కుప్పం పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం అనేక మార్పులకు శ్రీకారం చుట్టింది. కుప్పంలో అధికార పార్టీ దౌర్జన్యాలు, విచ్చలవిడిగా డబ్బుల పంపిణీతో ప్రజాస్వామ్యాన్ని ఓడించారని టీడీపీ అధినేత చంద్రబాబు పైకి ఎన్ని మాటలు చెప్పినా …క్షేత్రస్థాయిలో వాస్తవాలేంటో కార్యకర్తలకు బాగా తెలుసు. కుప్పం నియోజకవర్గ వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ మద్దతుదారుల ఓటమి తర్వాత …దిద్దుబాటు చర్యలు చేపట్టేందుకు చంద్రబాబు స్వయంగా అక్కడికి వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది.
ఈ నేపథ్యంలో కుప్పంలో మూడు రోజుల చంద్రబాబు పర్యటన, అలాగే పంచాయతీ ఎన్నికల్లో పార్టీ మద్దతుదారుల ఓటమిపై సమీక్షించేందుకు నియోజకవర్గ కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి సర్పంచ్ అభ్యర్థులుగా పోటీ చేసిన వారితో పాటు కార్యకర్తలు, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ పీఎస్ మునిరత్నం, ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, పీఏ మనోహర్ హాజరయ్యారు.
ఈ సమావేశంలో త్రిమూర్తులుగా పిలుచుకునే మనోహర్, గౌనివారి శ్రీనివాసులు, మునిరత్నంపై సర్పంచ్ అభ్యర్థులతో పాటు కార్యకర్తలు తీవ్రస్థాయి విరుచుకుపడ్డారు. పార్టీ మద్దతుదారుల ఘోర ఓటమికి మీ ముగ్గురి తీరే కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ దగ్గర తగిన ఆర్థిక వనరులు లేవని, సర్పంచ్ బరిలో నిలబడలేమని ఎంత చెప్పినా వినిపించుకోకుండా నిలిపారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తాము భూములు కొదవ పెట్టడంతో పాటు అప్పులపాలు కావాల్సి వచ్చిందని గోడు వెల్లబోసుకున్నారు.
ఆర్థిక సాయం పక్కన పెడితే కనీసం ప్రచారానికి ఏ ఒక్క నాయకుడు రాలేదని నిరసన వ్యక్తం చేశారు. ఇలాగైతే పార్టీ బాగుపడేదెట్లా అని ప్రశ్నించారు. పార్టీ కోసం తామెందుకు అండగా నిలబడాలని నిలదీశారు. సమావేశంలో ముఖ్యంగా గుడుపల్లె, శాంతిపురం మండలాల నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ పీఎస్ మునిరత్నం, ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, పీఏ మనోహర్ వ్యవహార శైలిపై మండిపడ్డారు.
అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించి, కోట్లాది రూపాయలు డబ్బు సంపాదించి, కష్టకాలంలో ఏ మాత్రం పట్టించుకోలేదని మండిపడ్డారు. ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులది శాంతిపురం మండలం.
కార్యకర్తల ఆగ్రహాన్ని చల్లార్చేందుకు క్వారీ యజమాని జోక్యం చేసుకున్నాడు. జరిగిందేదో జరిగిపోయిందని నచ్చ చెప్పే ప్రయత్నం చేశాడు. ఆయనపై కార్యకర్తలు ఒక్కసారిగా ఫైర్ అయ్యారు. “ఒక్కో క్వారీ నుంచి రూ.20 లక్షలు వసూలు చేసి, వైసీపీ చేతిలో పోసింది నువ్వే కదా. నువ్వు కూడా ఇక్కడ మాట్లాడ్డానికి ప్రయత్నిస్తే మర్యాద దక్కదని” హెచ్చరించారు. దీంతో అతను ఖంగుతిన్నాడు.
నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ మునిరత్నం స్పందిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. పంచాయతీ ఎన్నికల్లో ఓటమికి తనను బాధ్యుడ్ని చేయడంపై మనస్తాపం చెందాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…
“మా నాయన జమీందారు తర్వాత అంతటి వాడు. రాజకీయాల్లోకి రాక ముందే నాకు చాలా ఆస్తులున్నాయి. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నష్టపోయాను. ఇంకా చెప్పాలంటే పెట్రోలు బంకులు వంటి సంపాదన మార్గాలు పోగొట్టుకున్నాను. అప్పుల పాలయ్యాను. కావున నాకీ ఇన్చార్చ్ పదవి అక్కర్లేదు. రాజీనామా చేస్తాను” అని ఉద్వేగంగా చెప్పాడు.
ఇదే సందర్భంలో చంద్రబాబు పీఏ మనోహర్ కూడా కార్యకర్తల ఆగ్రహాన్ని జీర్ణించుకోలేకపోయాడు. ఓటమికి తానే ప్రధాన సూత్రధారి అన్నట్టు అందరూ తనను నిందించడాన్ని ఆయన తట్టుకోలేకపోయాడు. దీంతో తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించాడు. సమావేశంలో ఆయన ఏమన్నారంటే…
“నేను పీఏ పదవికి రాజీనామా చేస్తున్నా. ఈ విషయాన్ని సార్(చంద్రబాబు)కు కూడా చెప్పాను. వద్దని ఆయన వారించారు. కానీ నేను మాత్రం పీఏగా పనిచేయనని సార్కు తేల్చి చెప్పాను. సామాన్య కార్యకర్తగా ఉంటా. మార్చి ఒకటి నుంచి కొత్త పీఏ వస్తారు. తిరుపతి నుంచి కొత్త పీఏ రానున్నారు” అని మనోహర్ ప్రకటించాడు. పంచాయతీ ఎన్నికల్లో ఓటమి కుప్పం టీడీపీని కుదిపేస్తోంది. నియోజకవర్గ ఇన్చార్జ్తో పాటు పీఏ కూడా తప్పుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది.