ఎమ్బీయస్‌ : ఆసియాలో అమెరికా క్రీడలు

ఇతరదేశాల వ్యవహారాలలో అమెరికా తలదూరుస్తుందన్న సంగతి అందరికీ తెలుసు. తమపై గతంలో నిఘా వేసినందుకు యిప్పటి పాలకపక్షమైన బిజెపి అమెరికాను నిలదీస్తోంది. అమెరికావారు అన్ని దేశాలలో అన్ని పార్టీలపైన, ప్రముఖులందరిపైన ఎప్పుడూ ఓ కన్ను…

ఇతరదేశాల వ్యవహారాలలో అమెరికా తలదూరుస్తుందన్న సంగతి అందరికీ తెలుసు. తమపై గతంలో నిఘా వేసినందుకు యిప్పటి పాలకపక్షమైన బిజెపి అమెరికాను నిలదీస్తోంది. అమెరికావారు అన్ని దేశాలలో అన్ని పార్టీలపైన, ప్రముఖులందరిపైన ఎప్పుడూ ఓ కన్ను వేసే వుంచుతారు. ప్రస్తుతం చైనా ప్రపంచంలో ప్రబలమైన శక్తిగా ఎదుగుతోంది కాబట్టి దాని ఎదుగుదలను అరికట్టడానికి 'రీబాలన్స్‌ టు ఈస్ట్‌' (ప్రాగ్దేశాలలో సమతూకం సాధించడం) అనే సిద్ధాంతాన్ని రచించి అమలు చేస్తోంది. సర్వనాశనమైన రష్యా పుతిన్‌ నాయకత్వంలో పుంజుకుని ఆర్థిక శక్తిగా ఎదుగుతోంది కాబట్టి దాన్ని అణచడానికి సరిహద్దుల్లో వున్న దేశాలను రెచ్చగొట్టి రష్యాపై ఉసికొల్పుతోంది. ఉక్రెయిన్‌లో అది అంటించిన అగ్ని యింకా మండుతూనే వుంది. 

ఇప్పుడు చైనాపై కూడా అదే మంత్రం ప్రయోగిస్తోంది. దానికి జపాన్‌తో, రష్యాతో సరిహద్దు వివాదాలున్నాయి. ముఖ్యంగా జపాన్‌తో శతాబ్దాలుగా పేచీలున్నాయి. అందువలన యిప్పుడు ఒబామా ఏప్రిల్‌ 2014లో జపాన్‌ వెళ్లి 'వివాదాస్పదమైన సెంకాకూ దీవులు మీవే, చైనాతో ఏమైనా గొడవలొస్తే చెప్పండి, మన ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారం మీ పక్షానే నిలుస్తాం' అని చెప్పి వచ్చాడు. మే 28 న యుఎస్‌ మిలటరీ ఎకాడమీలో మాట్లాడుతూ 'చైనా, రష్యాల వలన తూర్పు ప్రాంతంలో శాంతికి విఘాతం కలుగుతోంది' అని వాపోయాడు. ఇంచుమించు అదే సమయంలో సింగపూరులో జరిగిన భద్రతా సదస్సులో అమెరికా డిఫెన్సు సెక్రటరీ చక్‌ హెగెల్‌ ఆగ్నేయాసియా దేశాల రక్షణ మంత్రులను ఉద్దేశించి మాట్లాడుతూ యిదే ముక్క చెప్పాడు. దానితో బాటు ఇక్కడ తూకం సాధించాలంటే అమెరికా వల్లనే అవుతుంది తప్ప వేరెవరి వలనా కాదని ఉద్ఘాటించాడు. దానితో బాటు ఆ ప్రాంతంలో యిప్పటిదాకా అమెరికా ఏమేం చేసిందో ఏకరవు పెట్టాడు. అవన్నీ వింటే చైనాను తమ సైన్యంతో కాని, తమ మిత్రుల సైన్యంతో కాని చుట్టుముట్టడమే లక్ష్యం అని అర్థమవుతుంది. 

