పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చిత్తు చిత్తు అయినా.. ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మాత్రం 38 శాతంతో మొదలుపెట్టి.. 40 శాతం వరకూ తమ పార్టీ విజయం సాధించిందని చెప్పుకుంటూ ఉన్నారు. ఒకవేళ అది నిజమే అనుకున్నా.. తమ పరిస్థితి డొల్లగా ఉందని చంద్రబాబు నాయుడే చెప్పుకున్నట్టు.
ఎందుకంటే.. ఆయన పార్టీకి గత సార్వత్రిక ఎన్నికల్లో వచ్చింది కూడా 40 శాతం ఓట్లే. ఇప్పుడూ అంతే శాతమంటే ఏం పుంజుకున్నట్టు? అందులోనూ.. 2019లో జగన్ ది గాలివాటు విజయం అని చంద్రబాబు నాయుడు అనేక సార్లు చెప్పారు. గాలివాటు విజయం అయితే.. ఈ పాటికి జగన్ పై భ్రమలు తొలగిపోయి ఉండాలి కదా, టీడీపీ ఏ 60 శాతం పంచాయతీల్లోనే నెగ్గి ఉండాలి కదా! అయితే ఓటమిపై కుంటి సాకులు చెప్పుకుంటూ, మరోవైపు 40 శాతం సీట్లను నెగ్గినట్టుగా ప్రకటించుకుంటూ చంద్రబాబు నాయుడు కామెడీలు చేస్తున్నారు.
ఇక ఈ అంశంపై వాదనలు మరెంతో కాలం జరగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. సార్వత్రిక ఎన్నికల తర్వాత ఒక బిగ్ రిజల్ట్ త్వరలోనే రాబోతోంది. జగన్ పాలనపై జనం ఏమనుకుంటున్నారు? చంద్రబాబు పట్ల ఏపీ జనాలు ఎలాంటి ధోరణితో ఉన్నారు, జనసేన-బీజేపీ కొత్త పొత్తు ఎలాంటి ప్రభావాన్ని చూపుతోంది? అనే అంశాలపై అతి త్వరలోనే స్పష్టత రాబోతోంది.
ఏకంగా 90 లక్షల మంది తమ తీర్పును ఇవ్వబోతున్నారు. పంచాయతీ ఎన్నికల్లో అంతకన్నా ఎక్కువమందే స్పందించినా, అవి పార్టీల గుర్తుల మీద జరిగినవి కావు. పార్టీ మద్దతుదారుల విషయంలో కూడా ప్రజల ధోరణి భిన్నంగా ఉండొచ్చు.
తమకు కావాల్సిన వ్యక్తి, తమకు నచ్చని పార్టీ మద్దతుతో పోటీ చేసినా ప్రజలు సపోర్ట్ చేసి ఉండే అవకాశాలుంటాయి. అలాగే తమకు నచ్చే పార్టీ తరఫున నచ్చని వ్యక్తి పోటీ చేసిన సందర్భాల్లో నచ్చని పార్టీ అభ్యర్థికే ఓటేసే వాళ్లూ కోకొల్లలు. కాబట్టి పంచాయతీ ఎన్నికల తీర్పులో కొంత అస్పష్టత ఉన్నట్టే. కానీ అది పాక్షికమైనది. అలాంటి వాదనలకు అవకాశమే లేని ఎన్నికలు స్థానిక ఎన్నికలు!
ఏపీలోని కార్పొరేషన్లకు, మున్సిపాలిటీలకూ మార్చి 10న జరిగే పోలింగ్ లో ఏకంగా 90 లక్షల మంది ఓటేయడానికి అవకాశం ఉంది. కనీసం 60 నుంచి డెబ్బై శాతం పోలింగ్ జరిగినా.. 50 లక్షల మందికి పైనే ఓటేయనున్నారు! ఇలా ఒక బిగ్ శాంపిల్ రాబోతోంది. అది కూడా జగన్ పాలన దాదాపు రెండేళ్లను పూర్తి చేసుకోబోతున్న తరుణంలో. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరిగిన దాదాపు 23 నెలల తర్వాత మున్సిపోల్స్ జరగబోతున్నాయి. ఇలా జగన్ రెండేళ్ల పాలనపై రిఫరండం పార్టీ గుర్తుల మీదే జరగబోతోంది.
ఈ ఎన్నికల్లో ఎవరిది పై చేయిగా నిలిస్తే.. వారికి సానుకూలత కొనసాగుతున్నట్టే. అప్పుడు ప్రత్యేకంగా ప్రెస్ మీట్లు పెట్టి తమకు ఎంత శాతం ఓట్లు వచ్చాయి, ఎంత శాతం సీట్లలో తమ వాళ్లు నెగ్గారు? అనే అంశాలపై పార్టీల నేతల వివరణలు ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఎవరి సత్తా ఏమిటో గుర్తులు, వచ్చే ఓట్ల ద్వారానే బయటపడుతుంది.
జగన్ పాలనపై వ్యతిరకేత అంటూ ఇప్పటికే ప్రతిపక్షాలు పలు అంశాలను ప్రస్తావించాయి. వాటి ప్రభావం ఏపాటిదో కూడా స్థానిక ఎన్నికలతో తేలిపోతుంది. ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ భవితవ్యాన్ని స్థానిక ఎన్నికలు కంప్లీట్ గా డిసైడ్ చేయబోతున్నాయి.
ఈ స్థానిక ఎన్నికల్లో గనుక టీడీపీ సార్వత్రి ఎన్నికల స్థాయిలోనే ఓడిపోతే.. చంద్రబాబు నాయుడు పార్టీ పగ్గాలను వదిలి మరొకరికి అవకాశం ఇవ్వడం టీడీపీని కాపాడే నిర్ణయం అవుతుంది అనే పరిస్థితులున్నాయి ప్రస్తుతం. స్థానిక ఎన్నికల్లో చిత్తయితే.. టీడీపీలోనే తిరుగుబాటు వచ్చినా ఆశ్చర్యం లేదేమో!