జీవితం ఒక ప్రవాహం, వెనక్కి వెళ్లదు. అడ్డుకట్ట వేస్తే మురికివాసన. సిగరెట్ ముందు వెలిగి ఆరిపోయే అగ్గిపుల్లకి తన శక్తి తెలియదు. మన ఫాలోయర్స్, అంతా మనవాళ్లు కాదు. జింక అడుగుజాడల్ని వేటగాడు గమనిస్తుంటాడు.
వయసులో వున్నపుడు సింహానికి తెలియదు, ఈ గోళ్లు, కోరలు శాశ్వతం కాదని. వృద్ధుల ముఖాల్లోని ముడతలు గమనించు, అవే నీ భవిష్య రేఖలు.
తెలివి ఎక్కువైతే నీ కోసం విషపాత్రని సిద్ధం చేస్తారు. జనం, గొర్రెలు వాళ్లకి ఏదీ ఎక్కదు. గొంతు కోస్తున్నపుడు కూడా మెడని నిమురుతున్నారని భ్రమిస్తారు.
ఒక విజయం వెనుక అనేక ఓటములు, ఒక సంతోషం వెనుక అనేక కన్నీటి వూటలు. ఒకప్పుడు మనిషి అనుభవాల నుయ్యి. జ్ఞాపకాలని చేదుకునేవాడు. కొత్త తరానికి అనుభవాలు, జ్ఞాపకాలూ రెండూ లేవు. అన్నీ గూగుల్, కృత్రిమ మేథ.
సూర్యచంద్రులు అందరికీ ఒకటే. కొనే అవకాశముంటే కాంతిని, వెన్నెలని కూడా పేదవాడికి దక్కకుండా చేసేవాళ్లు.
చీకటిలోనే తోడేలు నిశితంగా చూస్తుంది. అందరి కళ్లు ఒకటి కాదు. మోసం చేసేవాళ్లనే దేవతలంటారు. సమాన హక్కు అడిగిన వాళ్లు రాక్షసులు. మధనం చేసింది ఇద్దరైతే అమృతం ఒకరికే ఎందుకు దక్కింది. మాయా మోహమే కదా ప్రపంచం.
భూమి లేదా బూడిద ఈ రెండూ నిన్ను వెతుకుతూ వుంటాయి. నువ్వేదో వెతుకుతూ వుంటావు. దొరకదు అని తెలిసినా ఆశ చావదు.
చదరంగంలో గుర్రంలాంటిది మనసు. ఎటు గెంతుతుందో దానికే తెలియదు. మహారాజు కోసం ప్రాణాలివ్వడం గుర్రానికి కొత్తకాదు. పుట్టుక నుంచే మోయడం, మరణించడం ఈ రెండే తెలుసు.
మధుశాలలో వేరే గుర్రముంటుంది. ఎక్కితే మనిషి కోతిగా మారుతాడు. ఒక గ్లాస్‌తో పరిణామ సిద్ధాంతాన్ని కనుక్కోవచ్చు. డార్విన్ అనవసరంగా కష్టపడ్డాడు.
సముద్రంలో ముత్యం వుంటుందని అందరికీ తెలుసు. సాహసానికే దక్కుతుంది. షార్క్ చేపకి ఎదురెళ్లినవాడే, ముత్యం చిప్ప యజమాని.
అసత్యమే రాజకీయం. కానీ పదవిలోకి వచ్చే ముందు ప్రతివాళ్లు ప్రమాణం చేస్తారు. ఇరువైపుల సాక్షులకి భగవద్గీత ఒకటే. నీ గుర్తింపే నీ బలిపీఠం. కసాయి దగ్గరికి మేకలు వురుక్కుంటూ వెలుతున్నాయి.
ఒకప్పుడు అందరికీ కలిసి ఒకే సినిమా. ఇపుడు ఎవడి సినిమా వాడిది. నీ రీల్‌లో నువ్వే హీరో. ఎగిరి గంతులేయ్, జనాల్ని కొరికితిను. పిచ్చెక్కిన జనాలకి పెద్ద పిచ్చోడే మహారాజు.
భయం వున్నంత కాలం భక్తికి మించిన వ్యాపారం లేదు. మార్కెట్‌ని పడగొట్టడం ట్రంప్ వల్ల కూడా కాదు.
రెండు గాడిదలు కలిస్తే బరువుల గురించి మాట్లాడుకుంటాయి. రెండుకాళ్లు పైకి లేపితే యజమాని పళ్లు వూడిపోతాయి. అది తెలియదు కాబట్టే వాటిని గాడిదలంటారు.
కుక్క మెరుగుతుందని పరిశోధన చేస్తే యూనివర్సిటీలు డాక్టరేట్ ఇస్తాయి. నేర్పే వాడికి ఏమీ రాకపోతే వాడే ఉత్తమ గురువు.
యోగులు జీవసమాధి ఎందుకు అవుతారంటే ఈ ప్రపంచంలో వుండడమే అసలైన శిక్షని తెలుసుకుంటారు కాబట్టి.
అన్నీ చూడు, విను,, ఏమీ మాట్లాడకు. నువ్వే ఉత్తమ పౌరుడు.
స్వాముల్ని ప్రజలు నమ్మడమే ప్రజాస్వామ్యం.
మొసలి అసలైన రాజకీయ చిహ్నం. కన్నీళ్లు కారుస్తూ గుటుక్కున తింటుంది. ఎంత అద్భుత కల అయినా దాని జీవిత కాలం ఒక రాత్రే.
గొప్ప పద్యాలన్నీ సీసాలోంచి పుట్టినవే.
కంచికి చేరని కథలన్నీ మద్యం దుకాణానికి చేరుతాయి. చెప్పేవాళ్లే తప్ప వినేవాళ్లు వుండరు. ప్రతి పదం తడబడి లేస్తూ వుంటుంది. గ్లాస్‌లు ఖాళీ అయితే అన్ని క్లాసులు ఒకటే. ప్రతివాడు ఒక మార్క్స్. కొట్టు చీర్స్.
జీఆర్ మహర్షి
anna enti yee garuda puraanam
సూపర్ మహర్షి సర్..
తాగి ఏ చెత్త అయినా రాసుకోండి దానికి పురాణాలని బ్రష్టు పట్టించడం ఎందుకు… ఇద్దరు అమృతం కోసం ప్రయత్నం చేస్తే మరొకరు ఎందుకు తన్నుకుపోవాలి..
మోసం చేసే వాళ్ళు దేవతలు అయ్యారా.. మన అన్న గురించే మాటాడాతున్నారా????
Correction: మంచి కోసం లేదా లోక కళ్యాణం కోసం ఏదైనా (మోసం మాత్రమే కాదు) చేసే వాళ్ళనే దేవతలు అంటారు.
Idi paitya prakopamaa.Vodka prayogamaa?