అడుగడుగున లంచం.. తాయిలం

లంచమా.. అంటే కాదు గిఫ్ట్ అంటాడు ఒకడు.. గిప్ట్ అయితే ఓకే అంటాడు మరొకడు. ఈ వైనం భారతదేశ రాజకీయాలకు అచ్చంగా అతికినట్లు సరిపోతుంది. వ్యవస్థలో అవినీతి, దాని వల్ల పెరుగుతున్న నల్లధనం సంగతి…

లంచమా.. అంటే కాదు గిఫ్ట్ అంటాడు ఒకడు.. గిప్ట్ అయితే ఓకే అంటాడు మరొకడు. ఈ వైనం భారతదేశ రాజకీయాలకు అచ్చంగా అతికినట్లు సరిపోతుంది. వ్యవస్థలో అవినీతి, దాని వల్ల పెరుగుతున్న నల్లధనం సంగతి ఒక వంతు అయితే రాజకీయాల్లో పెరుగుతున్న తాయిలాల సంస్కృతి కూడా ఓ విధమైన లంచంగానే పరిగణించాలి. భారత రాజకీయ పార్టీలు ఏది అధికారంలోకి వచ్చినా, ఎక్కడ అధికారంలోకి వచ్చినా ఈ తాయిలాలు అనే లంచం లాంటి వ్యవహారాల చుట్టూనే సాగుతోంది పాలన అంతా. ఈ వ్యవహారం ఓ ఊబిలా తయారైంది. ఎవరు వచ్చినా, అందులోంచి బయటకురాలేకపోతున్నారు. 

ఒక వేళ బయటకు రావాలని ప్రయత్నించినా ఓట్ల రాజకీయాలు వారిని ఆ పని చేయనివ్వడం లేదు. ప్రధాని కావచ్చు.. ముఖ్యమంత్రి కావచ్చు.. సర్వ స్వతంత్రుడి మాదిరిగా కనిపించినా, నిర్ణయాల దగ్గరకు వచ్చేసరికి ఓటర్లు, వాళ్లను తమ నిర్ణయాలు ఏ మేరకు ప్రభావితం చేస్తాయన్న లెక్కలు తప్పడం లేదు. దాంతో తన ఆలోచనలు పక్కన పెట్టి, ఓట్ల లెక్కల దిశగానే ముందుకు సాగాల్సి వస్తోంది. ఒక విధంగా ఇప్పుడు కేంద్ర మైనా, రాష్ర్టమైనా సరే, ప్రభుత్వాలు జనాలకు తాయిలాలు ఇవ్వకుండా పాలన సాగించే స్థితిలో లేవు. బడా పారిశ్రామిక వేత్తలు, కంపెనీల నుంచి, ప్రభుత్వ ఉద్యోగుల మీదుగా, సాధారణ ఓటరు వరకు ప్రతి ఒక్కరికి తాయిలం అందిస్తేనే పాలన సజావుగా వున్నట్లు. 

మళ్లీ అయిదేళ్ల తరువాత ఓటర్ల ముందుకు వచ్చే అవకాశం వుంటుంది. అలా కాకుంటే ఇండియన్ పాలిటిక్స్‌కు అస్సలు సరిపోదు. ఇదంతా రాజకీయ నాయకులు చేసిన పాపం. ఓట్ల కోసం జనాలకు, వివిధ వర్గాలకు, మతాలకు, కులాలకు తాయిలాలు ఇవ్వడం అలవాటు చేసారు. తమ తమ బలం చూసి ఇస్తున్నా తాయిలాలను ఆనందంగా అందుకోవడం అలవాటైంది. ఇప్పుడు అలా కాదు అంటే, బుస్సుమనే ప్రమాదం వచ్చి పడింది. తాయిలం అనే నాగస్వరం ఊదుతుంటేనే, జనం మౌనంగా వుండి, ప్రభుత్వాన్ని, దాన్ని నడుపుతున్న నేతలను వారి ఇష్టానికి వదిలేస్తారు. అలా కాకుండా కాస్త సంస్కరణ అంటే చాలు బుస్సుమంటారు.. మొదటికే మోసం వస్తుంది.

ఫర్ ఇండియన్ రోడ్స్ అంటాయి వాహనాల ప్రకటనలు. ఫర్ ఇండియన్ పాలిటిక్స్ అని సిద్దాంత గ్రంధాలు ప్రత్యేకంగా రాసుకోవాలేమో? ఇండియన్ పాలిటిక్స్ అలా తయారుచేసి పెట్టింది రాజకీయ నాయకులే. తమ స్వార్థం కోసం, అధికార సాధన కోసం పెడదారి పాలనను అలవాటు చేసారు. ఇప్పుడు ఆ గాడిలో తప్ప మరో దారిన పయనించలేనంతగా జటిలం అయిపోయింది ప్రయాణం.

