ఈ నెలలో రాబోతున్న చిత్రాల్లో రెండిటి మీదే మార్కెట్ వర్గాలు, సినీ వర్గాలు ఆశలు పెట్టుకున్నాయి. మనం తర్వాత బాక్సాఫీస్ వద్ద నడుస్తున్న డల్ పీరియడ్‌కి ఆ రెండు సినిమాలు బ్రేకేస్తాయని ఆశిస్తున్నారు. వెంకటేష్ దృశ్యం వచ్చే వారం విడుదల కానుంది. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు సోమవారం జరుగుతాయి. దీనిని రాష్ట్ర వ్యాప్తంగా ఆరొందలకి పైగా థియేటర్లలో విడుదల చేయనున్నారు.
దీని తర్వాత ఈ నెలలోనే రాబోతున్న అల్లుడు శీను కూడా ఘనంగా విడుదల కానుంది. ఈ చిత్రంలో కొత్త కుర్రాడు హీరో అయినా కానీ వినాయక్ దర్శకుడు కావడం, సమంత ఫ్యాక్టర్ తోడవడంతో దీనిపైన అంచనాలు బాగున్నాయి. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తొలి చిత్రాన్ని భారీ స్థాయిలో విడుదల చేయడానికి బెల్లంకొండ సురేష్ సన్నాహాల్లో ఉన్నారు.
ఇవి కాకుండా ఈ నెలలో వస్తోన్న రన్ రాజా రన్‌పై కూడా సినీ వర్గాలు ఆసక్తి చూపిస్తున్నాయి. వచ్చే నెలలో ఎన్టీఆర్ రభస వస్తుంది కనుక ఈ మూడు సినిమాలు అంతవరకు బాక్సాఫీస్‌ని ఎంతవరకు బిజీగా ఉంచుతాయో చూడాలి.