టీటీడీ ఉద్యోగుల సొంతింటి క‌ల సాకారం..

టీటీడీ ఉద్యోగుల సొంతింటి క‌ల‌ను వైసీపీ ప్ర‌భుత్వం సాకారం చేసేందుకు ముంద‌డుగు వేసింది. జ‌గ‌న్ కేబినెట్ నిన్న తీసుకున్న నిర్ణ‌యంతో సుమారు 15 వేల మంది టీటీడీ ఉద్యోగుల‌కు ఇంటి స్థ‌లాలు ద‌క్క‌నున్నాయి.   Advertisement…

టీటీడీ ఉద్యోగుల సొంతింటి క‌ల‌ను వైసీపీ ప్ర‌భుత్వం సాకారం చేసేందుకు ముంద‌డుగు వేసింది. జ‌గ‌న్ కేబినెట్ నిన్న తీసుకున్న నిర్ణ‌యంతో సుమారు 15 వేల మంది టీటీడీ ఉద్యోగుల‌కు ఇంటి స్థ‌లాలు ద‌క్క‌నున్నాయి.  

ఈ మేర‌కు న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని వ‌డ‌మాల‌పేట స‌మీపంలో సుమారు 300 ఎక‌రాల‌ను సేక‌రించింది. మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి , టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి చొర‌వ‌తో ఇంటి స్థ‌లాల పంపిణీకి మార్గం సుగుమ‌మైంది.

ముఖ్యంగా తిరుప‌తి ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి సార్వ‌త్రిక ఎన్నిక‌ల ముందు తాము అధికారంలోకి వ‌స్తే టీటీడీ ఉద్యోగుల ఇంటి స్థలాల సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు త‌న మాట‌ను నిల‌బెట్టుకున్న‌ట్టైంది.  గ‌త నెల 6వ తేదీన తిరుప‌తి ప‌ద్మావ‌తి రెస్ట్‌హౌస్‌లో టీటీడీ ఉద్యోగ సంఘ నాయ‌కుల‌తో ఇంటి స్థ‌లాల‌పై చ‌ర్చించేందుకు భూమ‌న చొర‌వ చూపారు.

ఆ త‌ర్వాత ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌ను టీటీడీ ఉద్యోగుల‌తో క‌లిసి ఈ నెల 4న విజ‌య‌వాడ‌లో క‌లిశారు. ఇంటి స్థ‌లాల విష‌య‌మై చ‌ర్చించి సానుకూల నిర్ణ‌యం తీసుకునేందుకు ఒప్పించారు. ఈ నేప‌థ్యంలో నిన్న‌టి కేబినెట్ స‌మావేశంలో టీటీడీ ఉద్యోగుల‌కు వ‌డ‌మాల‌పేట‌లో ఇచ్చేందుకు 300 ఎక‌రాలు కేటాయిస్తూ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ప్ర‌భుత్వ నిర్ణ‌యంతో టీటీడీ ఉద్యోగుల నుంచి హ‌ర్షం వ్య‌క్త‌మ‌వుతోంది.  కాగా టీటీడీ ఉద్యోగుల సొంతింటి క‌ల‌ను నెర‌వేర్చిన ఘ‌న‌త నాడు తండ్రి వైఎస్సార్‌, నేడు ఆయ‌న త‌న‌యుడైన జ‌గ‌న్‌కే ద‌క్క‌డం విశేషం.

2008లో దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్సార్ హ‌యాంలో  ఎస్వీ డెయిరీ ఫామ్‌, ఎస్వీ పూర్ హోమ్‌, బ్రాహ్మ‌ణ‌ప‌ట్టు ప్రాంతాల్లో సుమారు 1,860 మందికి ఇంటిస్థ‌లాలు కేటాయించారు. అలాగే ఎస్‌జీఎస్ ఆర్ట్స్ క‌ళాశాల వెనుక , వినాయ‌క న‌గ‌ర్ క్వార్ట‌ర్స్ స‌మీపంలోని టీటీడీ స్థ‌లాల్లో అపార్ట్‌మెంట్లు నిర్మించి 1100 మందికి ఇచ్చేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేశారు.

అయితే తిరుప‌తి ప‌రిర‌క్ష‌ణ పేరుతో కొంద‌రు కోర్టుకు వెళ్ల‌డంతో టీటీడీ ఉద్యోగులకు ఇంటి స్థ‌లాల పంపిణీ ప్ర‌క్రియ ఆగిపోయింది. అప్ప‌టి నుంచి ఇంటి స్థ‌లాల కోసం టీటీడీ ఉద్యోగులు చేయ‌ని ప్ర‌య‌త్న‌మంటూ లేదు. ప్ర‌స్తుత జ‌గ‌న్ ప్ర‌భుత్వం టీటీడీ ఉద్యోగుల ఆకాంక్ష‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని వేగంగా అడుగులు వేయ‌డంపై తిరుప‌తిలో స‌ర్వ‌త్రా పాజిటివ్ చ‌ర్చ సాగుతోంది.

ఏపీ మంత్రిమండలి కీలక నిర్ణయాలు

టీడీపీ ముచ్చట తీరింది