కుదరక కుదరక పెళ్లి కుదిరితే పెళ్లికూతురుకు అఫైర్ వుందన్నట్లుగా వుంది మెగాస్టార్ చిరంజీవి సినిమా వ్యవహారం. కథ..కథ..కథ అంటూ రెండెళ్ల బట్టి కనిపించిన ప్రతి వాళ్లనీ అడిగి అడిగి విసిగిపోయాడు మెగాస్టార్. సినిమాకు కథ తప్ప ఇంకేమైనా కావాలి అనే రకం దర్శకుడు పూరి జగన్నాధ్. కథ అంటే అంత లీనియన్స్ ఆయనకు.
అలాంటిది ఈయన కథ చెప్పాడు..ఆయన ఓకె చేసాడు. అదే పెద్ద సంచలనం. అంతలో అసలు వ్యవహారం బయటపడింది. బివిఎస్ రవి , పూరి చెప్పిన కథ వారి స్వంతం కాదని, ఓ ఔత్సాసిక ఎన్నారై రచయిత కష్టపడి తయారు చేసుకున్నదాన్ని చులాగ్గా కొట్టేసారని మీడియా కోడి కూయడం ప్రారంభించింది. దాంతో ఇప్పుడు దిద్దుబాటు చర్యలు ప్రారంభమయ్యాయి.
చిరుకు అత్యంత విశ్వాసం వున్న రచయితలు పరుచూరి బ్రదర్స్, పూరి, బివిఎస్ రవి కలిసి, ఇప్పుడు శ్రీనగర్ కాలనీలోని ఓ గెస్ట్ హవుస్ లో డిస్కషన్లు ప్రారంభించారట. అసలు ఈకథ, ఆ కథ ఏమేరకు ఒకటి..మరి ఒకటే అయితే ఏం చేయాలి. ఆ రచయితకు క్రెడిట్ లైన్ ఇవ్వాలా..డబ్బులుచ్చుకు కొట్టాలా? లేదా రెండూ కాకుంటే ఈ కథ వదిలి మరొ కథ తీసుకొవాలా అన్నది డిస్కషన్ లో కీలక అంశాలంట.
చిరు అభిప్రాయమైతే, ఇలాంటి కాంట్రావర్సీ వ్యవహారాలు వద్దని, మంచి కథ దొరికాకే చేద్దామన్నదిగా తెలుస్తోంది. కానీ పూరి-బివిఎస్ కలిసి ఈ వ్యవహారాన్ని ఎలాగైనా సద్దుమణిగేలా చేసి, సినిమాను ముందుకు తీసుకెళ్లాలని చూస్తున్నారట. మధ్యలో పరుచూరి బ్రదర్స్ వున్నారు. మరి వారు ఏమంటారో? తాము ఇంతకన్నా మంచి కథ ఇస్తాం అంటారేమో? ఏదైనా ఒకటి మాత్రం గ్యారంటీ అంట, కథ విషయం మొదటికి వచ్చినా ఆగస్టు 22న కొబ్బరి కాయ కొట్టడం మాత్రం చేసేస్తారట.