ఢిల్లీ ఎన్నిక ఫలితాలు వచ్చిన వెంటనే జాతీయ, రాష్ట్రీయ మీడియాలో వచ్చిన కథనాల్లో ఓ ఆసక్తికర కథనం వుంది. ఢిల్లీ ఫలితం కేంద్ర బడ్జెట్ పై ఫలితం చూపిస్తుందా? మోడీ కూడా సంక్షేమ దిశగా పయనిస్తారా? మోడీ తన వ్వవహార శైలి మార్చుకుంటారా? అన్నదే ఆ కథన సారాంశం.

ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగుల జీతభత్యాల నవీకరణలో భాగంగా 43శాతం పెంపుదలకు ముఖ్యమంత్రి చంద్రబాబు సై అన్నారు. అంతకు ముందు వారం పది రోజుల పాటు ముఖ్యమంత్రి, మంత్రులు రాష్ర్ట ఆర్థిక పరిస్థితి పై తెగ బాధలు పడ్డారు. ప్రచారం చేసారు.. అయినా కూడా 43శాతం పెంపుదలతో కూడిన వేతన సవరణకు సై అనక తప్పలేదు.
సంక్రాంతికి ఇచ్చిన మాదిరిగానే ఇతర మతాల పండుగలకు కూడా సరుకులు ఇస్తామని ఆంధ్ర ఆర్థిక మంత్రి వెల్లడించారు.

పరిశ్రమలకు సింగిల్ విండో అనుమతులే కాదు, రాయతీలు, భూములు ఇంకా.. ఇంకా చాలా చేస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు.

ఇలా రాసుకుంటూ పోతే తాయిలాల జాబితా చాలానే వుంటుంది.

జీతాలు పెంచితే తాయిలం అని ఎందుకు అనుకోవాలి? అని ఎవరైనా అనొచ్చు. మీరు ఉద్యోగి అయితే మీ జీతం పెంచమని అడగరా అని కూడా అనొచ్చు. కానీ ఇక్కడ పరిస్థితి వేరు. ఈ మేరకు వేతన సవరణ జరిగిన దాఖలాలు గతంలో లేవు. తెలంగాణ ప్రభుత్వం కనుక ఆ మేరకు పెంచకుంటే ఆంధ్రలో కూడా ఈ మేరకు పెరగదని అందరికీ తెలుసు. తెలంగాణ వేతన సవరణకు, ఆంధ్ర వేతన సవరణకు మధ్యన వున్న రోజుల గ్యాప్‌లో మీడియా కథనాలన్నీ దీని చుట్టూనే తిరిగాయి. ఎన్జీవోలు ప్రభుత్వానికి దూరమవుతారని, వేతన సవరణ తప్పదని తెలుగుదేశం నాయకులు ముఖ్యమంత్రిని ఒప్పించారని వార్తలు వచ్చాయి. 

అసలు ఈ దేశంలో తాయిలాలు ఏ రేంజ్‌లో వుందో, రాజకీయనాయకులు నడిపే ప్రభుత్వాలు ఏ ఏ రంగాల్లో వాటిని ఆఫర్ చేస్తున్నాయో పరిశీలిస్తే ఆశ్చర్యంగా వుంటుంది. పార్టీలు అధికారంలోకి రావడానికి ముందే ఇది ప్రారంభమవుతుంది. మేనిఫెస్టో పేరిట పార్టీ అధికారిక పత్రం వెలువడుతుంది. అందులో ఇన్ని పరిశ్రమలు పెడతాం.. అన్ని భవనాలు కడతాం అని వుండదు. 

కుర్రాళ్లకు ల్యాప్ టాప్‌లు ఇస్తాం.. మహిళలకు టాబ్లెట్‌లు ఇస్తాం.. వీళ్లకు ఫింఛన్లు ఇస్తాం.. వాళ్లకు భృతి ఇస్తాం.. యాభై రూపాయిలు బియ్యం అమ్ముతున్నా కూడా రెండు రూపాయిలేక అందిస్తాం అంటారు.. అసలు ప్రజలకు ఎన్ని విధాల ఇలాంటి తాయిలాలు అందిస్తారు. ప్రతి సహాయం పరోక్షంగా ఆర్థిక సహాయమే తప్ప, ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి, జనాల్ని సంపాదన దిశగా నడిపించి, స్వయం స్వావలంబన దిశగా నడిపించడానికి పనికి వచ్చే సహాయం కాదు. కేవలం వర్కింగ్ క్యాపిటల్ లాంటిది మాత్రమే. 