చైనా-జపాన్‌ వివాదాలు శతాబ్దాల నాటివి…

ఇవన్నీ అర్థం కావాలంటే చైనా, జపాన్‌, రష్యా, అమెరికాల పరస్పర సంబంధాల గురించి ఒక శతాబ్దం వెనక్కి వెళ్లాలి. జపాన్‌కు చైనా మీద ఎప్పుడూ కన్నే! వాళ్లకు వెస్టర్నయిజేషన్‌, పారిశ్రామికీకరణ ఎక్కువ. కానీ చోటు తక్కువ. పక్కనున్న దేశాలను కబళించాలని ఎప్పుడూ ఆశే! చైనా వ్యవసాయం మీద ఆధారపడిన దేశం. జపాన్‌లాగ అక్కడా రాజరికమే. కానీ అరాచకం పాలయింది. చక్రవర్తి, జమీందార్లు కలిసి దేశాన్ని భ్రష్టు పట్టించారు. 1912లో పేదల సాయంతో   కొమింటాంగ్‌ పార్టీ నాయకుడు సన్యట్‌సెన్‌ చైనాను రిపబ్లిక్‌గా ప్రకటించి దానికి అధ్యకక్షుడయ్యాడు. చైనా యిలా అంతర్గత కలహాలతో కొట్టుకు ఛస్తూ వుంటే జపాన్‌ మధ్యలో దూరింది.  వాళ్ల చక్రవర్తిని కీలుబొమ్మ చేసి చైనాను అదుపులో తీసుకుందామని ప్రయత్నించింది. సాగలేదు. 1915 నుండి 1919దాకా జరిగిన మొదటి ప్రపంచయుద్ధంలో జర్మనీకి వ్యతిరేకంగా చైనా పాల్గొనలేదని చెప్పి యూరోపియన్‌ దేశాలను దానిమీద ఉసిగొల్పింది. తను చైనాలో కొన్ని ప్రాంతాలను ఆక్రమించింది. అంతర్గత పరిస్థితులు అధ్వాన్నపరిస్థితిలో వుంటే చైనా యుద్ధంలో ఏం చేరుతుంది? అయినా జపాన్‌ గోల భరించలేక 1917లో యుద్ధం చేరింది. కానీ యుద్ధం పూర్తయ్యాక బ్రిటన్‌ వగైరా దేశాలు జపాన్‌ ఆక్రమించిన ప్రాంతాలను జపాన్‌కి కట్టబెట్టి, చైనాకు అన్యాయం చేశాయి. 

దాంతో ప్రజలు భగ్గుమన్నారు. 1919లో ఓ విప్లవం చెలరేగింది. రష్యన్‌ విప్లవం చూసి ప్రభావితులైన యువకులు చైనా కమ్యూనిస్టు పార్టీ (సిసిపి) నెలకొల్పారు. రష్యా వాళ్లకు మద్దతు యిచ్చి సన్యట్‌సెన్‌ పార్టీకి మద్దతు యిమ్మనమంది. రష్యా మద్దతుతో, చైనీస్‌ కమ్యూనిస్టుల మద్దతుతో సన్యట్‌సెన్‌ ప్రభుత్వం దక్షిణచైనాలో అనేక ప్రాంతాలకు విస్తరించింది. కానీ ఆస్తులు పోగొట్టుకున్న జమీందార్లు విదేశీశక్తుల సహాయంతో అంతర్యుద్ధం ప్రారంభించారు. వాళ్లతో సంప్రదింపులు జరపడానికి వెళ్లి సన్యట్‌సెన్‌ మరణించాడు. ఇది 1925. ఆయన తర్వాత కొమింటాంగ్‌ పార్టీకి నాయకుడిగా వచ్చిన చాంగ్‌-కై-షేక్‌  సన్యట్‌సెన్‌ వంటివాడు కాడు. మహా కుటిలుడు.. కానీ సమర్థుడు. ఇతను కమ్యూనిస్టుల సహాయంతో జమీందార్ల్లను అణచివేశాడు. మూడేళ్లలో దేశాన్ని ఒక ప్రభుత్వ ఆధ్వర్యంలోకి తీసుకువచ్చాడు. ఇది జరిగాక విదేశీశక్తులతో చేతులు కలిపి కమ్యూనిస్టులను అణచివేయడం మొదలెట్టాడు. సన్యట్‌సెన్‌ ప్రవచించిన భూసంస్కరణల కార్యక్రమం పక్కన పడేశాడు. భూస్వామ్యవ్యవస్థను చెక్కు చెదరనీయలేదు.

