ఎమ్బీయస్‌ : శ్రీలంకలో మత్స్యపరిశ్రమ

బుధవారం నాడు నితిన్‌ గడ్కరీ రామేశ్వరం వెళ్లినపుడు శ్రీలంక కోర్టు ఉరిశిక్ష విధించిన ఐదుగురు జాలర్ల కుటుంబసభ్యులు వచ్చి కలిశారు. వారి విషయంలో ఏదో ఒకటి చేస్తామని ఆయన హామీ యిచ్చాడు కూడా. అసలు…

బుధవారం నాడు నితిన్‌ గడ్కరీ రామేశ్వరం వెళ్లినపుడు శ్రీలంక కోర్టు ఉరిశిక్ష విధించిన ఐదుగురు జాలర్ల కుటుంబసభ్యులు వచ్చి కలిశారు. వారి విషయంలో ఏదో ఒకటి చేస్తామని ఆయన హామీ యిచ్చాడు కూడా. అసలు భారత-శ్రీలంక వ్యవహారాలు అనగానే మనం వినేది – భారతీయ జాలర్లను శ్రీలంక అధికారులు పట్టుకున్నారు, దండిస్తున్నారు, దాన్ని తమిళనాడు రాజకీయ నాయకులు ఖండిస్తున్నారు అని. చేపలు పట్టుకుని కడుపు నింపుకునేవాళ్లు రెండు దేశాల మధ్య వివాదానికి కేంద్రబిందువు అవుతారని ఎవరూ వూహించరు. కానీ జరుగుతున్నది అదే. భారతదేశపు సరిహద్దుల్లో వున్న ఉత్తర శ్రీలంక జనాభాలో 20% మంది మత్స్యపరిశ్రమపై ఆధారపడుతున్నారు. వారి దగ్గర పెద్ద పెద్ద పడవలు, యితర సాధన సంపత్తి లేదు. ఇరుదేశాల మధ్య వున్న పాక్‌ జలసంధిలో తమిళనాడు జాలర్లు పెద్దపెద్ద మరపడవుల్లో వెళ్లి చేపలు వేటాడి, అక్కడి శ్రీలంక జాలర్ల అసూయను, ఆగ్రహాన్ని చవి చూస్తున్నారు.ఈ  సమస్యకు పరిష్కారం సాధించాలని ఇరుదేశాల అధినేతలు మారిటైమ్‌ ఒప్పందానికి వచ్చారు. అయితే భారతదేశపు తీరాలలో దొరికే చేపలన్నీ మనవాళ్లు వేటాడేశారు కాబట్టి తమ సరిహద్దులు దాటి శ్రీలంక జలాల్లోకి చొరబడుతున్నారు. అది లంక జాలర్లకు, ప్రభుత్వానికి కన్నెఱ్ఱగా వుంది. తమిళనాడు జాలర్లను ఖైదు చేస్తున్నారు. 

