కింకర్తవ్యం..?

ఎందుకని చంద్రబాబు నెలరోజుల పాలన తెలుగు ప్రజానీకాన్ని ఏమాత్రం సంతోషపెట్టలేకపోయింది..? ఎందుకని తెలంగాణ సర్కార్ కంటే ఏపీ సర్కార్ ప్రోగ్రెస్ రిపోర్టులో వెనుకబడినట్టు కనిపిస్తోంది..? ఎందుకని గులాబీ దళపతిలా  పసుపు పార్టీ నేత దూకుడు…

ఎందుకని చంద్రబాబు నెలరోజుల పాలన తెలుగు ప్రజానీకాన్ని ఏమాత్రం సంతోషపెట్టలేకపోయింది..? ఎందుకని తెలంగాణ సర్కార్ కంటే ఏపీ సర్కార్ ప్రోగ్రెస్ రిపోర్టులో వెనుకబడినట్టు కనిపిస్తోంది..? ఎందుకని గులాబీ దళపతిలా  పసుపు పార్టీ నేత దూకుడు ప్రదర్శించలేక పోతున్నారు..? ఎక్కడుంది లోపం..? విపక్షం విమర్శిస్తున్నట్టు బాబు పాలన డాబుసరితోనే సరిపెట్టుకుంటోందా.? ఈ ముప్పయిరోజుల్లో టీడీపీ ప్రభుత్వం ఒక్కటంటే ఒక్కటి కూడా జనం మన్ననలు పొందిన నిర్ణయం ఎందుకు తీసుకోలేకపోయింది..? ఢిల్లీ చేతిలో వున్న రిమోట్ కంట్రోల్ ప్రభుత్వం అంటూ గత కాంగ్రెస్ పాలకుల్ని దుయ్యబట్టిన చంద్రబాబు ఇప్పుడు పదేపదే కేంద్ర సాయం కోసం ఎందుకు అర్రులు చాస్తున్నారు..? ఒక్కనెలలో రెండుసార్లు హస్తిన వెళ్లివచ్చినా కీలక నిర్ణయాలేవీ వెలువడలేదెందుకని..? ఇంతకూ రాష్ట్ర రాజధాని ఎక్కడ పెడుతున్నారు..? విద్యార్థుల ఫీజు రీ ఎంబర్స్ మెంట్ పై టీ సర్కార్ తీసుకున్న నిర్ణయాల్ని టీడీపీ ప్రజాప్రతినిధులు ఎందుకు సవాల్ చేయలేకపోయారు.? సాగునీటి అవసరాల మాట దేవుడెరుగు కనీసం తాగునీటిని అందిద్దామన్నా అడ్డుపడ్డ కేసీ ఆర్ ప్రభుత్వంపై బాబు మంత్రివర్గంలో ఒక్కరూ నోరు మెదపరేం..? అయ్యప్ప సొసైటీ భూములపై ఇష్టానుసారం కూల్చివేతలు సాగుతున్నా తెలుగుదేశం పార్టీ వైఖరి ఏంటో బయటపెట్టడం లేదెందుకు..? ఇన్నాళ్లూ ఊరుకుని ఇప్పుడు గుర్తొచ్చినట్టు హైదరాబాద్ పోలీసింగ్ పై ఎందుకంత ఆవేశపడుతున్నారు.?

ఇన్ని ప్రశ్నలకు ఒక్కటే సమాధానం.. చంద్రబాబు అర్జెంటుగా షిఫ్టయిపోవాలి.. యస్.. సీమాంధ్ర ప్రభుత్వం హైదరాబాద్ పై వ్యామోహాన్ని అత్యవసరంగా వదులుకుని తట్టాబుట్టా సర్దుకోవాలి. ఇక ఉపేక్షించి లాభం లేదు.. వీలైనంత తొందరగా రాజధానిని వెతికిపట్టుకుని నవ నగర నిర్మాణానికి రాళ్లెత్తాలి.. నవ్యాంధ్రను మాటల్లో చూపిస్తే చాలదు, యమర్జెంటుగా నిర్మించి చూపించాలి.. దానికి ఏళ్లు పడతాయంటే కుదరదు.. చివరాఖరికి టెంటులో పెట్టినా చాలు, , మన అసెంబ్లీ సమావేశాలు మనమే పెట్టుకుందాం.. అనే మాట ప్రజాప్రతినిధుల నుంచి రావాలి.. చాలీచాలని చిన్న భవనంలో ఏసీ కూడా లేకుండా చెమట్లు కక్కుతూ చేసిన పదవీ ప్రమాణాలు గుర్తులేవా..? ఈ అవమానం చాలదా అని సీమాంధ్ర జనం కసురుకుని విసుక్కునే స్థాయికి రావద్దు..  క్యాబినెట్ మీటింగ్స్ అయినాసరే, హైదరాబాద్ లోనే జరపాలన్న రూలేం లేదు కదా..? గుంటూరు ఏసీ కళాశాలలో జరిపితే ఎవరైనా వద్దన్నారా..? భీమవరం ప్రభుత్వ అతిధి గ్రుహంలో జరిపితే కాదన్నారా..? చిత్తూరులో ఎందుకు పెట్టకూడదు..? పోనీ, కర్నూలులో ఓకేనా..? ఇలా జనం నిలదీసే పరిస్థితి తెచ్చుకోవద్దు..