ఇరుపక్షాలకూ ఆయుధాలిచ్చిన అమెరికా…

రెండవ ప్రపంచయుద్ధకాలంలో 1937లో జపాన్‌ చైనా ప్రాంతాలమీదకు దండెత్తింది. తీరప్రాంతాలు జపాన్‌ వశమయ్యాయి. గత్యంతరం లేని పరిస్థితుల్లో  చాంగ్‌ కై షేక్‌ కమ్యూనిస్టుల సహకారం అర్థించాడు. జపాన్‌ ఆక్రమించిన ప్రాంతాల్లో కమ్యూనిస్టు నాయకుడు మావో కమ్యూనిస్టు ప్రతిఘటన ఉద్యమం నిర్వహించాడు. ప్రభుత్వం చేయలేని పని మావో చేసినందుకు ప్రజలకు అతనిపై అభిమానం పెరిగింది. రెండవ ప్రపంచయుద్ధంలో జపాన్‌ పెరల్‌ హార్బర్‌పై బాంబులు వేసి తమను యుద్ధంలోకి లాగడంతో అమెరికా జపాన్‌పై కక్ష కట్టింది. జపాన్‌ను యిటునుండి ఎదుర్కోవాలంటే చైనాయే తగినదని అమెరికా కొమింటాంగ్‌కు, కమ్యూనిస్టులకు ఆయుధాలు అందించింది. కొమింటాంగ్‌ సైన్యం కంటె కమ్యూనిస్టులు చిత్తశుద్ధితో పోరాడుతున్నారని గమనించి, వాళ్లకు ఎక్కువ ఆయుధాలు యిచ్చారు. తను యుద్ధంలో దిగేటంత వరకూ రష్యా కూడా కమ్యూనిస్టులకు బోల్డు ఆయుధాలు యిచ్చింది. జపాన్‌తో పోట్లాడడం కంటె యుద్ధానంతరం తమ ప్రత్యర్థులపై ఉపయోగించడానికి పనికి వస్తాయని కమ్యూనిస్టులు వీటిలో కొన్ని అట్టేపెట్టుకున్నారు. చాంగ్‌ కై షేక్‌ కూడా డిటో డిటో. 1945లో యుద్ధం ముగియగానే వీళ్లిద్దరూ కొట్టుకున్నారు. 

అమెరికా జపాన్‌పై ఆటంబాంబు వేయడంతో జపాన్‌ ఓడిపోయింది. ఉత్తర కొరియానుండి, మంచూరియా నుండి తన సైన్యాన్ని వెనక్కి రప్పించింది. అప్పుడు రష్యా వాటిని ఆక్రమించి చైనా కమ్యూనిస్టు పార్టీ పరం చేసింది. ఇటు అమెరికా సహాయంతో కొమింటాంగ్‌ ప్రభుత్వం మధ్య చైనా, దక్షిణచైనా ప్రాంతాలను తన అధీనంలోకి తెచ్చుకుంది. చాంగ్‌కై షేక్‌ను అడ్డుపెట్టుకుని అమెరికా చైనాను తన గుప్పిట్లోకి తెచ్చుకుందామనుకుంది. ఇప్పుడు అమెరికా ప్రాధాన్యత మారిపోయింది. జపాన్‌ ఓడిపోయింది కాబట్టి యిక కమ్యూనిస్టులకు ఆయుధాలు యివ్వనక్కరలేదు. రష్యాకూడా గెలుపొందింది కాబట్టి ప్రపంచంలో కమ్యూనిజం వ్యాప్తి చెందవచ్చు. దాన్ని నివారించాలంటే చాంగ్‌ కై షేక్‌ను దువ్వాలి. కమ్యూనిస్టులను కూడా దార్లో పెట్టుకోవాలి. నిన్నటిదాకా ఆయుధాలు యిచ్చి సహాయం చేసింది కాబట్టి చైనా కమ్యూనిస్టులు కూడా అమెరికా మాటకు విలువిచ్చారు. కమ్యూనిస్టులను, కొమింటాంగ్‌ను కలిపి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పరచాలని అమెరికా ప్రభుత్వం చాలా శ్రమించింది. కానీ చాంగ్‌ కై షేక్‌ పడనివ్వలేదు. ఇటు మావో అమెరికా అడిగిన ప్రత్యేక వ్యాపార సదుపాయాలకు అంగీకరించలేదు.

