ఎమ్బీయస్‌ : విస్తరణపథంలో బిజెపి

పార్లమెంటు ఎన్నికలలో బిజెపి తనంతట తానే మెజారిటీ తెచ్చుకుని 30 ఏళ్ల చరిత్రను తిరగరాసింది. ఇప్పుడు రాష్ట్రాలలో కూడా విస్తరించవచ్చని ఆశ పడుతోంది. ఈ ఆశాభావానికి ఆధారం ఏమిటంటే బిజెపి 282 పార్లమెంటు సీట్లలో…

పార్లమెంటు ఎన్నికలలో బిజెపి తనంతట తానే మెజారిటీ తెచ్చుకుని 30 ఏళ్ల చరిత్రను తిరగరాసింది. ఇప్పుడు రాష్ట్రాలలో కూడా విస్తరించవచ్చని ఆశ పడుతోంది. ఈ ఆశాభావానికి ఆధారం ఏమిటంటే బిజెపి 282 పార్లమెంటు సీట్లలో ప్రథమస్థానం తెచ్చుకోవడంతో బాటు 54 సీట్లలో ద్వితీయస్థానం పొందింది. ఇవి కర్ణాటకలో, ఒడిశాలో, కొన్ని ఈశాన్యరాష్ట్రాలలో కేరళ, తమిళనాడులో వున్నాయి. ఈ ఏడాది అయిదు రాష్ట్రాలలో పాగా వేయడానికి బిజెపి పావులు కదుపుతోంది. వీటిలో మొదటిది ఢిల్లీ. ముఖ్యమంత్రిగా అరవింద్‌ రాజీనామా చేశాక ప్రభుత్వం లేకుండా పోయింది. కాంగ్రెస్‌ మద్దతుతో మళ్లీ ప్రభుత్వం ఏర్పరుద్దామని అరవింద్‌ ప్రయత్నిస్తున్నా కాంగ్రెస్‌ కలిసి వచ్చేట్లా లేదు. గత ఏడాది 70 సీట్లలో బిజెపి 32 గెలుచుకుంది. వారిలో ముగ్గురు పార్లమెంటు సభ్యులుగా ఎన్నికయ్యారు. ఈ 29ని చేతిలో పెట్టుకుని ఫిరాయింపుదార్లతో ప్రభుత్వం ఏర్పరచే ఛాన్సు కూడా చూస్తున్నారు. అరవింద్‌ రాజకీయాలకు పనికి రాడని ఆప్‌లో చాలామంది అనుకుంటున్నారు. అలాగే కాంగ్రెసుకు భవిష్యత్తు లేదని కూడా కాంగ్రెసులో చాలామంది అనుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాలలో కాంగ్రెసు నుండి గోడదూకే వాళ్ల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. అలాగే ఢిల్లీలో కూడా జరిగితే మళ్లీ ఎన్నికలకు వెళ్లనక్కరలేకుండానే ఢిల్లీలో బిజెపి ప్రభుత్వం ఏర్పడుతుంది.

హరియాణాలో బిజెపికి యిప్పటిదాకా దక్కనంత ఘనవిజయం దక్కింది. మొన్న ఎన్నికల్లో 72 అసెంబ్లీ సెగ్మెంట్లలో 52 వాటిల్లో ప్రథమస్థానంలో వుంది. 10 పార్లమెంటు సీట్లలో 7 గెలుచుకుంది. ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలున్నాయి. కులదీప్‌ బిష్ణోయ్‌ సారథ్యంలోని హరియాణా జనహిత్‌ కాంగ్రెస్‌తో ప్రస్తుతం వున్న పొత్తు తెంపుకుని (వాళ్లకు 18 ఎసెంబ్లీ సిగ్మెంట్లలో ఆధిక్యత వచ్చింది) ఎవరైనా జాట్‌ను ముఖ్యమంత్రిగా ప్రకటిస్తే చాలు, జాట్‌ ఓట్లతో నెట్టుకు వచ్చే ఓం ప్రకాశ్‌ చౌటాలా పార్టీ సోదిలోకి లేకుండా పోతుంది అని బిజెపి స్థానిక నాయకులంటున్నారు. ఇక మహారాష్ట్ర. … లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. బిజెపి కూటమి 48 లోకసభ స్థానాల్లో 41 గెలుచుకుంది. ముండే మరణంతో బిజెపికి స్థానిక నాయకుడు లేకుండా పోయాడు. అతని స్థానంలో నితిన్‌ గడ్కరీని వెళ్లమంటే వెళ్లనంటున్నాడు. ఇది చూసి శివసేన అధిపతి ఉద్ధవ్‌ ఠాక్రే నేనే మహారాష్ట్రకు తదుపరి ముఖ్యమంత్రిని అని బిజెపితో బేరాలు పెడుతున్నాడు. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో ప్రకటించకుండా ఎన్నికలకు వెళ్లాలని బిజెపి నాయకుల ఒత్తిడి. ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వాళ్లకే ముఖ్యమంత్రి అని ఒప్పందం చేసుకోవాలట. 2009 ఎన్నికలలో బిజెపికి 54 సీట్లు రాగా, శివసేనకు 45 వచ్చాయి. ఈ సారి అదే నిష్పత్తిలో వస్తాయని బిజెపి ఆశ.

