ఒకప్పుడు అంతా తెలుగు జాతే.. కానీ ఇప్పుడు పరిస్థితులు వేరు పడ్డాయి. ‘నీది తెలంగాణనా.? ఆంధ్రప్రదేశా.?’ అని ప్రశ్నించుకునే రోజులొచ్చేశాయ్. ఏం చేస్తాం.. రాజకీయాలు అలా తగలడ్డాయ్ మరి. లేకపోతే ‘మా తెలుగు బిడ్డ..’ అని సగటు తెలుగు ప్రజానీకం చెప్పుకున్న సానియా మీర్జాని తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌ని చేసేసి ‘మా తెలంగాణ బిడ్డ’ అనేస్తోంది తెలంగాణ సర్కార్.
అందుకే, ఇప్పుడు అంబటి రాయుడు ‘ఆంధ్రా ముద్దుబిడ్డ’ అయ్యాడు. ఆంధ్రా బిడ్డడో.. తెలుగు జాతి ముద్దుబిడ్డో.. ఎవరైతేనేం.. తెలుగు జాతి కీర్తిని రెపరెపలాడిరచాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో సత్తా చాటుతున్న అంబటి రాయుడు, హైద్రాబాద్‌లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ సందర్భంగా హల్‌చల్ చేశాడు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ మ్యాచ్‌ని తిలకించారు. ఈ సందర్భంగా ఆటగాళ్ళతో కరచాలనం చేసిన కేసీఆర్, అంబటి రాయుడిని మాత్రం ప్రత్యేకంగా ముద్దాడారు. అంతే అంతా షాక్ తిన్నారు.
ఒకప్పుడు అంబటి రాయుడు హైద్రాబాద్ జట్టు తరఫున రంజీల్లో ఆడాడు.. సత్తా చాటాడు కూడా. ఆ తర్వాత హెచ్‌సీఏతో విభేదాల కారణంగా, ఆంధ్రా జట్టుకి ఆడాడు కొన్నాళ్ళు. కారణాలేవైనా, అంబటి రాయుడికి తగిన గుర్తింపు అయితే దక్కలేదు. దానిక్కారణం హైద్రాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అన్న ఆరోపణలు అనేకం.
గతం గతః ఇప్పుడు అంబటి రాయుడు స్టార్ క్రికెటర్. ఇంకో రెండు మూడు సెంచరీలు కొడితే, టీమిండియాలో అత్యంత ‘విలువైన’ ఆటగాడవుతాడు అంబటి తిరుపతి రాయుడు. అన్నట్టు, అంబటి రాయుడిని ముద్దాడిన కేసీఆర్, సానియా మీర్జాకి ప్రకటించినట్లుగా అంబటి రాయుడికి కూడా నజరానా ప్రకటిస్తారంటారా.? లేదంటే, ఆంధ్రాలో పుట్టినోళ్ళంతా.. అని లైట్ తీసుకుంటారా.? వేచి చూడాల్సిందే.