ఎండలెందుకు మండిపోతున్నాయ్‌.!

గ్లోబల్‌ వార్మింగ్‌.. ప్రపంచాన్ని భయపెడ్తున్న భూతమిది. సముద్రాల్లో పెద్ద పెద్ద ‘ఐస్‌ బర్గ్‌’లు కరిగిపోతున్నాయి.. సముద్ర జలాలు వేడెక్కిపోతున్నాయి.. సముద్ర నీటి మట్టం పెరిగిపోతోంది.. భూమిని సముద్రం మింగేస్తోంది.. Advertisement గత కొంతకాలంగా పర్యావరణ…

గ్లోబల్‌ వార్మింగ్‌.. ప్రపంచాన్ని భయపెడ్తున్న భూతమిది. సముద్రాల్లో పెద్ద పెద్ద ‘ఐస్‌ బర్గ్‌’లు కరిగిపోతున్నాయి.. సముద్ర జలాలు వేడెక్కిపోతున్నాయి.. సముద్ర నీటి మట్టం పెరిగిపోతోంది.. భూమిని సముద్రం మింగేస్తోంది..

గత కొంతకాలంగా పర్యావరణ వేత్తలు వ్యక్తం చేస్తోన్న ప్రధానమైన ఆందోళన ఇది. భూమిపై ఉష్ణోగ్రతలు పెరుగుతూ పోతే, సమీప భవిష్యత్తులోనే మానవాళి సర్వనాశనమైపోతుందన్నది కాదనలేని వాస్తవం. కారణం ఎవరు? అంటే ఇంకెవరు.. ఖచ్చితంగా మనిషే. అభివృద్ధి పేరుతో భూమ్మీద పచ్చదనాన్ని మనిషి హరించేస్తున్నాడు. ఫలితం అనుభవిస్తున్నాడు.

ప్రపంచం సంగతి పక్కన పెడదాం. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి రానురాను దారుణంగా తయారవుతోంది. ఐఎఎండీ తాజాగా పంపిన ‘రెడ్‌ అలర్ట్‌’లో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలు ‘రెడ్‌ జోన్‌’లో వున్నాయి. అంటే ఇక్కడ ఎండలు మరింతగా మండిపోతాయనీ, పరిస్థితి చాలా తీవ్రంగా వుంటుందనే హెచ్చరిక అన్నమాట. అందరికీ తెల్సిన విషయాలే.. చెట్లు తగ్గితే వాతావరణం వేడెక్కిపోతుందని. కానీ, అభివృద్ది పేరు చెప్పి విచక్షణారహితంగా పచ్చదనాన్ని మాయం చేసేస్తున్నాం.

కొత్త టెక్నాలజీతో చెట్లను ఓ చోట తొలగించి, ఇంకో చోట వాటికి జీవం పోస్తున్నారు.. అనేది కేవలం మాటలకే పరిమితమవుతోంది. ఒక ముఖ్యమంత్రేమో కోటి చెట్లు నాటాలంటారు.. ఇంకో ముఖ్యమంత్రి పది కోట్ల చెట్లు నాటడమే లక్ష్యమని చెబుతారు. వాస్తవంలో ఆ లెక్కలు చిత్తు కాగితాలకే పరిమితమవుతున్నాయి. ఫలితంగా తెలుగు రాష్ట్రాలు నిప్పుల కుంపటిగా మారిపోతున్నాయి.

గడచిన ఐదేళ్ళలోనే తీసుకుంటే, రెండు రాష్ట్రాల్లో పచ్చదనం చాలావరకు మాయమైపోయింది. జాతీయ రహదార్ల చుట్లూ ఒకప్పుడు పచ్చదనం కన్పించేది. ఇప్పుడు కనుచూపు మేరలో జాతీయ రహదార్ల పక్కన చెట్లు కన్పించని దుస్థితి. గ్రామాల్లో సైతం పచ్చదనం కన్పించడం గగనంగా మారిపోయిందంటే పరిస్థితి ఎంత దారుణంగా వుందో అర్థం చేసుకోవచ్చు. 

ఓ మోస్తరు పట్టణాలు, నగరాలు కాంక్రీట్‌ జంగిల్స్‌లా మారిపోతున్నాయి. మహా నగరాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. వర్షం పడినా భూమిలోకి నీరు నిలవని పరిస్థితి పట్టణం, నగరం అన్న తేడా లేకుండా అన్ని చోట్లా కన్పిస్తోంది. అదే భూమి తేలిగ్గా వేడెక్కిపోయేలా చేస్తోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ‘చెరువులు’ అన్న పదం చరిత్రలో చదువుకోడానికి తప్ప, ముందు తరాలకు ప్రాక్టికల్‌గా చూపించలేని పరిస్థితి వస్తోందడడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం.

వున్నపళంగా పచ్చదనాన్ని పెంచగలిగితే వచ్చే వేసవి నాటికి ఎండల తీవ్రత 1 డిగ్రీ సెంటీగ్రేడ్‌ అయినా తగ్గించవచ్చన్నది శాస్త్రవేత్తల వాదన. కానీ అంతటి చిత్తశుద్ధి మన పాలకుల్లో ఎక్కడ.? తుపాను వంటి ప్రకృతి వైపరీత్యాల ద్వారా పచ్చదనానికి కలిగే నష్టం కన్నా.. మనకు మనంగా ప్రకృతికి చేస్తున్న నష్టం కారణంగానే మండే ఎండల్ని మనమే కొనితెచ్చుకుంటున్నట్లవుతోంది.