డబ్బుంటే, సినిమా తారలైతే, పలుకుబడి వుంటే నిబంధనల్ని అతిక్రమించి తప్పతాగి మరీ వాహనం నడిపి, రోడ్డుపై వెళ్తున్నవారినో, రోడ్డు పక్కనే నిద్రిస్తున్నవారినో చంపేయొచ్చని సల్మాన్‌ఖాన్ ఉదంతం నిరూపించిందన్న వాదన ప్రముఖంగా విన్పిస్తోంది.
13 ఏళ్ళ క్రితం తప్పతాగి సల్మాన్‌ఖాన్, తన కారుతో రోడ్డుపై నిద్రిస్తున్న వ్యక్తుల్ని ఢీ కొట్టాడు. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. అప్పటినుంచీ ఇప్పటిదాకా ఈ కేసు విచారణ సాగుతూనే వుంది. పదమూడేళ్ళకు జైలు శిక్ష పడితే, వెను వెంటనే మధ్యంతర బెయిల్ వచ్చింది. రెండ్రోజుల్లోనే సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పుని హైకోర్టు కొట్టి పారేసింది.
అయితే, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో పలువురు సినీ ప్రముఖులు పట్టుబడ్తున్నప్పుడు వారికి జరీమానాలు విధించడం లేదా, వాహనాన్ని సీజ్ చేయడం.. ఇవేవీ కాకపోతే జైలుకు పంపడం వంటి సందర్భాల్ని నిత్యం చూస్తూనే వున్నాం. విచిత్రంగా సల్మాన్‌ఖాన్ తప్పతాగి వాహనాన్ని నడిపి ఓ వ్యక్తి మృతికి కారణమైతే, చాలా తేలిగ్గా మధ్యంతర బెయిల్ వచ్చేసి, ఏకంగా సెషన్స్ కోర్టు విధించిన ఐదేళ్ళ జైలు శిక్షను హైకోర్టు సస్పెండ్ చేయడం సహజంగానే అందర్నీ ఆలోచింపజేసింది.
‘దేశంలో ఎంతోమంది బెయిల్ దొరక్క నానా తంటాలూ పడుతున్నారు. వారందరికీ సల్మాన్‌ఖాన్‌లానే సత్వరంగా కేసులు పరిష్కారమైతే ఎంత బావుణ్ణు..’ అని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు ఎడా పెడా పడిపోతున్నాయి. మన దేశంలో అందరికీ ఒకే రకమైన రీతిలో ‘న్యాయం’ అందడంలేదు.. అనే కామెంట్లకు ‘లైక్’లు విపరీతంగా వస్తున్నాయి. కామెంట్లు, ట్వీట్లతో సల్మాన్ ఉదంతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది.