ఆమె కదలదు, మెదలదు. మంచంపైనే పడుకుని ఉంటుంది. ఆహారమేమో రోజుకు రెండు టీ స్పూన్ల నీళ్లు మాత్రమే. ఆమె. వయసేమో 82 ఏళ్లు. ఆమె పేరు బదానీ దేవి. వైద్య పరిశోధనలకు అందని ఓ విచిత్రం.రాజస్థాన్‌లోని జైపూర్‌కి 330 కి.మీ దూరంలో ఉన్న బికనీర్ అనే ఊరు బదానీదేవి నివాసం. కొంతకాలం క్రితం ఆమె జబ్బు పడ్డారు. ఆ తర్వాత సంతారా అనే జైనుల సంప్రదాయానికి జై కొట్టారు. ఈ సంతారా అనేది శతాబ్ధాల నాటి జైన సంప్రదాయం.
దీని ప్రకారం చనిపోతానని భావించిన వారు అప్పటిదాకా ఆహారం తీసుకోబోమని, ఉపవాసం ఉంటామని అంగీకరిస్తూ చేసే ప్రమాణమే సంతారా. అయితే ఈ సంప్రదాయాన్నిఅనుసరించే చాలా మందికి భిన్నంగా బదానీ దేవి కొన్ని నెలలుగా బతికే ఉంది. తన ముగ్గురు కొడుకులు, కోడళ్లు, మనమళ్లు సమక్షంలో ఆమె తన ఇంట్లో మంచంపైనే జీవితాన్నికొనసాగిస్తోంది.
తనకు నీళ్లు కావాలంటే వేలు పైకెత్తి సంజ్ఞ చేస్తుందని, ఆపేయమంటూ ఒక గుటక వేశాక తిరిగి వేలు పైకెత్తుతుందని ఆమె వారసులు అంటున్నారు. గత కొంతకాలంగా ఆమెకు రెండు పూటలా నీళ్లు తాగించడం, స్నానం చేయించడంతో పాటు ఆమె చుట్టూ చేరి ప్రార్థనా గీతాలు పాడడం కూడా క్రమం తప్పక నిర్వహిస్తున్నారు ఈ కుటుంబ సభ్యులు.
కొన్ని నెలల క్రితం సంతారా మీద హైకోర్టులో న్యాయవివాదం నడిచి, చివరకు దాన్ని అక్రమంగా కోర్టు నిర్ధారించింది. చట్ట వ్యతిరేకమని తేల్చింది. అయితే ఆ తర్వాత సుప్రీం కోర్టుకు వెళ్లిన జైనమతస్థులు ఇది రాజ్యాంగబద్ధంగా మతాచారాలకు వచ్చిన హక్కు అని వాదించి తీర్పును తమకు అనుకూలంగా తెచ్చుకోగలిగారు. అదే సమయంలో బదానీ కుటుంబ సభ్యులు సైతం ఈ కోర్టు తీర్పు కోసం ఆత్రుతగా ఎదురు చూశారు. చివరకు న్యాయం తమ పక్షాన ఉన్నట్టు తేలడంతో హమ్మయ్య అని నిట్టూర్చారు.
ఎన్నేళ్లు, ఎన్ని రోజులు బతుకుతుందో తెలీకున్నా… ఆమెకు రెండు స్పూన్ల నీళ్లతో రుణం తీర్చుకుంటూ ఆమె చుట్టూ చేరిన ఆ కుటుంబ సభ్యుల్లో ఆమె పట్ల తరగని ప్రేముంది. అంతకు మించి ఆమెకు బలాన్నిచ్చే ఆహారం ఏముంది?
-ఎస్బీ