ఇక మేనిఫెస్టో ఆలంబనగా అధికారంలోకి వచ్చాక మళ్లీ ఇదే తంతు ప్రారంభమవుతుంది. పాలనపై ప్రజలు ఆగ్రహించకుండా వుండడానికి విడతలు విడతలుగా ఏవో ఒకటి ఇస్తుండాలి. రాష్ట్రానికి పరిశ్రమలు తేవాలి. అందుకోసం ప్రభుత్వాల దేబిరింపు మరీ ఘోరం. తమ దగ్గర పరిశ్రమ పెడితే ఇలా.. అలా అంటూ ఎన్నో ఆఫర్లు. వివిధ రాష్ర్ట ప్రభుత్వాలు పోటీ పడడం చూసి, పరిశ్రమల యజమానులు కొండెక్కి కూర్చుంటున్నాయి. 

భూమి, నీరు, ఫ్రీగా కొట్టేయడం, వివిధ రాయతీలు ఇంకా.. ఇంకా,.. ఉద్యోగాల కల్పన సాధ్యమవుతుంది, అభివృద్ధి సుసాధ్యమవుతుంది కాబట్టి ఇలా చేయక తప్పడం లేదని వాదించవచ్చు. కానీ ఈ వంకతో అటు పరిశ్రమలు, ఇటు ప్రభుత్వాలు ఒప్పందం కుదుర్చుకునే వరేక వ్యవహారం పరిమితం అవుతోంది. ఆ తరువాత దాన్ని పట్టించుకునే నాధుడు వుండడు.. నిజంగా పరిశ్రమ లేదా సంస్థ ఏర్పాటు చేసారా లేదా? ఏర్పాటు చేస్తే ఒప్పందం మేరకు స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పించారా లేదా? అన్నది పట్టించుకోరు. తిరిగి మరిన్ని భూములు అప్పనంగా అందిస్తూనే వుంటారు. కనీసం పరిశ్రమకు ఇచ్చిన రాయతీలు, దాన్ని నుంచి వచ్చిన వాగ్దానాల అమలు వంటి వాటిని జనాలకు తెలిసేలా ప్రకటించరు. 

సరే పరిశ్రమల సంగతి పక్కన పెట్టండి. ఇక పాలనలోకి వచ్చిన తరువాత కూడా వర్గాల వారీగా, మతాల వారీగా, కులాల వారీగా, ప్రాంతాల వారీగా ఏదో ఒకటి ఇచ్చుకుంటూ పోవడమే. ఉద్యోగం ఇచ్చిన తరువాత సరుకులు ఇవ్వడం దేనికి? ఆదాయంతో కొనుగోలు చేసుకోగలడు కదా అన్న ఆలోచన పొరపాటున కూడా చేయరు.

ప్రభుత్వ విద్యారంగాన్ని తీసుకోండి.. వెయ్యి గడప వున్న ఊరిలో స్కూలు వుంటుంది.. అయిదు క్లాసులకు ఇద్దరో ముగ్గురో టీచర్లు వుంటారు. కానీ ఊరిలో తొంభై శాతం మంది ప్రయివేటు కాన్వెంట్‌ల్లో చదువుతుంటారు. అయినా ఏటా డీఎస్సీ అంటూ వేలాది మందిని నియమిస్తూనే వుంటారు.. జీతభత్యాలు పెంచుతూనే వుంటారు. కోటానుకోట్లు విద్యారంగంపై ఖర్చు చేస్తుంటారు. 

కానీ అసలు ఎంత మంది చదువుతున్నారు.. సగటున ఒక విద్యార్థిపై ప్రభత్వం ఎంత ఖర్చు చేస్తోంది అన్నది లెక్కలు తీస్తే, ఏడాదికి ఒక విద్యార్థిని ప్రయివేటు కాన్వెంట్‌లో చదివించడానికి తల్లితండ్రులు పెట్టే ఖర్చు కన్నా ఎక్కువే వుంటుంది. మరి ఏమిటి ప్రయోజనం? జనాలు ఎందుకు దాన్ని అంది పుచ్చుకోవడం లేదు. అలాంటపుడు ఆ డబ్బు ఖర్చు చేసి, వారికి కావాల్సిన ప్రయివేటు విద్యనే, ఆరోగ్యశ్రీ వైద్యం మాదిరిగా అందించేస్తే పోలా? ఈ ఆలోచన రాక కాదు.. మొత్తం విద్యావ్యవస్థ సిబ్బంది.. వారి కుటుంబాలు.. వారి ఓట్ల సంఖ్య.. ఎంత ఇబ్బంది?నిజంగానే ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో వుంది. జీతాలు పెంచలేరు. కానీ ఎన్జీవోలు, వారి కుటుంబాలు.. ఓట్ల సంఖ్య.

