దేశంలో పర్యాటకులకు అత్యంత వ్యయభరితమైన నగరాలుగా గుర్తించిన వాటిలో ముంబయి తొలి స్థానం దక్కించుకుంది. పెరుగుతున్న హోటల్ టారిఫ్‌ల ఆధారంగా నిర్ణయించే ఈ ర్యాంక్‌లలో హైదరాబాద్ 8వ స్థానంలో నిలిచింది. ఏటేటా వరుసగా పెరుగుతూ వచ్చిన రూమ్ టారిఫ్‌లు గత ఏడాది తగ్గడంతో తదనుగుణంగా ఈ తెలంగాణ రాజధాని ర్యాంక్ సైతం దిగజారింది.
ఎప్పటికప్పుడు ప్రపంచవ్యాప్తంగా హెటల్ పరిశ్రమ హెచ్చు తగ్గులను విశ్లేషించే హోటల్ డాట్‌కామ్‌కు చెందిన హోటల్ ప్రైస్ ఇండెక్స్ (హెచ్పిఐ) అందించిన వివరాల ప్రకారం… హోటల్ రూమ్ టారిఫ్‌ల పెరుగుదలలో గత ఏడాది 5శాతం వృధ్ది నమోదు చేసిన ముంబయి దేశంలోనే తాత్కాలిక బసకు అయ్యే ఖర్చు పరంగా అత్యంత వ్యయభరితమైన నగరంగా నిలిచింది. ఈ నగరంలో గత ఆర్నెళ్లలో సగటు రూమ్ అద్దె ఒక రాత్రికి రూ.8,091 చొప్పున ట్రావెలర్స్ చెల్లించారు. ఇదే గత ఏడాది ఇదే సమయంలో రూ.7,694 మాత్రమే.
ఒక రాత్రి బసకు రూ.6677 సగటు ధరతో ఢిల్లీ రెండవ స్థానంలో నిలవగా, బెంగుళూరు, పూనెలు ఆ తర్వాతి స్థానాలను దక్కించుకున్నాయి. రూ. 6263 సగటుతో కోల్‌కత, రూ.5940తో గోవా వరుస స్థానాలు దక్కించుకున్నాయి. అయితే చెన్నై మాత్రం గత ఏడాదికీ ఈ ఏడాదికీ పెద్దగా మార్పు చేర్పులు లేకుండా కొనసాగుతోంది. అన్ని నగరాల్లో కన్నా డబ్బుకు తగిన విలువను వసతులను అందివ్వడంలో తనదైన ప్రత్యేకతను నిలబెట్టుకుంటూ జైపూర్ రాత్రి బస ధర సగటున రూ.5,062తో 4శాతం వృధ్దిని నమోదు చేసింది.
ఈ విశ్లేషణలో రూమ్ టారిఫ్ ఒక నైట్ స్టేకు రూ..5339 ధరతో 8వస్థానంలో నిలిచిన హైదరాబాద్ గత ఏడాది కన్నా 3శాతం తగ్గుదల నమోదు చేయడం విశేషం.