ఎమ్బీయస్‌ : యమ్‌డన్‌ – 02

శత్రునౌకలను ముంచేసినా, సిబ్బందిని మాత్రం గౌరవంగా చూసేవాడు. వాళ్ల ప్రాణాలను కాపాడి సురక్షితప్రాంతాలకు పంపేసేవాడు. ఇది ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. హాంగ్‌ కాంగ్‌ పత్రికొకటి యితని పెద్దమనిషి తరహాను, షివల్రీను (బలహీనుల పట్ల, శత్రువుల…

శత్రునౌకలను ముంచేసినా, సిబ్బందిని మాత్రం గౌరవంగా చూసేవాడు. వాళ్ల ప్రాణాలను కాపాడి సురక్షితప్రాంతాలకు పంపేసేవాడు. ఇది ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. హాంగ్‌ కాంగ్‌ పత్రికొకటి యితని పెద్దమనిషి తరహాను, షివల్రీను (బలహీనుల పట్ల, శత్రువుల పట్ల చూపే ఔదార్యం) మెచ్చుకుంటూ వ్యాసం రాసింది.  1914 సెప్టెంబరు మధ్య నాటికి, రెండువారాల వ్యవధిలో ఎమ్‌డెన్‌ తమ 11 నౌకలను ముంచేయడంతో ఇండియా సింగపూర్‌ల మధ్య తిరిగే తమ నౌకలను బ్రిటిష్‌, ఫ్రెంచ్‌ వాళ్లు నిలిపివేశారు. ఇక చేయడానికి ఏమీ లేక కాబోలు, మన ముల్లర్‌ ఏకంగా మద్రాసుపైనే దాడి చేశాడు. రాత్రి ఎవరి కంటా పడకుండా  ఇండియాకు చేరి  సెప్టెంబరు 22న 4 అంగుళాల ఫిరంగులు పది ఉపయోగించి సముద్రతీరంలో వున్న బర్మా షెల్‌ అనే బ్రిటిషు పెట్రోలు కంపెనీవారి ట్యాంకులకు నిప్పు పెట్టాడు. ఆ తర్వాత మద్రాసు హార్బరు వైపు వెళ్లి అరగంటపాటు ఫిరంగి గుళ్లు కురిపించాడు. 'రవి అస్తమించని రాజ్యం అని ఇంగ్లీషు వాళ్లు చెప్పుకుంటున్నా వాళ్లు మీరనుకున్నంత గొప్పవాళ్లేమీ కాదు సుమా, మా చేతిలో చిత్తవుతున్నారు చూడండి' అని భారతీయులకు సందేశం యిచ్చి వాళ్లలో ధైర్యం నింపాలనే ఐడియాతోనే మద్రాసుపై దాడి జరిగింది కానీ భారతీయుల పట్ల ద్వేషంతో కాదు. ఇంత పెద్ద దాడి జరిగినా చనిపోయినది అయిదుగురే! 26 మంది గాయపడ్డారు. జనావాసాలకు దూరంగా కాల్పులు జరపడం చేతనే ప్రాణనష్టం యింత తక్కువగా వుంది. ప్రజలను భీతావహులను చేయడమనే లక్ష్యం నెరవేరింది. జనాలు కకావికలై పరుగులు పెట్టారు,  మద్రాసు వదలి పారిపోయారు. కొందరు యిదే అదనని అల్లర్లు చేశారు, యిళ్లు, దుకాణాలు దోచారు. ఎమ్‌డెన్‌ చూపిన శక్తిపాటవాలను కీర్తిస్తూ తమిళంలో పాటలు వచ్చాయి కూడా.