జమ్మూ కశ్మీర్‌లో 6 లోకసభ సీట్లలో 3 బిజెపికి వచ్చాయి. 32% ఓట్లు వచ్చాయి. కాంగ్రెసు, పిడిఎఫ్‌, నేషనల్‌ కాన్ఫరెన్సులకు సైతం యీ శాతం రాలేదు. ఈ లెక్క వేసుకుని కశ్మీర్‌లో యీ ఏడాది చివర్లో జరిగే ఎసెంబ్లీ ఎన్నికలలో 87 సీట్లలో 44 కంటె ఎక్కువ తెచ్చుకుని ప్రభుత్వం ఏర్పాటు చేయగలమని బిజెపి అనుకుంటోంది. అది పొరబాటు అంటున్నారు విశ్లేషకులు. మోదీని ప్రధానిగా ప్రకటించకుండా వుంటే బిజెపికి 142 సీట్లు వచ్చేవి అని వారి అంచనా. అసెంబ్లీలో మోదీ ఫ్యాక్టర్‌ వుండదు కదా! ఝార్‌ఖండ్‌లో 80 ఎసెంబ్లీ సీట్లలో కాంగ్రెస్‌తో ముఖాముఖీ తలపడడానికి ఆలోచిస్తోంది. జెఎంఎం, ఆర్‌జెడిలతో పొత్తు పెట్టుకుని వారికి కొన్ని సీట్లు యివ్వడం కంటె డైరక్టు ఫైట్‌లోనే ఎక్కువ సీట్లు వస్తాయని వారి అంచనా. 

ఏ రాష్ట్రంలో గెలిచినా మానినా బిజెపి దృష్టి యావత్తూ యుపిమీదే వుంది. ఈ పార్లమెంటు ఎన్నికలలో 403 అసెంబ్లీ సెగ్మెంట్లలో 372 వాటిల్లో గెలిచింది. ఈ ఊపు యిలా వుండగానే ఫిరాయింపు దార్లను తీసుకుని అఖిలేష్‌ ప్రభుత్వాన్ని కూల్చేయాలని స్థానిక నాయకులు తొందరపడుతున్నారు. ఎస్‌పి నుండి బయటకు వచ్చేసేందుకు 80 మంది సిద్ధంగా వున్నారట. వీరు 2017 ఎన్నికలలో తమకు టిక్కెట్లు యివ్వరని కచ్చితంగా తోచిన యాదవేతరులు, ముస్లిమేతరులు. కానీ ఎస్‌పి ప్రభుత్వాన్ని కూల్చేస్తే బియస్‌పి లాభపడుతుందన్న భయం వుంది వీరికి. ఎందుకంటే ప్రస్తుత అసెంబ్లీలో బిజెపి బలం 47 మాత్రమే. యుపికి ఇన్‌చార్జిగా వున్న అమిత్‌ షా చాలా తెలివిగా మోదీ ఒబిసి కులాన్ని ముందుకు తెచ్చి వారి ఓట్లు సంపాదించాడు. 

యుపిలో బిజెపికి దన్నుగా నిలిచిన బ్రాహ్మణ-బనియా నాయకత్వాన్ని అలాగే వుంచి వారి చేతుల మీదుగానే యాదవేతరులైన ఒబిసిలకు టిక్కెట్లు యిప్పించాడు. అగ్రవర్ణాలకు నిలయమైన బిజెపిలో తమకు టిక్కెట్లు ఎన్నటికీ దొరకవని మానసికంగా సిద్ధపడిన యీ కులాలకు అమిత్‌ షా దేవుడిలా కనబడ్డాడు. అందరూ మూకుమ్మడిగా ఓట్లేసి బిజెపిని గెలిపించారు. అందుకే 2009లో 14% ఓట్లు, 10 సీట్లు గెలిచిన బిజెపి యీసారి 43% ఓట్లు, 73 సీట్లు గెలిచింది.

ఇదే ఫార్ములాతో ఒబిసిలను ఏకీకృతం చేసి బిజెపివైపుకి తీసుకురావాలని అమిత్‌ షా ప్లాన్లు వేస్తున్నాడు. తమిళనాడు, ఒడిశా, వెస్ట్‌ బెంగాల్‌లలో పార్టీని బలోపేతం చేసే పని అతనికి అప్పగించారు. ఈ రాష్ట్రాలలో గత కొన్నేళ్లగా యీ వర్గాల సామాజిక, రాజకీయ స్థితిగతుల గురించి, వారిలో సమర్థుల గురించి సమాచార సేకరణలో పడ్డాడు. ఈ పనిలో అతనికి సహకరిస్తున్నది – ఐటీ నిపుణుడైన అతని కుమారుడు జయ్‌, అతని పర్శనల్‌ అసిస్టెంట్లు కృపాల్‌ పాండ్యా, పలక్‌ షా. ఈ పథకాలు ఏ మేరకు విజయవంతం అవుతాయో, వీటికి ప్రతిగా యితర పార్టీలు ఏయే ప్రణాళికలు రచిస్తాయో చూడాలి. 

ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జులై 2014)

mbsprasad@gmail.com