ఇంతలో ఎంత తేడా? మొన్నటి వరకూ కోర్టుల్లో ఉప్పూ, నిప్పుల్లా సాగిన ఏపీ ప్రభుత్వం, ఏపీ ఎస్ఈసీలు ఇప్పుడు ఒకే వాదనకు కట్టుబడ్డాయి, ఒకే వాదనను వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ హై కోర్టులో ఈ చిత్రమైన దృశ్యం చోటు చేసుకుంది.
ఏపీలో స్థానిక ఎన్నికల నిర్వహణ విషయంలో ఇప్పటి వరకూ ఏపీ ప్రభుత్వం, ఏపీ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఎంతగా విబేధించుకున్నాయో వేరే చెప్పనక్కర్లేదు. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీరును తప్పు పడుతూ ప్రభుత్వం పలుదఫాలుగా కోర్టుకు ఎక్కింది. నిమ్మగడ్డ కూడా పలు సార్లు ప్రభుత్వం పై ఫిర్యాదు చేస్తూ కోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం తనకు సహకరించడం లేదంటూ కూడా పిటిషన్లు వేశారు.
ఎన్నికల నిర్వహణ విషయంలో ఒకరు ఎడ్డెమంటే మరొకరు తెడ్డెమన్నారు. ఇలాంటి విబేధాలతో ఆఖరికి బహిరంగ వ్యాఖ్యలు, లేఖల వరకూ వచ్చింది వ్యవహారం. ఇలా ఎవరికి వారు తమకున్న రాజ్యాంగబద్ధమైన అధికారాలు, హక్కులు అంటూ మాట్లాడారు. చివరకు ఎస్ఈసీ కోరుకున్నట్టుగా ఎన్నికలు జరిగాయి, జరుగుతున్నాయి.
అయితే పంచాయతీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలతో కొంతమందికి చురుక్కుమంది. అందుకే ప్రస్తుతం సాగుతున్న మున్సిపోల్స్, ఎంపీటీసీ-జడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియను ఎలాగోలా అడ్డుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు. ఈ ఎన్నికల ప్రక్రియను గతంలో ఆగిన చోట నుంచినే నిర్వహించడంపై కొంతమందికి అభ్యంతరాలున్నాయి. ఎలాగైనా మొదటి నుంచి ఈ ప్రక్రియను మొదలుపెట్టిస్తే.. అదో తృప్తిగా ఉంది. వాళ్లు కోర్టును ఆశ్రయించారు. అందుకు సంబంధించి వాదోపవాదాలు ముగిశాయి. తీర్పు రిజర్వడ్ లో ఉంది.
ఇక్కడ అసలైన విశేషం ఏమిటంటే.. ఈ పిటిషన్లపై విచారణలో అటు ఏపీ ఎస్ఈసీ తరఫు న్యాయవాది, ఇటు ప్రభుత్వం తరఫు అడ్వొకేట్ జనరల్ ఒకే వాదన వినిపించారు. స్థానిక ఎన్నికలు ఆగిన చోట నుంచి నిర్వహించడం సబబే అని అటు ఎస్ఈసీ తరఫు న్యాయవాది, ఇటు అడ్వొకేట్ జనరల్ బల్లగుద్ది చెప్పారట!
మొన్నటి వరకూ కోర్టుల్లో వైరి వర్గాలుగా.. ఒకరి తీరుపై మరొకరు పరిహాసం ఆడినట్టుగా ఈ ఇరు వర్గాల న్యాయవాదులు వాదించుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఎన్నికల నిర్వహణకు మాత్రం.. ఇరు వైపు న్యాయవాదులూ గట్టిగా వాదించారు. పిటిషనర్ల అభ్యంతరాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు! మరి ఇప్పటి వరకూ అనేక విషయాల్లో విబేధించుకున్న ఎస్ఈసీ, ప్రభుత్వం ఇప్పుడు ఒకే మాటకు కట్టుబడటం విశేషమైతే, తీర్పు రిజర్వ్ కావడం ఆసక్తిదాయకంగా మారింది.