చైనా కమ్యూనిస్టులను శత్రువులుగా చూసిన అమెరికా…

1946 జులై నుండి కొమింటాంగ్‌ ప్రభుత్వం కమ్యూనిస్టు స్థావరాలపై దాడి ప్రారంభించింది. అమెరికా దానికి వత్తాసు పలికింది. సోవియట్‌ రష్యా కమ్యూనిస్టులకు కొండంత అండ. యూరప్‌దేశాల తొత్తుగా మారడమే కాక, జపాన్‌ దాడిని సమర్థవంతంగా ఎదుర్కోలేకపోయిన చాంగ్‌ కై షేక్‌ను చైనా ప్రజలు అసహ్యించుకున్నారు. కమ్యూనిస్టులకు వత్తాసు పలికారు. అందువల్ల మూడేళ్ల పాటు జరిగిన అంతర్యుద్ధంలో మావో గెలుపొందారు. 1949 అక్టోబరు 1 న 'పీపుల్స్‌ చైనా రిపబ్లిక్‌' ఏర్పరచారు మావో. చాంగ్‌ కై షేక్‌ ఫార్మోజా ద్వీపానికి పారిపోయి అక్కణ్నుంచి 'తనదే అసలైన చైనా ప్రభుత్వమ'ని చెప్పుకుంటూ బతికాడు. అమెరికా దాన్నే చైనాగా గుర్తించనంత కాలం గుర్తించి, చివరికి నిక్సన్‌ కాలంలో దాన్ని పక్కకు నెట్టేసి, మావో చైనానే అసలైన చైనాగా గుర్తించింది. 

ఈలోగా రష్యాకు, చైనాకు చెడింది. స్టాలిన్‌ వున్నంతకాలం రష్యాతో సన్నిహితంగా వున్న మావో, స్టాలిన్‌ వారసుడిగా వచ్చిన కృశ్చేవ్‌ స్టాలిన్‌ కాలం నాటి కట్టుబాట్లను సడలించడం మావోకు రుచించలేదు. క్రమంగా రష్యాకు దూరంగా జరిగాడు. ఇవి చాలనట్టుగా రష్యాతో సరిహద్దు సమస్యలు తలెత్తాయి. కృశ్చేవ్‌కు, మావో ప్రపంచ కమ్యూనిజానికి ఎవరికి వారే నాయకులనుకున్నారు. నిక్సన్‌ కాలంలో రష్యాను కట్టడి చేయడానికి అమెరికా చైనాను దువ్వింది. అప్పటినుండి అమెరికా చైనాతో వ్యాపారసంబంధాలు పెంచుకుంది. చైనా పేరుకు కమ్యూనిజం వల్లిస్తూ, కాపిటలిస్టు విధానాలనే అవలంబిస్తూ, ప్రజాస్వామ్యాన్ని పట్టించుకోకుండా ఎదగసాగింది. చైనా నాయకత్వం సమర్థవంతంగా వ్యవహరించడం వలన ప్రపంచానికే మాన్యుఫాక్చరింగ్‌ సెంటర్‌గా మారింది. అది అమెరికాకు కన్నెఱ్ఱ అయింది. 

