రాహుల్ గాంధీ ఎవరో అమ్మాయి పక్కన నిలబడి నైట్ పార్టీలో పాల్గొన్నారంటూ బీజేపీ రాద్ధాంతం చేస్తోంది. దేశ ప్రధాని కావాలనుకుంటున్న నాయకుడు ఇలాగేనా చేసేది అంటూ నిలదీస్తోంది. సాదు సత్సంగులే రాజకీయాల్లో ఉండాలనే విధంగా బిల్డప్ ఇస్తున్నారు బీజేపీ నాయకులు. రాహుల్ సంగతి సరే మరి పవన్ సంగతేంటి..?
జనసేనాని వారికి అనుంగు మిత్రుడే కదా. ఇక్కడ పవన్ వ్యక్తిగత జీవితంలోకి బీజేపీ నేతలు తొంగి చూడరా..? పార్టీలో అమ్మాయి పక్కన రాహుల్ గాంధీ నిలబడితే తప్పా..? ఇక్కడ పవన్ బహు పెళ్లిళ్ల వ్యక్తిగత విషయంపై మాత్రం ఎవరూ నోరు మెదపకూడదా..? ఏక పత్నీ వ్రతుడైన రాముడే బీజేపీకి దేవుడు, మరి పవన్ తో వారి స్నేహాన్ని ఏ పేరుతో పిలవాలి. ఇక్కడ రాహుల్ ను సమర్థించడం లేదు, బీజేపీ వ్యవహారశైలి మాత్రమే చర్చనీయాంశం.
ఉరుము ఉరిమి పవన్ పై పడుతుందా..?
రాహుల్ గాంధీ వ్యక్తిగత జీవితంలోకి బీజేపీ తొంగి చూడటం సమంజసమే అయితే.. బీజేపీలో ఎంతమంది నాయకులు నైట్ పార్టీలకు వెళ్లడం లేదు అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అక్కడితో ఆగడం లేదు.
ఏపీలో బీజేపీ స్నేహితుడు పవన్ కల్యాణ్ సంగతేంటనే ప్రశ్నలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి. పవన్ కల్యాణ్ స్నేహాలు, పెళ్లిళ్లను బీజేపీ సమర్థిస్తుందా అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు.
ఏకపత్నీవ్రతుడే దేవుడు..
ప్రస్తుతం దేశ రాజకీయాల్లో బ్రహ్మచారులదే హవా. ఆ మాటకొస్తే బీజేపీ నేతలు ఏకపత్నీ వ్రతుడైన రాముడిని దేవుడిగా భావిస్తారు. అంటే బహుభార్యత్వానికి వారు పూర్తిగా విరుద్ధమన్నమాట. కానీ బీజేపీ నాయకుల చాటుమాటు వ్యవహారాలు మాత్రం గుట్టు చప్పుడు కాకుండా ఉంటాయి.
ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్యలా ఉంటాయి వీరి వ్యవహారాలు. మరి రాముడిని ఆరాధించే బీజేపీ నేతలకి, పవన్ ఎలా స్నేహితుడయ్యాడో, వారి స్నేహం ఎందుకంత పవిత్రమో చెప్పాల్సిన బాధ్యత లేదా..? రాహుల్ ను విమర్శించే వాళ్లు వాళ్లు ఈ ప్రశ్న వేసుకుంటే మంచిదేమో!
మొత్తమ్మీద రాహుల్ గాంధీ ఎపిసోడ్ లో పవన్ కల్యాణ్ పేరు తెరపైకొచ్చింది. రాహుల్ పర్సనల్ వ్యవహారాలపై ఆసక్తి చూపిస్తున్న బీజేపీ నాయకులు, పవన్ పర్సనల్ వ్యవహారాలపై ఎందుకు దృష్టి పెట్టలేదనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మరి ఏపీ బీజేపీ నేతలు ఈ ప్రశ్నలకు ఏ సమాధానం చెబుతారో లేదో చూడాలి.