పెళ్లయిన కొత్త జంట కూడా కొత్త ఇంట్లో కుదురుకుంటే తప్ప కొత్త కాపురం అనిపించుకోదు. ఉమ్మడి కుటుంబంలో వుండిపోయి వేరే గదిలో చేసే కాపురాన్ని కొత్త కాపురం అని అనరు.. ఈ విషయాన్ని చంద్రబాబు గుర్తుంచుకోవాలి.. ఇప్పటికిప్పుడు రాజధానిని వెతుక్కోవడం అంటే మాటలు కాదు, మూటలు.. ఆవిషయం అందరికీ తెలుసు. గూడు చెదిరిన పిల్లి తన పిల్లల్ని చంకనేసుకుని కొత్త గూడు వెతుక్కుంటుంది. చెట్టు మీద పక్షి కూడా అంతే.. విభజన ఓ పద్దతి ప్రకారం జరగలేదని లోక్ సభ సాక్షిగా నిజం. హైదరాబాద్ రెవిన్యూపై మాట మాత్రం చెప్పలేదు.. నీళ్ల వాటా ఏంటో తేల్చలేదు.. కరెంటు కష్టాలు వుండనే వున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు లెక్క తేల్చాల్సిన అంశాలు సవాలక్ష వున్నాయి. ఆఖరికి తెలుగు యూనివర్శిటీని తెలంగాణాలో కలిపేసుకుంటామంటూ టీ మంత్రి ప్రకటించినా ఇదేంటని అడిగే నాథుడు లేడు. 

హైదరాబాద్ గవర్నర్ కనుసన్నల్లో శాంతియుతంగా వుంటుందని కాంగ్రెస్ పాలకులు చెప్పిన కల్లబొల్లి కబుర్లు నమ్మలేదు కానీ, ఆ తరహా పోలీసింగ్ వుంటే మంచిదేగా అనుకున్నాం.. ఇప్పుడు దానిపై ఎంత రాద్ధాంతం జరుగుతోందో తెలిసిందే.. సీమాంధ్రుల పరంగా ఇవన్నీ సానుభూతి కురిపించే అంశాలే.. అలా అని అక్కడ కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసుకున్న చంద్రబాబుకు ఇవన్నీ కలిసివచ్చే అంశాలేనని చెప్పలేం.. అతిపెద్ద రాష్ట్రం నుంచి ఆదాయం వున్న భాగాన్ని లాగేసుకుని బలవంతాన వేరు చేయబడ్డ అవశేష రాష్ట్రంగా ఏపీకి ఇప్పుడు సానుభూతి వుండచ్చు.. కానీ, ఇది కాదు కావాల్సింది.. సాయం చేసే చేతులు కావాలి. నేనున్నానంటూ ఆపన్నహస్తం అందించే పెద్దమనసు కావాలి.. అన్నింటికీ మించి ఏమీ లేకపోయినా మేం ఎదగగలం.. అనే ఆత్మ విశ్వాసం మరీ ముఖ్యం. అది చంద్రబాబు దగ్గర  కనిపించాలి.. మాటలు చెబితే చాలదు, తక్షణం రాజధాని బదలాయింపు జరగాలి.. గుడారాలు వేసి పిలిచినా చాలు మేం వచ్చేస్తాం అని రాష్ట్ర ఉద్యోగులే ముందుకువచ్చారు. మరి చంద్రబాబు మీనమేషాలు లెక్కించడం ఇక సరికాదు.. కర్తవ్యాన్ని గుర్తుచేసుకుని ముందుకు కదలాలి.. జనం  అండ ఎటూ మీకు శ్రీరామరక్ష..

(దేశరాజు శ్రీనివాస్, సీనియర్ జర్నలిస్ట్)