ఇలా ఎన్నోసార్లు జరిగినా 'ఎన్నో శతాబ్దాలుగా మేం చేపలు పట్టుకుంటున్నాం.ఇప్పుడు కుదరదంటే ఎలా? రూల్సూ గీల్సూ జాన్తా నై' అంటూ తమిళనాడు జాలర్లు మళ్లీ మళ్లీ నియమోల్లంఘనకు పాల్పడుతున్నారు. మన తమిళ నాయకులు ఆ విషయం ఎత్తరు. 'తమిళనాడు జాలర్లను శ్రీలంక వేధిస్తోంది, దానికి బుద్ధి చెప్పాలి' అనే గొడవ చేస్తారు. ఒప్పందాలు మీరి, మా యింట్లో చొరబడితే మేమెందుకు ఊరుకోవాలి అని శ్రీలంక పోలీసులు అడుగుతారు. భారత జాలర్లు తమ ప్రాంతాల్లో కనబడగానే కాలుస్తున్నారు. ఐక్యరాజ్యసమితి ఒప్పందాల ప్రకారం పొరుగు ప్రాంతాల్లో వేటాడే జాలర్లను అరెస్టు చేయవచ్చు తప్ప కాల్చడానికి వీలు లేదు. అందువలన శ్రీలంక పోలీసులు 'వీళ్లు వీళ్లు చేపల మిషతో మాదకద్రవ్యాలు సరఫరా చేస్తున్నారు. అందుకే కాలుస్తున్నాం' అని వాదిస్తున్నారు. తమిళనాడు గగ్గోలు పెడుతోంది – అదంతా బూటకపు ఆరోపణ అంటూ. గతంలో తమిళనాడు జాలర్లు ఎల్‌టిటిఇ తరఫున మాదకద్రవ్యాలు, ఆయుధాలు సప్లయి చేసిన మాట వాస్తవం. ఎల్‌టిటిఇ నాయకులను కూడా శ్రీలంక-భారత్‌ మధ్య తిప్పినవాళ్లు వీళ్లే. ప్రస్తుతం మాదకద్రవ్యాల అభియోగంతో ఉరిశిక్ష పడిన ఐదుగురు జాలర్లు అమాయకులో కాదో మనకు తెలియదు కానీ, చేపల దొంగతనాన్ని శ్రీలంక యింత తీవ్రంగా ఎందుకు తీసుకుంటోందో మాత్రం అర్థం చేసుకోవచ్చు – శ్రీలంక ఆర్థికవ్యవస్థ చేపలపై ఆధారపడి వుందని తెలుసుకుంటే!

శ్రీలంక జనాభా రెండు కోట్లు. దానిలో 12% మంది అనగా 24 లక్షల మంది మత్స్యపరిశ్రమపై ఆధారపడి బతుకుతున్నారు. సగటున శ్రీలంక పౌరుడు ఏడాదికి 24 కిలోల చేపలు తింటాడు. ఉత్తర శ్రీలంక జాలర్లది ఒకరకమైన సమస్య అయితే, దక్షిణ శ్రీలంక జాలర్లది మరో రకమైన సమస్య. ఎల్‌టిటిఇ ఉద్యమం కారణంగా ఉత్తరభాగంలో శాంతి నశించింది. తమిళ పులులకు సహాయపడుతున్నారనే అనుమానంతో శ్రీలంక పోలీసులు వారి కదలికలపై నిషేధం విధించడంతో జీవనోపాధి దెబ్బ తింది. మరో పక్క తమిళ పులులు వారిని బెదరించేవారు. ఎల్‌టిటిఇ ప్రాబల్యం క్షీణించి, సాధారణ పరిస్థితులు వచ్చాక ఆర్థికవ్యవస్థ కుదుటపడసాగింది. వాళ్లు వెంటనే ఖరీదైన వలలు కొని చేపల వేటకు ఉద్యమించారు. కానీ భారతీయుల మరపడవల కారణంగా ఆ వలలు చిరిగిపోసాగాయి. శ్రీలంక జాలర్ల ఆదాయం దెబ్బ తింది, అప్పులు పెరిగాయి. తమిళనాడు జాలర్లు వాళ్ల జలాల్లో వేటకు వచ్చినపుడు వాళ్లు యింట్లో కూర్చోవడమో, లేక తీరం దగ్గరే చేపలు పట్టడమో చేస్తున్నారు. వాళ్లు 40 వేల మెట్రిక్‌ టన్నుల చేపలు పడుతుంటే తమిళనాడు జాలర్లు వారి కంటె రెట్టింపు, కరక్టుగా చెప్పాలంటే 85 వేల టన్నులు పట్టుకుంటున్నారు. 