ఇలా ప్రతి లెక్కలు ఓట్ల చుట్టూనే తిరుగుతున్నాయి. అందుకే జనం, సంస్థలు అన్నీ రాజకీయ నాయకులను ఓ ఆట ఆడుకుంటున్నాయి. వాళ్లు కూడా తమేకమి పోయింది.. మీకు కావాల్సినవి ప్రభుత్వం నుంచి ఇచ్చేస్తాం.. మాకు కావాల్సిన అధికారం అనుభవిస్తాం.. కావాలంటే అప్పులు తెస్తాం.. తీర్చాల్సింది ఎవరు?

మర్రి చెన్నారెడ్డి అప్పట్లో నాలుగు వందల కోట్ల అప్పు తెచ్చారు.. ఆ తరువాత ముఖ్యమంత్రులంతా అప్పులు తెస్తూనే వున్నారు.. కొండంతగా పేరుకుంటూనే వుంది. తీర్చాల్సిన బాధ్యత పిసరంతయినా ఏ ముఖ్యమంత్రి పైన అయినా, వారి కుటుంబ సభ్యులపైనా అయినా వుంటుందా? వారికి జవాబు దారీ లేదు కదా? అలాంటి అప్పు ఇప్పుడు పేరుకుపోయి వేలు, లక్షల కోట్లకు చేరింది. అందుకే అప్పు చేసి, పప్పు కూడా పంచిపెట్టేసి, అధికారం గడిపి, తమ ఆస్తి పెంచుకోవడం అన్నది రాజకీయ నాయకులకు అలవాటైపోయింది. జనాలు కూడా అలాగే తయారయ్యారు. వాడెంత సంపాదించుకున్నాడు అన్నది అనవసరం.. ఎంత అప్పు పెంచాడన్నది అంతకన్నా అనవసరం.. మనకు ఏమిచ్చాడన్నదే ముఖ్యం.

మోడీ పాలన ఎలా వుంది అని ఎవర్నయినా అడగండి.. బాగానే వుంది పెట్రోలు రేట్లు కాస్త తగ్గాయి అంటారు నూటికి తొంభై మంది.. అంతే కానీ, దౌత్య సంబంధాలు మెరుగుపడ్డాయనో, భారతదేశ ప్రతిష్ట పెంచే ప్రయత్నం చేస్తున్నాడనో, ఇంకోటనో, మరోటనో ఎవరూ అనరు. ఎందుకంటే జనాలకు కావాల్సింది.. నాకేంటీ? అన్నదే. అందుకే ఆప్ లాంటి పార్టీ కూడా డిల్లీ జనాలకు ఇలాంటి తక్కువ ధరలు, ఫ్రీ..లాంటి వాగ్దానాలే చేసింది. అధికారం కొట్టేసింది. అందుకే ఈ సారి బడ్జెట్‌లో కూడా మోడీ అదే బాట పడతారని ఊహాగానాలు మొదలయ్యాయి.

తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌ల్లో ఓటర్లకు ఇచ్చిన తాయిలాలు అన్నీ ఇన్నీ కావు. ఎవరి డబ్బు.. ఎంత అప్పు.. ఇదంతా ఇచ్చేవారికీ పట్టదు.. తీసుకునే వారికీ పట్టదు.. కేవలం ఓట్ల వేట..వేట..ఇదే అన్ని తాయిలాల వెనుక వున్న పరమార్థం. తాయిలం లేకుండా ఈ దేశంలో ఏ పాలనా నడవదు.. ఏ వ్యవహారం సాగదు.. ఇదో సర్కిల్ మోడీ కావచ్చు.. చంద్రబాబు కావచ్చు.. ఏ రాజకీయ నాయకులు ఈ సర్కిల్‌లో ప్రవేశించినా ఇలా గింగిరాలు కొడుతూ పాలన సాగించాలి తప్ప, ఇంకోలా వెళదాం అంటే కుదరదు. ఎందుకంటే ఈ వ్యవస్థను ఇలా తయారుచేసి పెట్టింది ఆ రాజకీయ నాయకులే.

 చాణక్య

[email protected]