నిన్న రాత్రి ఏబీఎన్ చానల్ డిబేట్లో చోటు చేసుకున్న పరిణామాలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయి. అమరావతిపై చర్చ కాస్త రచ్చకు దారి తీసింది. ఏపీ బీజేపీ ముఖ్యనేత విష్ణువర్ధన్‌రెడ్డిపై అమరావతి జేఏసీ నేత శ్రీనివాసరావు చెప్పుతో దాడి చేయడం విమర్శలకు దారి తీసింది.
లైవ్‌లో చూసిన ప్రేక్షకులకు అంతటితో ఆ ఎపిసోడ్ ముగిసిందని అనుకున్నారు. కానీ ఏబీఎన్ ఉద్యోగుల నుంచి అందుతున్న విశ్వసనీయ సమాచారం మేరకు ఏబీఎన్ ఆఫ్ స్క్రీన్‌లో మరిన్ని అన్‌సీన్ దృశ్యాలు చోటు చేసుకున్నాయి. ఆఫ్ స్క్రీన్‌లో బీజేపీ నేత విష్ణుకు మరింత ఘోర అవమానం జరిగినట్టు స్పష్టమైన సమాచారం.
విష్ణుపై దాడి జరిగిన తర్వాత లైవ్ కట్ అయ్యింది. ఆ తర్వాత కూడా విష్ణుపై శ్రీనివాసరావు మరో చెప్పుతో దాడికి తెగబడినట్టు ఉద్యోగుల నుంచి అందుతున్న సమాచారం.
దీంతో ఏబీఎన్ సిబ్బంది, ప్యానలిస్టులు శ్రీనివాసరావును అదుపులోకి తీసుకుని, బయటికి పంపినట్టు చెబుతున్నారు. లైవ్‌లో తమ పార్టీ నాయకుడిపై శ్రీనివాసరావును దాడిని చూసిన తెలంగాణ బీజేపీ నాయకులు కాసేపటికే ఏబీఎన్ స్టూడియోకు వెళ్లారు.
నేరుగా డిబేట్ రూంలోకి వెళ్లి శ్రీనివాసరావు కోసం వెతికారు. కానీ అప్పటికే అతను వెళ్లిపోవడంతో డిబేట్ ముగిసే వరకూ బీజేపీ నేతలు అక్కడే ఉన్నారు. డిబేట్ తర్వాత శ్రీనివాసరావు సెల్ నంబర్ , చిరునామాను ఏబీఎన్ యాజమాన్యం దగ్గర తీసుకున్నారు.
అతను గచ్చిబౌలిలో ఉంటాడనే సమాచారం తెలుసుకుని, అప్పటికప్పుడే రెండు వాహనాల్లో కార్యకర్తలు శ్రీనివాసరావును వెతుక్కుంటూ వెళ్లారు. విష్ణు మాత్రం చాలా సంయమనం పాటించాడు. అవమాన భారంతో ఇంటిముఖం పట్టాడు.