రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న ప్రతి దుస్సంఘటననూ డబ్బులతో చల్లబరిచేయవచ్చునని ఒక వేళ ప్రభుత్వం భావిస్తే అంతకన్నా పిచ్చితనం ఇంకోటి ఉండదని రిషితేశ్వరి ఆత్మహత్యోదంతం అనంతర పరిణామాలు నిరూపిస్తున్నాయి. ఈ కేసులో బయటపడిన ప్రతి సాక్ష్యమూ వేలెత్తి చూపిస్తున్న ఆర్కిటెక్చర్ కళాశాల ప్రిన్సిపాల్ బాబూరావుపై ప్రభుత్వం ఇంతదాకా చర్యలు చేపట్టకపోవడం, తాజాగా అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా తాము ఈ కేసు విషయంలో ప్రభుత్వం చేపట్టిన చర్యలు పట్ల సంతృప్తిగా ఉన్నామన్నట్టు ప్రభుత్వ పెద్ధలు అంటుండడంతో రిషితేశ్వరి తండ్రి మురళీకృష్ణ గురువారం స్పందించారు.
ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఒక లేఖ రాశారు. దానిలో ప్రిన్సిపాల్ బాబూరావుపై చర్యలు ఏం తీసుకుంటున్నారని ప్రశ్నించారు. తమకు ప్రభుత్వం ఇంటి స్థలం, డబ్బు ఇచ్చినంత మాత్రాన తాము కాంప్రమైజ్ అయిపోయామని భావించవద్దంటూ ఆయన సున్నితంగానే హెచ్చరించారు.
ఈ సాయం మానవతా దృక్పధంతో చేస్తున్నామని సిఎం ప్రకటించారని ఆయన గుర్తు చేశారు. తమకు ఆర్థిక సాయం అందించడం అంటే న్యాయం జరిగినట్టు కాదని, ప్రిన్సిపాల్ సమక్షంలోనే ర్యాగింగ్ జరిగింది కాబట్టి అతనిపై తగిన చర్యలు తీసుకుంటేనే న్యాయం జరిగినట్టు భావిస్తామని ఆయన లేఖలో స్పష్టం చేశారు.