ఇక దక్షిణ శ్రీలంక జాలర్ల విషయానికి వస్తే వాళ్లు తీరానికి దూరంగా సాగే డీప్‌-సీ ఫిషింగ్‌లో ప్రవీణులు. 10-16 మీటర్ల పొడవున్న నౌకల్లో నీళ్లు, ఐసు, తిండి పదార్థాలు వేసుకుని నెలల తరబడి వేల కొద్దీ కి.మీ.ల సముద్రయానం చేస్తూ హిందూ మహాసముద్రమధ్యంలో వున్న ట్యూనా, షార్క్‌ చేపలను వేటాడే వారి పద్ధతి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి కెక్కింది. యూరోపియన్‌ యూనియన్‌ (ఇయు) వారు శ్రీలంక నుండి చేపల దిగుమతిని 2015 జనవరి 15 నుండి నిషేధిస్తున్నాం అని యీ అక్టోబరు 14న ప్రకటించడంతో వీళ్ల నోట్లో కరక్కాయ పడింది. ఎందుకంటే శ్రీలంక చేపల ఎగుమతి వ్యాపారంలో 70% వాటా యూరోప్‌దే! ఈ నిషేధాన్ని వ్యతిరేకిస్తూ దక్షిణ శ్రీలంక మత్స్యకారులు అక్టోబరు 20 న కొలంబోలోని ఫిషరీస్‌ మంత్రిత్వశాఖ ఎదురుగా నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. దీనితో బాటు యింకో డిమాండ్‌ కూడా జోడించారు – శ్రీలంక ప్రభుత్వం తూర్పు ఏసియన్‌ మల్టీ నేషనల్‌ ఫిషింగ్‌ కంపెనీలతో కలిసి చేపడుతున్న జాయింట్‌ వెంచర్లు యిక చాలించాలని. అంతర్యుద్ధానంతరం ఆర్థికవ్యవస్థ పుంజుకునే లక్ష్యంతో యీ కంపెనీలకున్న పెద్ద పెద్ద నౌకలకు లైసెన్సు యిచ్చి శ్రీలంక ప్రభుత్వం చిక్కుల్లో పడింది. ఈ నౌకలు శ్రీలంక పతాకం పెట్టుకుని హిందూ మహాసముద్రంలో ఎక్కడికి పడితే అక్కడికి వెళ్లి చేపలు పడుతున్నాయి. ఇది ఇయుకు కంటగింపైంది. డీగో గార్షియాలో యివి చేపలు పడుతున్నాయని, వీటి అక్రమ కార్యకలాపాలను అరికట్టడంలో శ్రీలంక ప్రభుత్వం విఫలమైంది కాబట్టి వారి దిగుమతులను నిషేధిస్తున్నామని ఇయు ప్రకటించింది. డీగో గార్షియా గొడవేమిటో తెలుసుకోవాలంటే కాస్త వెనక్కి వెళ్లాలి.

డీగో గార్షియా హిందూ మహా సముద్రంలో మారిషస్‌కు సమీపంలో వున్న6.39 చ.కి.మీల విస్తీర్ణం వున్న నిర్జన ద్వీపసముదాయం. దీన్ని పోర్చుగీస్‌ నావికులు కనుగొన్నారు. ఆ తర్వాత ఫ్రెంచ్‌వారికి వెళ్లి, చివరకు బ్రిటన్‌ చేతిలోకి వెళ్లి వలసరాజ్యాలు స్థాపించే రోజుల్లోనే  దీన్ని కూడా ఆక్రమించింది. హిందూ మహాసముద్రంలో వారి నౌకలు గస్తీ తిరగడానికి సముద్రమధ్యంలో మిలటరీ బేస్‌గా యిది వుపయోగపడేది. రెండవ ప్రపంచయుద్ధం తర్వాత వారి ప్రభ తగ్గింది. వారి స్థానంలో అమెరికా దూరింది. 
మారిషస్‌ అభ్యంతరం తెలుపుతున్నా వినకుండా బ్రిటన్‌ అక్కడున్న 2 వేల మందిని తరిమివేసి 1966లో అమెరికాకు 50 ఏళ్లకై లీజుకి యిచ్చేసింది. భారత్‌తో సహా, ఆగ్నేయ ఆసియాలోని అన్ని దేశాలపై నిఘా వేయడానికి అమెరికా డీగో గార్షియాను మిలటరీ బేస్‌గా వాడుకుంటోంది. భారత్‌ దీనికి అభ్యంతరం తెలిపినా ఖాతరు చేయడం లేదు. 1982లో ఐక్యరాజ్యసమితి వారు సముద్రజలాల వాడకం గురించి 'యుఎస్‌ కన్వెన్షన్‌ ఆన్‌ ద లా ఆఫ్‌ సీ (యుఎన్‌సిఎల్‌ఓఎస్‌)' పేర ఒక అంతర్జాతీయ ఒప్పందాన్ని తయారుచేశారు. ఏ దేశతీరం నుంచైనా 360 కి.మీ. (200 నాటికల్‌ మైళ్లు) వరకు వున్న సముద్రప్రాంతాన్ని ఎక్స్‌క్లూజివ్‌ (ప్రత్యేక)ఎకనమిక్‌ జోన్‌ (ఇఇజెడ్‌)గా పరిగణిస్తారు. ఆ ప్రాంతంలో దొరికే సహజవనరులన్నీ వాళ్లు అనుభవించవచ్చు. ఇలా హక్కులు కట్టబెట్టేటప్పుడు వలసరాజ్యాలపై హక్కులను ఆయా సామ్రాజ్యవాద దేశాలకు కట్టబెట్టారు. భారత్‌కు, శ్రీలంక, మారిషస్‌లకు దగ్గరలో వున్నా డీగో గార్షియా బ్రిటన్‌ అధీనంలో వుండేది కాబట్టి దాని ఇఇజెడ్‌పై హక్కులు బ్రిటన్‌కు చెందుతాయన్నారు. ఇయు ఏర్పడిన తర్వాత బ్రిటన్‌లో దానిలో భాగమైంది కాబట్టి బ్రిటన్‌ హక్కుల పరిరక్షణ బాధ్యత ఇయు తీసుకుంది. డీగో గార్షియా వద్ద చేపలు పడుతూ పట్టుబడిన భారత, శ్రీలంక జాలర్లను ఇయు శిక్షిస్తోంది. 