జపాన్‌-అమెరికా, కయ్యం కొంతకాలం, నెయ్యం కొంతకాలం

రెండవ ప్రపంచ యుద్ధానంతరం జపాన్‌ పూర్తిగా నాశనమై మళ్లీ కష్టపడి పైకి వచ్చింది. అప్పుడు అమెరికా వారికి చేయూత నిచ్చి వారి సామాన్లను తమ దేశంలో అమ్ముకోనిచ్చింది. పోనుపోను జపాన్‌ సరుకుల స్థానంలో చైనా సరుకులు రాసాగాయి. జపాన్‌కు చైనాపై కడుపుమంట పెరిగింది. ఈ నేపథ్యంలో అమెరికా జపాన్‌ను దువ్వి చైనాను కట్టడి చేద్దామని చూస్తోంది. చైనాకు తూర్పు ప్రాంతంలో జపాన్‌కు, చైనాకు మధ్య సెంకాకు దీవులున్నాయి. అక్కడ జనావాసం పెద్దగా ఏమీ లేదు. 1895 నుండి అవి మావే అంటోంది జపాన్‌. చైనావాళ్లు వాటిని డైవోయూ అనే పేరుతో పిలుస్తారు. 'అవి మా భూభాగానికి దగ్గరగా వున్నాయి. శతాబ్దాలుగా అవి మావే. అవి వదులుకుంటే మా జాతీయప్రతిష్ట అడుగంటినట్లే..' అంటుంది చైనా. ఏప్రిల్‌లో ఒబామా జపాన్‌ వెళ్లి స్టేటుమెంటు యివ్వడంతో చైనా విదేశీ మంత్రి ''ఒబామా చెపుతున్న ద్వైపాక్షిక ఒప్పందం అమెరికా, రష్యాల మధ్య కోల్డ్‌వార్‌ జరిగే రోజుల నాటిది. అది పెట్టుకుని చైనా సార్వభౌమత్వానికి భంగం కలిగించే ప్రయత్నం చేయకూడదు.'' అన్నాడు. దానికి జవాబుగా అన్నట్టు ఒబామా మిలటరీ ఎకాడమీ ఉపన్యాసంలో ''ఇతర దేశాల వ్యవహారాలలో జోక్యం చేసుకునే హక్కు అమెరికాకు వుంది. చైనా ఆర్థిక, సైనిక శక్తి వారి యిరుగుపొరుగుదేశాలకు భీతి కొల్పుతోంది.'' అన్నాడు.

ఇరుగుపొరుగులతో చైనా కలహాలు

చైనా తనకు దక్షిణాన వున్న సముద్రతీరంలో సరిహద్దు వివాదం వున్నచోట యీ మే నెలలో ఆయిల్‌ రిగ్‌ వేసింది. వెంటనే వియత్నాం, ఫిలిప్పీన్స్‌ అభ్యంతరం తెలిపాయి. ఒబామా అర్జంటుగా చైనా చర్యను ఖండించాడు. వియత్నాంలో ప్రదర్శనలు జరిగి చైనా కంపెనీలపై దాడి జరిగాయి. కొందరు ఉద్యోగులు మరణించారు కూడా. చైనా తన ఓడల్ని పంపి వియత్నాంలోని తన పౌరులను వెనక్కి తీసుకుని వచ్చింది. ఫిలిప్పీన్స్‌లో కూడా చైనా వ్యతిరేక ప్రదర్శనలు జరిగాయి. చైనాతో సరిహద్దు వివాదం వున్న పారాసెల్‌ దీవుల్లో చైనా రన్‌వే నిర్మించడంపై ఫిలిప్పీన్స్‌ అభ్యంతరం తెలిపింది. వియత్నాం ప్రభుత్వంతో కాంట్రాక్టు కుదుర్చుకుని మన ఒఎన్‌జిసి వివాదాస్పద సముద్రతీరంలో ఆయిల్‌ కోసం అన్వేషించడాన్ని చైనా తప్పుపట్టింది. మోదీ ప్రమాణస్వీకార సమయంలో టిబెట్‌ ప్రవాసప్రభుత్వపు ప్రధానమంత్రి మొదటివరసలో కూర్చోవడం, అరుణాచల్‌ ప్రదేశ్‌లో చైనాకు వ్యతిరేకంగా పోరాడుతున్న కిరణ్‌ రిజ్జును మోదీ హోం శాఖలో సహాయమంత్రిగా తీసుకోవడం, తమతో వివాదం వున్న ఈశాన్యప్రాంతాలకు ఇన్‌చార్జి మంత్రిగా మాజీ ఆర్మీ చీఫ్‌ వికె సింగ్‌ను నియమించడం – చైనాకు యిబ్బందిగా వున్నాయి. అంతేకాదు, మోదీ ప్రప్రథమ విదేశీ పర్యటనకు జపాన్‌ను ఎంచుకోవడం కూడా చైనాకు కష్టంగానే వుంది. 

