ప్రజల్లోకి వెళ్లాలనే ఫైర్ లోకేశ్‌లో ఉంటే బాధేముందని టీడీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నారు. భవిష్యత్ రథసారథి అయిన లోకేశ్ కేవలం సోషల్ మీడియాకే పరిమితమయ్యారనే ఆవేదన, ఆక్రోశం టీడీపీ శ్రేణుల్లో ఉంది. మరో రెండేళ్లలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలు టీడీపీ భవిష్యత్‌కు అగ్ని పరీక్ష. ఈ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రాకపోతే మాత్రం, ఆ పార్టీ భవిష్యత్ ప్రశ్నార్థకమే అనే వాదన తెరపైకి వచ్చింది.
ఈ నేపథ్యంలో చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ జనంలోకి వెళ్లేందుకే తామంటే తామని పోటీ పడుతున్నట్టు జగన్ మీడియా ప్రచారంలోకి తెచ్చింది. 72 ఏళ్లకు పైబడిన వయసులో కూడా చంద్రబాబు శ్రమిస్తున్న తీరు పార్టీలకు అతీతంగా పాజిటివ్‌గా తీసుకోవాల్సిన అంశం. వయసును లెక్క చేయకుండా, అనారోగ్య సమస్యలను పట్టించుకోకుండా పార్టీని బతికించుకోడానికి చంద్రబాబు కష్టపడుతుంటే, తనయుడు లోకేశ్ మాత్రం సోషల్ మీడియాలో పోస్టింగ్‌లు పెట్టుకుంటూ కాలం గడుపుతున్నారనే విమర్శలు సొంత పార్టీలో బలంగా ఉన్నాయి.
జూన్ నుంచి తాను కూడా జనంలోకి వెళుతున్నట్టు రెండు రోజుల క్రితం లోకేశ్ ప్రకటించారు. చంద్రబాబు మాత్రం ఇప్పటి నుంచే జనంలోకి వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు. రానున్న రోజుల్లో చంద్రబాబు బస్సుయాత్ర చేపడతారని సమాచారం. జనానికి చేరువయ్యేందుకు లోకేశ్ ఏ రీతిలో వెళ్తారనేది ఇంకా స్పష్టత రాలేదు. కానీ సోషల్ మీడియాకే పరిమితమైతే వర్కౌట్ కాదని లోకేశ్‌కు తెలిసొచ్చింది.
సైకిల్ యాత్ర నిర్వహిస్తారనే ప్రచారం జరుగుతోంది. నిజంగా లోకేశ్ ఆ పని చేస్తే టీడీపీకి మంచిరోజులు వచ్చినట్టే. ఎందుకంటే ఇంకా పాత పద్ధతుల్లో బలమైన అధికార పక్షాన్ని ఎదుర్కోవచ్చని టీడీపీ అనుకుంటే అంతకు మించిన అజ్ఞానం మరొకటి వుండదు. భవిష్యత్ మనదే అని చంద్రబాబు మాత్రం పార్టీ నాయకులు, కార్యకర్తలకు భరోసా ఇస్తున్నారు. ఈ భరోసా కేవలం మాటలకే పరిమితమా లేక ఆచరణకు నోచుకుంటుందా? అనేది కాలమే తేల్చి చెప్పాల్సి వుంది.
Vaadu fire aithe nuvvu velli chali kachuko raaa G. A