పంచాయతీ పోరులో ఏపీలోని 174 నియోజకవర్గాల తీర్పు ఒకలా, మిగిలిన ఒక నియోజకవర్గం తీర్పు మాత్రం ఇంకోలా ఉంది. కనీసం టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా ఆ పార్టీకి నామమాత్రపు సీట్లు దక్కలేదు.
వైసీపీకి 80శాతం పైగా స్థానాలు దక్కాయి. అలాంటిది రాజోలు నియోజవర్గంలో 60 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగితే అక్కడ కేవలం 37 చోట్ల మాత్రమే వైసీపీ బలపరచిన అభ్యర్థులు గెలిచారు. మిగతా 23చోట్ల టీడీపీ, జనసేన విజయం సాధించాయి.
టార్గెట్ రాపాక…
రాపాక వరప్రసాద్, జనసేన తరపున గాజు గ్లాసు గుర్తుపై గెలిచిన మొట్టమొదటి ఎమ్మెల్యే, ఆ పార్టీ నుంచి ఏపీ అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహించిన ఏకైక ఎమ్మెల్యే కూడా ఆయనే. స్వయానా పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ రెండుచోట్ల పోటీ చేసి ఓడిపోతే, రాపాక మాత్రం వైసీపీ, టీడీపీని తట్టుకుని నిలబడి గెలిచారు. ఆయన సొంత బలం ఎంతున్నా, జనసైనికుల కృషి కూడా ఆయన విజయంలో సింహభాగం ఉంది.
అలాంటి రాపాక.. ప్లేటు ఫిరాయించడానికి ఎంతోకాలం తీసుకోలేదు. జనసైనికులు వారిస్తున్నా, వైసీపీ స్థానిక నేతలు మాకొద్దు బాబోయ్ అంటున్నా వినకుండా జగన్ పంచన చేరారు, కొడుక్కి వైసీపీ కండువా కప్పించి తాను సానుభూతిపరుడిగా మారారు. పార్టీ మారడమే కాదు, పవన్ పై విమర్శలు కూడా సంధించేవారు, స్థానికంగా జనసేన బలంతో తానేమీ గెలవలేదని, అదంతా తన సొంత బలగమేనని చెప్పుకునేవారు.
సరిగ్గా ఇక్కడే జనసైనికులకు మండింది. అదనుకోసం ఎదురు చూసి మరీ పంచాయతీ ఎన్నికల్లో రాపాకను ముప్పుతిప్పలు పెట్టారు. అత్యథిక సర్పంచ్ స్థానాలు గెలుచుకుని జగన్ కి కానుకగా ఇద్దామని, వైసీపీలో పరపతి పెంచుకుందామని ఆశపడ్డ రాపాకకు జనసైనికులు షాకిచ్చారు. బీజేపీతో పెట్టుకుంటే లాభం లేదనుకుని, ఏకంగా టీడీపీతో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకున్నారు. 60 పంచాయతీల్లో 11చోట్ల తాము గెలిచి, మరో 12 సీట్లు టీడీపీకి దక్కేలా చేశారు. ఉమ్మడిగా జనసేన-టీడీపీ కలిసి ఇక్కడ వైసీపీని 37 సీట్లకు పరిమితం చేశాయి.
వైసీపీతో కోపంతో కాదు, కేవలం రాపాకకు బుద్ధి చెబుదామనే ఉద్దేశంతోటే ఇక్కడ టీడీపీతో జనసేన కలిసింది.
రాపాక పార్టీని వదిలి వెళ్లడం పట్ల పవన్ కల్యాణ్ పెద్దగా బాధపడకపోయినా జనసైనికులు మాత్రం బాగా ఫీలయినట్టు ఈ రిజల్ట్ తో అర్థమవుతోంది. రాపాకను పవన్ లైట్ తీసుకున్నా, జనసైనికులు మాత్రం స్ట్రాంగ్ డోస్ ఇచ్చారు. పంచాయతీ ఎన్నికల్లో తమ పంతం నెగ్గించుకున్నారు.
రెంటికీ చెడ్డ రేవడి..
వైసీపీలో రాపాక 152వ ఎమ్మెల్యే, అదే జనసేనలో ఉంటే ఆయన స్థానం నెంబర్-1. అలాగని జనసేనతోనే రాపాక ఉండాలని ఎవరూ చెప్పరు. అభివృద్ధిని కాంక్షించి పార్టీ మారానంటున్న రాపాక మాత్రం, స్థానికంగా తన ముద్ర చూపించలేకపోతున్నారనేది వాస్తవం.
అటు వైసీపీలో రాపాక ఇమడలేకపోతున్నారు. రాపాకతో స్థానిక వైసీపీ ఇన్ చార్జి ఎడమొహం పెడమొహంలా ఉన్నారు. ఇటు జనసేన పూర్తిగా రాపాకను టార్గెట్ చేసింది. ఇలా రెంటికీ చెడ్డ రేవడిలా మారిపోయారు ఎమ్మెల్యే రాపాక.