ప్రపంచకప్ మాజీ విజేతలను వరసగా ఓడిస్తోంది అప్ఘానిస్తాన్. ఇప్పటికే ఈ ప్రపంచకప్ లో ఇంగ్లండ్, పాకిస్తాన్ లను ఓడించిన ఈ జట్టు తాజాగా శ్రీలంకకు కూడా అలాంటి అనుభవాన్నే ఇచ్చింది. లంకపై అఫ్ఘాన్ జట్టు ఘన విజయాన్నే సాధించింది. ఏడు వికెట్ల తేడాతో శ్రీలంకపై అప్ఘాన్ ఘన విజయాన్ని సాధించింది.
శ్రీలంక నిర్దేశించిన 241 పరుగుల టార్గెట్ ను అప్ఘాన్ జట్టు ఏ మాత్రం తడబాటు లేకుండా చేధించింది. సున్నాకే తొలి వికెట్ ను కోల్పోయినా ఆ తర్వాత లంక బౌలింగ్ ను పెద్దగా ఇబ్బంది లేకుండా అప్ఘాన్ బ్యాట్స్ మెన్ ఎదుర్కొన్నారు. నాలుగో వికెట్ కు అజేయమైన భాగస్వామ్యంతో అప్ఘాన్ బ్యాట్స్ మెన్ ఈ సారి తమ ఖాతాలో మూడో విజయాన్ని జమ చేసుకున్నారు.
ఇంగ్లండ్, పాక్, లంకలపై విజయాలతో ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఈ జట్టు ఐదో స్థానంలో నిలిచింది. ఈ జట్టుకు మరో మూడు మ్యాచ్ లు మిగిలి ఉన్నాయి. అందులో ఒకటి నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలపై మ్యాచ్ లు మిగిలి ఉన్నాయి. నెదర్లాండ్స్ పై విజయం సాధించి, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలతో ఒక మ్యాచ్ లో మరో సంచలనం నమోదు చేసినా… అప్ఘాన్ కు సెమిస్ అవకాశాలు మిగిలే ఉంటాయి కాబోలు!
ప్రత్యేకించి పాయింట్ల పట్టికలో తన కన్నా మెరుగైన స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాల్లో ఒక జట్టును ఓడించినా వ్యవహారం రసవత్తరంగా మారుతుంది. డిఫెండింగ్ చాంఫియన్ ఇంగ్లండ్, మాజీ చాంఫియన్లు పాక్, లంకలను ఓడించిన అఫ్ఘాన్ ను ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలు ఏ మాత్రం తేలికగా తీసుకున్నా.. అఫ్ఘానిస్తాన్ వాటికీ ఇప్పటి వరకూ ఈ జట్టు చేతిలో ఓడిపోయిన మాజీ చాంఫియన్ల పరిస్థితే
ఎదురుకావొచ్చు!