ఇంత ఖ్యాతి సంపాదించిన ఎమ్‌డెన్‌ గురించి కథలు, కట్టుకథలు పుట్టడంలో ఆశ్చర్యం లేదు. ఒక కథ ప్రకారం – ఆ రోజుల్లో మద్రాసులో ఒకే ఒక జర్మన్‌ కుటుంబం నివసించేది. యుద్ధం ప్రారంభం కాగానే వారిపై పోలీసులు నిఘా పెట్టారు. వాళ్లు భయంతో బతుకుతూ వుండేవారు. ముల్లర్‌ దాడికి ముందు  రోజు మద్రాసు ఉత్తరప్రాంతంలో లంగరు దించి, సరుకులు కొనుక్కుని నౌకలో నింపుకుంటూ వుంటే అతనికి ఎవరో చెప్పారు – వూళ్లో మీ దేశస్తుడే ఒకడున్నాడు అని. అయితే సాటి జర్మన్‌ను కలవాల్సిందే అనుకుని ముల్లర్‌ మద్రాసు దిగగానే ఓ అద్దెం గుఱ్ఱంపై అతన్ని చూడబోయాడు. తనెవరో ఎవరికీ తెలియదు కాబట్టి హాయిగా  గుఱ్ఱం తోలుకుంటూ వూరి మధ్యకి వెళ్లిపోయాడు. ఆ జర్మన్‌, ఆయన పేరు డా|| స్కోమ్‌బర్గ్‌, మౌంట్‌ రోడ్‌లోని పెల్లెటీస్‌ రెస్టారెంట్‌లో భోజనం చేస్తున్నాడు. ఇతను వెళ్లి నేను ఫలానా అని చెప్పగానే అతనికి ముద్ద మింగుడు పడలేదు. ''ఇప్పటికే మా మీద అనుమానం వుంది. ఇప్పుడు నువ్వు నన్ను చూడవచ్చావంటే నా బతుకు జైలుపాలే. జర్మన్‌ అభిమానాన్ని అటకెక్కించి అర్జంటుగా యిక్కణ్నుంచి వెళ్లిపో'' అని బతిమాలాడు. ఇలాటిదే మరో కథ వుంది – ఎమ్‌డెన్‌ నౌకపై చంపక్‌రామన్‌ పిళ్లయ్‌ అనే భారతీయ వైద్యుడు వుండేవాడని!

మద్రాసు విజయం తర్వాత రెట్టించిన ఉత్సాహంతో ముల్లర్‌ శ్రీలంక నుంచి డీగో గార్షియా వరకు చెలరేగిపోయాడు. ఇంకో 16 నౌకలపై దాడి చేసి ముంచేశాడు. ధైర్యం యింకా పెరిగి, ఓ రోజు పట్టపగలు బ్రిటిషు వారి పెనాంగ్‌ హార్బరులో మెరుపులా మెరిసి, రెండు యుద్ధనౌకలను ముంచేసి, అంతలోనే తుర్రుమన్నాడు. ఇంగ్లండుకు పిచ్చెక్కిపోయింది. మూణ్నెళ్లగా తమనందరినీ వేధిస్తున్న ఎమ్‌డెన్‌ను పట్టుకుని ముంచేయడమే తక్షణ కర్తవ్యంగా పెట్టుకున్నారు. బ్రిటన్‌, ఆస్ట్రేలియా, జపాన్‌లకు చెందిన 72 యుద్ధనౌకలు ఎమ్‌డెన్‌ను వెతకసాగాయి. ఇది విని ముల్లర్‌ భయపడలేదు. ఆస్ట్రేలియాకు దగ్గర్లో వున్న కోకోస్‌ దీవుల్లో మిత్రరాజ్యాలు నెలకొల్పిన వైర్‌లెస్‌ స్టేషన్‌ను ధ్వంసం చేసి, కమ్యూనికేషన్‌ తెగ్గొట్టేయడం తర్వాతి లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఆస్ట్రేలియాకు వెళుతూండగా మధ్యదారిలో ఆస్ట్రేలియన్‌ నౌక ఎచ్‌ఎమ్‌ఎఎస్‌ సిడ్నీ కంటపడ్డాడు. అది చాలా పెద్దది. ఇద్దరి మధ్య 90 ని||లపాటు యుద్ధం జరిగింది. ఎమ్‌డెన్‌పై నూరు తుపాకీగుళ్లు పడడంతో  అది భగ్నమైంది. కెప్టెన్‌ ముల్లర్‌, 100 కి పైగా వున్న అతని సిబ్బంది లొంగిపోయారు. వీళ్లను ఖైదీలుగా పట్టుకుని, ఓడను ముంచేశారు.