చైనాకు ముకుతాడు వేయడానికి యిదే తరుణం అని అమెరికా భావించింది. జపాన్‌కు డ్రోన్‌లు యిస్తానని, దక్షిణ కొరియాకు ఫైటర్‌ ఎయిర్‌క్రాఫ్టులు యిస్తానని ఒప్పుకుంది. ఆస్ట్రేలియా, న్యూ జిలాండ్‌, ఇండియాలతో రక్షణ సహకారపు ఒప్పందాలను కుదుర్చుకుంది. 2020 నాటికి తన వైమానిక, నౌకా దళాలలో 60% బలాన్ని ఆసియా-పసిఫిక్‌ ప్రాంతంలో మోహరించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇవన్నీ సింగపూరు సమావేశంలో అమెరికా డిఫెన్సు సెక్రటరీ స్వయంగా వెల్లడించినవి. అమెరికాకు ఫిలిప్పీన్స్‌లోని మనీలాలో సైనిక స్థావరాలుండేవి. 1990లలో ప్రజాగ్రహాన్ని తట్టుకోలేక వాటిని ఖాళీ చేశారు. ఇప్పుడు ఫిలిప్పీన్స్‌ ప్రభుత్వం మళ్లీ వాటికి అనుమతి యిచ్చింది. చైనాపై కోపంతో జపాన్‌ ఫిలిప్పీన్స్‌కు పెట్రోలు బోట్లు యిచ్చింది. వియత్నాంకు, చైనాతో గొడవలున్న యితరులకు సైనిక సహాయం చేయడానికి సిద్ధపడుతోంది. చైనాకు ముడిసరకు దిగుమతి చేసుకునే సముద్రమార్గాలపై పట్టు సాధించి అవసరమైతే దిగ్బంధం చేయడానికి అమెరికా పథకాలు రచిస్తోంది. అమెరికా యితరదేశాలపై గూఢచర్యం సలుపుతుందని వికీలీక్స్‌ ఎప్పుడో బయటపెట్టింది. అలాటి అమెరికా చైనా పై సైబర్‌స్పైయింగ్‌ ఆరోపణలు చేసింది. కొన్ని అమెరికా కంపెనీల వెబ్‌సైట్లను హ్యేక్‌ చేసి రహస్యాలు కనుక్కుందామని ప్రయత్నిస్తున్నారంటూ అయిదుగురు చైనీస్‌ ఆర్మీ ఆఫీసర్లపై అరోపణలు చేసింది. ''వాంటెడ్‌ ఫర్‌ సైబర్‌ థెఫ్ట్‌'' అంటూ వారి ఫోటోలతో పోస్టర్లు వేసింది. అమెరికన్‌ ప్రభుత్వమే సైబర్‌ గూఢచర్యం చేస్తోందని చైనా ప్రత్యారోపణ చేసింది. 

మధ్యలో లాభపడిన రష్యా

అమెరికాకు చైనాకు యిలా సంబంధాలు చెడడంతో రష్యా ముందుకు వచ్చి చైనాతో స్నేహహస్తం చాచింది. రష్యన్‌ గాస్‌ను చైనాకు సరఫరా చేయడానికి 400 బిలియన్‌ డాలర్ల కాంట్రాక్టు కుదుర్చుకున్నాయి రెండు దేశాలు. పాశ్చాత్యదేశాలు రష్యాపై వాణిజ్యనిషేధం అమలుచేసినా యిక రష్యా భయపడనక్కరలేదు. చైనాకు గ్యాస్‌ అమ్ముకుని నిలదొక్కుకోవచ్చు. అలాగే సముద్రతీరమంతా అమెరికా గుప్పిట్లోకి వెళ్లిపోతే తమకు గ్యాస్‌ సరఫరా ఎలా? అన్న భయమూ చైనాకు అక్కరలేదు. ఉక్రెయిన్‌ అనుభవం తర్వాత రష్యా పాతకలహాలు పక్కకు పెట్టి చైనాతో వ్యాపారబంధం పెట్టుకోవడానికి కారణం యిదే. అమెరికాకు ఎలా బుద్ధి చెప్పాలా అని చూస్తున్న చైనా యీ అవకాశాన్ని అంది పుచ్చుకుంది. ఇది చూసి పాశ్చాత్యదేశాలు నివ్వెరపోయాయి. అగ్రదేశాలు ఆడే యీ క్రీడలో పసిఫిక్‌ తీరంలో యుద్ధవాతావరణం అలుముకుంటోంది. అదీ మన దురదృష్టం. 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జులై 2014)

[email protected]