‘ఖర్చు దండగ’.. ఆ మాట ఇప్పుడనగలరా.?

‘అంతరిక్ష ప్రయోగాల కోసం వందల కోట్లు ఖర్చు చెయ్యాల్సిన అవసరం ఏముంది.. ఆ డబ్బుతో వేరే కార్యక్రమాలు చేపట్టొచ్చుగా..’ ఇదీ భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మంగళ్‌యాన్‌’ ప్రయోగం సందర్భంగా…

‘అంతరిక్ష ప్రయోగాల కోసం వందల కోట్లు ఖర్చు చెయ్యాల్సిన అవసరం ఏముంది.. ఆ డబ్బుతో వేరే కార్యక్రమాలు చేపట్టొచ్చుగా..’ ఇదీ భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మంగళ్‌యాన్‌’ ప్రయోగం సందర్భంగా వెల్లువెత్తిన విమర్శల సారాంశం. విచిత్రమేంటంటే ఇస్రోలో పనిచేసిన మాజీ శాస్త్రవేత్త ఈ వ్యాఖ్యలు చేయడం.

గతం గతః ఆ విషయాన్ని పక్కన పెడితే, ఇప్పుడు ఇస్రో చేపడ్తున్న ప్రయోగాలు, పెద్దయెత్తున దేశానికి విదేశీ కరెన్సీ వచ్చేలా చేస్తున్నాయి. గత కొంతకాలంగా ఇస్రో కమర్షియల్‌ శాటిలైట్స్‌ని ప్రయోగిస్తూ వస్తోంది. ఇతర దేశాలకు చెందిన ఉపగ్రహాల్ని, మన దేశం నుంచి అంతరిక్షంలోకి ప్రయోగించడం ద్వారా ఆర్థికంగా ముందడుగు వేస్తోంది ఇస్రో.

తాజాగా ఈ రోజు ఇస్రో అంతరిక్షంలోకి పంపిన పీఎస్‌ఎల్‌వీ ద్వారా నాలుగు విదేశీ ఉపగ్రహాల్ని కక్షలో చేర్చిన విషయం విదితమే. తద్వారా కోట్లాది రూపాయల్ని సమకూర్చుకుంటోంది ఇస్రో. భవిష్యత్తులో వేల కోట్ల రూపాయల్ని ప్రయోగాల ద్వారా ఆర్జించాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఓ పక్క దేశీయ ఉపగ్రహాల్ని పంపుతూనే, మరోపక్క ప్రయోగాల కోసం నిధుల్ని తనంతట తానుగా సమకూర్చుకునే స్థాయికి ఇస్రో ఎదగడం అభినందనీయమే.

ఇప్పుడే కాదు, ఎప్పుడూ ‘ఇస్రో’ ప్రయోగాల్ని దండగ అనలేం. శాస్త్ర సాంకేతిక రంగాల్లో మన సత్తా చాటుకోవాల్సి వుంది. అంతరిక్ష రంగంలో మరీనూ. ఆ ఘనతను, కీర్తినీ దేశానికి తెచ్చిపెడ్తోన్న ఇస్రోపై ‘ఖర్చు దండగ’ అని ఎవరన్నా అంటే అంతకన్నా మూర్ఖత్వం ఇంకొకటుండదేమో.!