ఎమ్‌డెన్‌ కథ యింతటితో ముగియలేదు. జైల్లో పెట్టిన సిబ్బందిలో 50 మంది వైస్‌ కెప్టెన్‌గా పని చేసిన లెఫ్టినెంట్‌ హెల్‌మత్‌ వాన్‌ మ్యూక్‌ సారథ్యంలో తప్పించుకున్నారు. ఓ పాత బోటును హైజాక్‌ చేసి సుమత్రాకు వెళ్లారు. అక్కడకి వెళ్లాక తెలిసింది – టర్కీ దేశం అప్పుడే జర్మనీ పక్షాన యుద్ధంలో చేరిందని. యెమెన్‌ వెళితే మంచిదనుకుని ఓ ఓడ పట్టుకున్నారు. యెమెన్‌లో దిగి ఒంటెలెక్కి అరేబియా ఎడార్లు దాటి కొన్ని రోజులయ్యాక ఇస్తాంబుల్‌కు చేరారు. మధ్యలో చాలా ఆపదలు వచ్చిపడ్డాయి. బీడోయిన్‌ తెగవారు వీరిని అడ్డగిస్తే మూడురోజుల పాటు యుద్ధం చేసి గెలవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఓ అరబ్‌ షేక్‌ వీళ్లకు ఆతిథ్యం యిచ్చినట్లే యిచ్చి బ్రిటిషు వారికి అప్పగించబోయాడు. ఇస్తాంబుల్‌లో, తర్వాత బెర్లిన్‌లో వీరికి ఘనసత్కారం లభించింది. బెర్లిన్‌లో కైజర్‌ స్వయంగా వచ్చి వీరిని రిసీవ్‌ చేసుకున్నాడు.  సాహసవంతులకు యిచ్చే ఐరన్‌ క్రాస్‌ సిబ్బందిలో ప్రతి వ్యక్తికి యిచ్చారు. తమ పేరుకి చివర ఎమ్‌డెన్‌ అని చేర్చుకునేందుకు అనుమతి యిచ్చారు. అంతేకాదు, ఎమ్‌డెన్‌ నౌక పేర ప్రత్యేకమైన ఐరన్‌ క్రాస్‌ యిచ్చారు. ప్రపంచ నౌకా చరిత్రలో యిది అరుదైన విషయం. 

ఇక ముల్లర్‌ గురించి చెప్పాలంటే – 1916 అక్టోబరులో తక్కిన ఖైదీల నుండి విడదీసి ముల్లర్‌ను ఇంగ్లండ్‌ పంపి మిడ్‌ల్యాండ్స్‌లో యుద్ధఖైదీల క్యాంపులో వుంచారు. 1917లో 21 మంది ఖైదీలతో కలిసి అతను పారిపోయాడు కానీ పట్టుబడిపోయాడు. ఇంగ్లండు వాతావరణం అతనికి పడలేదు. మలేరియా పట్టుకుంది.  ఇంగ్లండు మానవతా దృక్పథంతో అతన్ని నెదర్లాండ్స్‌కు పంపి చికిత్స చేయించింది. యుద్ధానంతరం జర్మనీకి పంపారు. 1919లో అనారోగ్య కారణాలతో అతను నేవీ నుండి రిటైరయ్యాడు. బ్రూన్స్‌విక్‌ నుండి జర్మన్‌ నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ తరఫున పార్లమెంటుకి ఎన్నికయ్యాడు. మలేరియా వలన బలహీనపడి 49 వ యేటనే మరణించాడు. అతని యుద్ధవిజయాల గురించి ఆత్మకథ రాయమని ఎందరు అడిగినా అతను ఒప్పుకోలేదు. ఎమ్‌డెన్‌ వీరులపై 2012లో వచ్చిన జర్మన్‌ సినిమా  పోస్టరు పక్కన యిస్తున్నాను. మన తెలుగులో వాడే యమ్‌డన్‌ పదానికి వెనుక యింత కథ వుంది. ఇది విన్నవారికి, కన్నవారికి, చెప్పినవారికి, చదివినవారికి, ప్రచారం చేసినవారికి భగవంతుడు మాతృభాషపై ఆసక్తిని, అనురక్తిని మరింత పెంచుగావుత! (సమాప్తం)

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (నవంబరు 2014)

Click Here For Part-1