విజ‌యసాయిరెడ్డిని ప‌ట్టించుకోని ‘సాక్షి’

వైసీపీలో అత్యంత కీల‌క నాయ‌కుడైన రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌ను సొంత ప‌త్రిక ‘సాక్షి’ ప‌ట్టించుకోలేదు. నేపాల్‌లో ఓ నైట్‌క్ల‌బ్‌లో చైనా రాయ‌బారితో క‌లిసి కాంగ్రెస్ అగ్ర‌నాయ‌కుడు రాహుల్‌గాంధీ క‌నిపించ‌డం భార‌త్‌లో తీవ్ర రాజ‌కీయ…

వైసీపీలో అత్యంత కీల‌క నాయ‌కుడైన రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌ను సొంత ప‌త్రిక ‘సాక్షి’ ప‌ట్టించుకోలేదు. నేపాల్‌లో ఓ నైట్‌క్ల‌బ్‌లో చైనా రాయ‌బారితో క‌లిసి కాంగ్రెస్ అగ్ర‌నాయ‌కుడు రాహుల్‌గాంధీ క‌నిపించ‌డం భార‌త్‌లో తీవ్ర రాజ‌కీయ దుమారానికి తెర‌లేచింది. 

వివాహ వేడుక‌కు హాజ‌రైన రాహుల్‌పై బీజేపీ వ్యూహాత్మ‌కంగా రాజ‌కీయ దాడి చేస్తోంది. ఈ వ్య‌వ‌హారంలో వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి దూరారు. రాహుల్‌ను త‌ప్పు ప‌డుతూ ట్వీట్ చేయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

అయితే విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌ను వైఎస్ జ‌గ‌న్ సొంత ప‌త్రిక సాక్షి అస‌లు ప‌ట్టించుకోక‌పోవ‌డం గ‌మ‌నార్హం. విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌కు ‘ఈనాడు’ ప‌త్రిక ప్రాధాన్యం ఇచ్చింది. విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ ఏంటో తెలుసుకుందాం.

‘నేపాల్‌లో చైనా రాయ‌బారితో రాహుల్ ఉన్న‌ట్టు వీడియోలో ఉంది. చైనా హ‌నీట్రాప్‌లు పెరుగుతుండ‌డం క‌ల‌వ‌ర‌పెడుతోంది. రాహుల్‌గాంధీ కాంగ్రెస్‌లో ప‌రిస్థితి చ‌క్క‌దిద్దుకోకుండా మోదీ యూర‌ప్ ప‌ర్య‌ట‌న‌పై అన‌వ‌స‌ర ప్ర‌శ్న‌లు వేస్తున్నారు’ అని విమ‌ర్శ‌లు చేశారు. ఈ ట్వీట్‌కు సాక్షిలో స్థానం క‌ల్పించ‌క‌పోవ‌డంపై ర‌క‌ర‌కాల ప్ర‌చారం జ‌రుగుతోంది. 

రాహుల్ వ్య‌వ‌హారంపై విజ‌య‌సాయిరెడ్డి స్పందించాల్సిన ప‌నిలేద‌ని వైసీపీ భావిస్తోంద‌ని స‌మాచారం. ఇదేదో బీజేపీ మెప్పు కోసం విజ‌య‌సాయిరెడ్డి ఉబ‌లాట‌ప‌డ్డార‌నే విమ‌ర్శ‌కు అవ‌కాశం ఇచ్చిన‌ట్టుగా ఉంద‌నే అభిప్రాయం పార్టీలో ఉన్న‌ట్టు తెలిసింది. రాహుల్‌పై బీజేపీ, కాంగ్రెస్ సోష‌ల్ మీడియా వేదిక‌గా విమ‌ర్శ‌లు, ప్ర‌తివిమ‌ర్శ‌లు చేసుకోవ‌డంపై వార్త ఇవ్వ‌డం వ‌ర‌కే సాక్షి ప‌రిమితం కావ‌డం గ‌మ‌నార్హం.