ఇప్పుడు శ్రీలంక జాతీయపతాకంతో చేపలు పడుతున్న తూర్పు ఏసియా కంపెనీల నౌకలు డీగో గార్షియా ఇఇజెడ్‌ మత్స్యసంపదను అక్రమంగా కొల్లగొడుతున్నాయని ఇయు ఆరోపిస్తోంది. నిజానికి ఎవరు ఎక్కువ కొల్లగొడుతున్నారు? ద ఇండియన్‌ ఓషన్‌ ట్యూనా కమిషన్‌ డేటాబేస్‌ ప్రకారం 2013లో శ్రీలంక వారి 2230 బోట్లు ట్యూనా చేపల్లో 10%ను పట్టుకుంటే ఇయుకు చెందిన 81 నౌకలు 16% పట్టుకున్నాయి. ఇది ఎలా సాధ్యపడిందంటే ఇయు నౌకలు శ్రీలంక నౌకల కంటె 50 రెట్లు పెద్దవి. అంకెల్లో చూస్తే తూర్పు ఏసియా నౌకలు పట్టుకున్నది 12 వేల మెట్రిక్‌ టన్నులైతే, దక్షిణ శ్రీలంక జాలర్లు పట్టుకున్నది 112 వేల మెట్రిక్‌ టన్నులైతే ఇయు పట్టుకున్నది 165 వేల మెట్రిక్‌ టన్నులు. డీగో గార్షియా వంటి చిన్న వలసరాజ్యం పేరు చెప్పి అందరి కంటె ఎక్కువగా దోచుకుంటున్న ఇయు తూర్పు ఏసియా నౌకల మిష పెట్టి దక్షిణ శ్రీలంక మత్స్యవ్యాపారాన్ని దెబ్బ కొట్టాలని చూస్తోంది. ఈ పరిస్థితుల్లో కనీసం ఉత్తరశ్రీలంకలోని మత్స్యవ్యాపారాన్నైనా కాపాడుకోవాలని శ్రీలంక చూడడంలో ఆశ్చర్యం లేదు. తమిళనాడు జాలర్ల ఆగడాలకు అడ్డుకట్ట వేయకపోతే అది సాధ్యపడదు. అందుకే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తోంది. శ్రీలంకను తప్పుపట్టే ముందు తమిళనాడు ప్రభుత్వం తమ జాలర్లు పొరుగువారి జలాల్లో అక్రమంగా చొరబడకుండా కట్టడి చేయాలి కదా!

 – ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (నవంబరు 2014)

[email protected]