండి' అని చిదంబరాన్ని, అతని కొడుకు కార్తీక్‌ను బహిరంగంగా ఛాలెంజ్‌ చేశాడు. చిదంబరం రాహుల్‌ వద్దకు వచ్చి ఇలంగోవన్‌పై ఫిర్యాదు చేసినా అతనేమీ చర్య తీసుకోలేదు. సోనియా మందలించి వదిలేసింది. చిదంబరం అవమానాన్ని దిగమింగాల్సి వచ్చింది. హరియాణాలో హూడాకు వ్యతిరేకంగా పార్టీలో యితర నాయకులు వెళ్లిపోతున్నా అతన్ని బలపరుస్తూ వచ్చారు సోనియా-రాహుల్‌. మొన్న అసెంబ్లీ ఎన్నికలలో కేవలం 15 సీట్లు మాత్రమే గెలవడంతో హూడా హోదా తగ్గించాలని భావించి, అతని వ్యతిరేకవర్గంలోని కిరణ్‌ చౌధురీని లెజిస్లేచర్‌ పార్టీ నాయకుడిగా నియమించారు. దీనికి హూడా అభ్యంతరం తెలిపినా పట్టించుకోలేదు. ఛత్తీస్‌గఢ్‌లో అజిత్‌ జోగీ రాజ్యమే యిన్నాళ్లూ నడిచింది. ఇప్పుడు రాహుల్‌ అతని ప్రత్యర్థి భూపేష్‌ బాఘేల్‌ను దువ్వుతున్నాడు, అజిత్‌ గోల పెడుతున్నా వినకుండా. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెసు అంటే తన సామంత రాజ్యమే అని భావించిన కమల్‌ నాథ్‌కు కూడా పిలక కోయడం జరిగింది. పార్లమెంటులో తనే సీనియర్‌ మోస్ట్‌ పార్టీ ఎంపీ కదా, తనకే పార్లమెంటరీ పార్టీ నాయకత్వం యిస్తారనుకుంటే యివ్వలేదు, మల్లికార్జున్‌ ఖర్గేకు యిచ్చారు. అసాంలో తరుణ్‌ గొగొయ్‌పై తిరుగుబాటు చేసి విఫలమై గత జులైలో మంత్రివర్గం నుండి తప్పుకున్న హిమాంత బిశ్వశర్మను బిజెపి తన పార్టీలోకి లాగుదామని చూస్తోందని గ్రహించిన రాహుల్‌ అతనితో యిప్పటికి మూడుసార్లు సమావేశమయ్యాడు కానీ, అతని గొంతెమ్మ కోర్కెలు తీర్చడానికి సిద్ధపడలేదు. 

రాష్ట్రాలలో చాలాకాలంగా పాతుకుపోయిన పాత నాయకులకు సంస్థాగత ఎన్నికలు, యువతరం రావడం, కొత్తగా నాయకులు కావడం – యిలాటివి యిష్టం లేదు. తాము లేదా తమ పిల్లలే ఎల్లకాలం పార్టీని చేతిలో పెట్టుకుని, ఎన్నికలలో టిక్కెట్లు, నిధులు పొందుతూ వుండాలని వారి ఆలోచన. 2007లో రాహుల్‌ యూత్‌ కాంగ్రెస్‌లో ఎన్నికలు నిర్వహించి యువకులను తీసుకుని వచ్చాడు. వారంతా రాహుల్‌కు మాత్రమే విధేయులు. ఇప్పుడు మాతృసంస్థలో కూడా సంస్థాగతమైన ఎన్నికలు జరపాలని, ఎవరికి బలం వుంటే వారి మాట చెల్లాలని, వీరంతా తన మాట వింటారని రాహుల్‌ ఆలోచన. సోనియాకు కావలసినదీ అదే. తన తదనంతరం పాతతరం నాయకులు రాహుల్‌పై తిరగబడితే ఒంటరివాడై పోతాడని బెంగ. అయితే కేరళ, బిహార్‌, బెంగాల్‌ తదితర రాష్ట్రాలలో వృద్ధతరం సంస్థాగత ఎన్నికలను, రాహుల్‌ నియమించినవారిని అడ్డుకుంటున్నారు. ఇలా అడ్డుకుంటున్నవారిని తరిమివేసి, పాతతరపు నాయకత్వపు బూజు దులిపేసి, కాంగ్రెసును మళ్లీ తృణమూలాల నుంచి పునర్నిర్మించాలని రాహుల్‌ ఆశ. డిసెంబరు 2014లో జరిగిన యూత్‌ కాంగ్రెసు సమావేశంలో అదే అతను చెప్పాడు. అతని ఆశలకు వూపిరి పోస్తున్నది రాజస్థాన్‌లో సచిన్‌ పైలట్‌ వంటి యువనాయకులు. అతన్ని మార్చి 2014లో రాజస్థాన్‌ యూనిట్‌ యిన్‌చార్జి చేసిన తర్వాత నలుగురు మాజీమంత్రులు, ఏడుగురు ఎమ్మెల్యేలతో సహా 70 మంది నాయకులు పార్టీలో మళ్లీ చేరారు. తమ పట్టు సడలకూడదని పాతతరం రాజీనామాలతో బెదిరిస్తూంటే, వీళ్లు ఎలాగోలా వెళ్లిపోతే యిప్పట్లో ఎన్నికలు లేనందున కొత్తవాళ్లను తెచ్చుకుని, నాయకులుగా దిద్దుకునే అవకాశం వస్తుందని రాహుల్‌ ప్రయత్నిస్తున్నాడు. ఇందిరా గాంధీ గతంలో యిలాగే చేసింది. సిండికేట్‌ పేరుతో పెత్తనం చలాయించిన వృద్ధతరాన్ని తరిమివేసి తనకు మాత్రమే విధేయులుగా వుండే కొత్త నాయకులను సృష్టించుకుంది. మరి ఇందిరకున్న నాయకత్వ లక్షణాలు రాహుల్‌కు వున్నాయా అనేదే ప్రశ్న!

 – ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఫిబ్రవరి 2015)

[email protected]